హెల్త్‌ సెంటర్ల నిర్మాణ పనులకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-12-07T05:19:47+05:30 IST

పారిశ్రామిక ప్రాంతంలోని 40, 58, 59, 63 వార్డులలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది.

హెల్త్‌ సెంటర్ల నిర్మాణ పనులకు బ్రేక్‌
ములగాడలో ఆస్పత్రి నిర్మాణ పనులు నిలిచిపోయిన దృశ్యం

బిల్లులు మంజూరు కాకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టర్లు

మల్కాపురం, డిసెంబరు 6 : పారిశ్రామిక ప్రాంతంలోని 40, 58, 59, 63 వార్డులలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌  నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచి పోయాయి. ఒక్కో హెల్త్‌ సెంటర్‌ను రూ.80 లక్షలతో నిర్మించేందుకు టెండర్లు పిలవగా, జూన్‌ నెలలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు వచ్చే ఏడాది జనవరికి పూర్తి కావాల్సి ఉంది. అయితే బిల్లులు మంజూరు కాని కారణంగా పనులను నిదానంగా చేస్తున్న కాంట్రాక్టర్లు గత వారం రోజుల నుంచి పూర్తిగా నిలిపి వేశారు. పనులు ప్రారంభించి ఆరు నెలలు అవుతున్నా ఒక్క బిల్లు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు చెల్లిస్తేనే పనులు పునఃప్రారంభిస్తామని అధి కారులకు కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ఇప్పటికే బిల్లులు ఇవ్వకపోవడంతో వార్డులో పలు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా నిలిచిపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. త్వరలోనే ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయని ఆశించిన ఆయా ప్రాంతవాసులకు నిరాశే ఎదురైంది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆస్పత్రుల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-07T05:19:47+05:30 IST