20 నుంచి వైకుంఠ నారాయణుడి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-06-19T05:54:23+05:30 IST

రాజోలి వైకుంఠ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

20 నుంచి వైకుంఠ నారాయణుడి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న వైకుంఠ నారాయణస్వామి ఆలయం

- చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

రాజోలి, జూన్‌ 18 : రాజోలి వైకుంఠ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా యి. స్వామి వారి కల్యాణం, రథోత్సవం, స్వామి వారి జలక్రీడలు ఉత్సవాలలో ప్రధాన కార్యక్రమాలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఎనిమిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు 20న  పుణ్యవచనం, అలంకరణ సేవ, అంకురార్పణ, గరుడ సేవ నిర్వహిస్తారు. 21న అభిషేకాలు, అగ్నిప్రతిష్ఠ, నిత్యహోమం, ధ్వజారోహణం, పూజలు ఉంటాయి. సాయంత్రం పెదశేష వాహనసేవ, హనుమత్‌ వాహన సేవా చేస్తారు. 22న చినశేష వాహనసేవ, చంద్రప్రభ వాహనసేవ నిర్వహిస్తారు. 23న శ్రీదేవి, భుదేవి, లక్ష్మీ సమేత వైకుంఠనారాయణ స్వామి కల్యాణోత్సవం, అనంతరం సర్వభూపాల వాహనసేవ, హంసవాహన సేవలు ఉంటాయి. 24న సూర్యప్రభ వాహనసేవ, రాత్రి కల్పవృక్ష వాహనసేవ నిర్వహిస్తారు. 25న ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో పుష్పరథంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 26న ప్రత్యేక సేవ, 27న నాగవెల్లి, చక్రస్నానం, ఉత్సవ మూర్తులకు నైవేద్యాల సమర్పణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎండోమెంటు చైర్మన్‌ కోటకొండ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు కోరారు. 

Updated Date - 2021-06-19T05:54:23+05:30 IST