పేదలను గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-07-17T10:01:15+05:30 IST

కరోనా కష్టకాలంలో పేదవర్గాలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

పేదలను గాలికొదిలేసిన ప్రభుత్వం

అజిత్‌సింగ్‌నగర్‌, జూలై 16: కరోనా కష్టకాలంలో పేదవర్గాలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలను ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం రాష్ట్ర నిధులతో ఒక్కరికయినా సాయం చేసిందా అని ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. తక్షణం 3నెలల విద్యుత్‌ బిల్లులు రద్దు చేసి తెల్లరేషన్‌కార్డుదారులందరికీ రూ.10 వేలు జీవన భృతిగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ టీడీపీ పిలుపు మేరకు 58వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో అజిత్‌సింగ్‌నగర్‌ కార్యాలయంలో గురువారం నిరశన దీక్ష జరిగింది. ఈ దీక్షలను బొండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, ప్రయివేటు స్కూళ్ల టీచర్లు, కళాశాలల అధ్యాపకులకు ప్రభుత్వమే ఒక నెల జీతం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలోను నిరశన దీక్షలు చేపట్టి, ప్రజలకు టీడీపీ అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి తరలిస్తున్న కోట్లాది రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారని, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అర్బన్‌ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్‌ పిరియా జగదాంబ, సోమేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-17T10:01:15+05:30 IST