లంచావతారులు

ABN , First Publish Date - 2021-03-03T06:40:50+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా లంచగొండులుగా మారి సర్కారుకు సవాలు విసురుతున్నారు.

లంచావతారులు

జిల్లాలో విస్తరిస్తున్న లంచాలరాజ్యం 

ప్రతీశాఖలో పతాకస్థాయికి అవినీతి 

ఏసీబీకి పట్టుబడుతున్నా.. తగ్గని లంచాలు 

రియల్‌ ఎస్టేట్‌ కారణంగా మితిమీరిపోయిన కమీషన్‌ల దందా 

వెంచర్‌లకు అనుమతుల పేరిట ముక్కుపిండి వసూలు 

రెవెన్యూశాఖలో చర్చనీయాంశమవుతున్న ఓ అధికారి లీలలు 

నిర్మల్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా లంచగొండులుగా మారి సర్కారుకు సవాలు విసురుతున్నారు. లంచాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న అవినీతి నిరోధకశాఖను సైతం వారు బేఖాతరు చేస్తూ లంచా ల రాజ్యాన్ని విస్తరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గత కొంతకాలం నుంచి జిల్లాలోని పలు ప్రభుత్వశాఖల్లో పైసాలేనిదే పని జరగడం లేదన్న ప్రచారం ఉంది. ప్రతీపనికి కొంత లంచాన్ని ఫిక్స్‌ చేసి ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే ఫైల్‌ను ముందుకు నడిపిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. పలుసార్లు లంచాలు తీసుకుంటూ కొంతమంది అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నప్పటికీ ఈ లంచాల దందా మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ అవినీతి దందా హద్దులు దాటుతోంది. ముఖ్యంగా నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పెరిగిపోవడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో ఈ లంచాల దందా మరింత పెరిగిపోయిందంటున్నారు. మొన్నటి వరకు వేలల్లో సాగిన లంచాల వ్యవహారం ప్రస్తుతం లక్షల రూపాయలు దాటిపోతోంది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అనుమతులు లేకుండా ఏర్పా టు చేసే వెంచర్‌ల కోసం పెద్దమొత్తంలో ముడుపులు చెల్లించుకుంటున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌ నుంచి మొదలుకొని అక్కడి పంచాయతీ సెక్రెటరీ, ఎంపీఓ తదితర అధికారులు బలవంతంగా  లంఛాలను వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రెవెన్యూ శాఖలో ఇప్పటికి కూడా అవినీతి తగ్గలేదంటున్నారు. ముఖ్యంగా నిర్మల్‌లోని ఓ రెవెన్యూ అధికారి సాగిస్తున్న లంచాలపర్వం బహిరంగంగానే చర్చకు తావిస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం అనంతపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు అనుమతులు ఇచ్చేందు కోసం ఆ గ్రామసర్పంచ్‌ భర్తతో పాటు అక్కడి పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓలు రూ.2.70 లక్షల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉదంతం జిల్లాలో కలకలం రేపుతోంది. వీరంతా ఏకంగా సదరు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ యజమాని నుంచి ఎంపీడీఓ కార్యాలయంలోనే ఈ లంచం తీసుకుంటూ పట్టుబడడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఈ లంఛాల పర్వంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరికీ భాగస్వామ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. రెవెన్యూశాఖ లంచాల వ్యవహారంలో ముందువరుసలో ఉంటుండగా పంచాయతీశాఖ, ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌లతో పాటు మరికొన్నిశాఖల్లో యథేచ్ఛగా లంచాల దందా రాజ్యమేలుతోందంటున్నారు. సరియైున అవగాహన లేకపోవడం, అధికారుల ఆధిపత్య ధోరణితో చాలా మంది లంచాలు చెల్లించుకుంటూ పనులు చేసుకుంటున్నారే తప్పా ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారంటున్నారు. అమాయకుల అవసరాలు, అవగాహన రాహిత్యం ఈ లంచావతారులకు అనుకూలంగా మారుతుందని చెబుతున్నారు. 

కలకలం రేపుతున్న అనంతపేట్‌ వ్యవహారం

అనంతపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు సంబంధించి ఏకంగా సర్పంచ్‌ భర్తతో పాటు అక్కడి పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి దాదాపు రూ. 10 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేసిన ఉదంతం ఈ అవినీతి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు. ఈ లంచాలు ఇన్‌స్టాల్‌మెంట్‌ రూపంలో చెల్లింపు కోసం ఒప్పందాలు జరుపుకొని అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు వెల్లడవుతోంది. అయితే మొదటిదఫా కింద మొత్తం రూ. 2.70 లక్షలను వీరు సదరు రియల్‌ వెంచర్‌ నుంచి తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిపోయారు. ఎంపీఓకు రూ.3 లక్షలు, సర్పంచ్‌కు రూ.5 లక్షలు పోను మిగతావి పంచాయతీ కార్యదర్శికి, మిగతా వారికి చెల్లించేట్లు ఒప్పందం జరిగిందంటున్నారు. అయితే సదరు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ యజమాని తాను న్యాయబద్దంగానే అనుమతి కోరుతున్నానని దీనికి ఇంత పెద్ద మొత్తంలో లంచం ఎందుకుంటూ ప్రశ్నించినప్పటికీ వీరంతా డబ్బులు లేకుంటే అనుమతి ఇచ్చేది లేదని వెంచర్‌ ఏర్పాటును అడ్డుకుంటామని బెదిరించినట్లు సమాచారం. దీంతో సదరు వెంచర్‌ యజమాని అంతపెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించుకునే పరిస్థితి లేక ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం సాధించుకోవాలన్న లక్ష్యంతో ఏసీబీని ఆశ్రమించి ఈ తతంగమంతా నడిపినట్లు చెబుతున్నారు. కరీంనగర్‌లోని ఏసీబీ అధికారులకు సమాచారం అందించి ఈ కరెప్షన్‌ ఆపరేషన్‌ను రూపొందించినట్లు పేర్కొంటున్నారు. దీంతో అధికారులు వ్యూహత్మకంగా ఏంపీడీఓ కార్యాలయంపై వలపన్ని అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏంపీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్తలు ఊహించని రీతిలో తాము ఏసీబీ వలలో చిక్కుకున్నామన్న సంగతి తెలుసుకొని నివ్వెరపోవాల్సి వచ్చింది. ఈ ఉదంతం ఒక్క పంచాయతీ శాఖకు చెందినదే కాదని అన్ని శాఖల్లో ఇలా లక్షల రూపాయల లంచాల వ్యవహారాలు సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.  

ఏసీబీని బేఖాతరు చేస్తున్న లంచావతారులు

ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు వరుసదాడులు జరుపుతూ లంచావతారులను పట్టుకుంటున్నప్పటికీ పరిస్థితుల్లో మా త్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదంటున్నారు. చాలా శాఖల్లో కొంతమంది అధికారులు, సిబ్బంది ఏసీబీ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ముక్కుపిండి లంచాలను వసూలు చే స్తున్నారన్న ఆరోపణలున్నాయి. లంచం ఇవ్వని వారికి కొర్రీలు సృష్టించి వారి పనులకు బ్రేక్‌ వే స్తున్నారంటున్నారు. ఏదో సాంకేతిక లోపాన్ని ఎత్తి చూపి వారి ఫైళ్లు ముందుకు కదలకుండా అడ్డుతగులుతున్నారన్న విమర్శలున్నాయి.   లంచాలు వసూలు చేసేందుకు కొన్నిశాఖల్లో అధికారులు మధ్యవర్తులను సైతం నియమించుకుంటున్నారంటున్నారు. ఈ లంచాల వ్యవహారంలో మధ్యవర్తులకు సైతం కొంత ముట్టజెప్పుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిరోజుల క్రితం అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాల ముందు వాల్‌ పోస్టర్లను అతికించి సంబంధిత అధికారుల ఫోన్‌ నంబర్లను సైతం వివరించారు. ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని, లంచం ఇవ్వవద్దంటూ ఆ వాల్‌పోస్టర్‌లో కోరుతున్నారు. అయినప్పటికీ అటు అధికారులు లంచాలు వసూలు చేయడం, అమాయక జనం తమ అవసరాల కోసం లంచాలు చెల్లించుకోవడం యధావిధిగానే జరిగిపోతోంది. ఏసీబీ అధికారుల హెచ్చరికలు ఈ లంచా వతారుల ముందు మొక్కుబడిగా మారిపోతున్నాయంటున్నారు. 

రెవెన్యూలో చక్రం తిప్పుతున్న ఓ అధికారి

కాగా నిర్మల్‌ జిల్లాలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పెద్ద ఎత్తున సాగు తున్న నేపథ్యంలో ఓ రెవెన్యూ అధికారిచక్రం తిప్పుతూ ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సదరు అధికారికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సత్సంబంధాలున్నాయని వీరికి మేలు చేకూర్చేందుకు ఆ అధికారి రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేయడం, సదరు భూ యజమానులకు ఇబ్బందులు సృష్టించి ఆ భూములను రియ ల్‌ వ్యాపారులకు బలవంతంగా అమ్ముకునేట్లు చేయడం లాంటివి కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ అధికారి ఏకంగా తన ఆఫీసు లోనే నిర్భయంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో మంతనాలు సాగిస్తూ దర్జాగా లంచాలదందా చెలాయిస్తున్నాడన్న ఫిర్యాదులున్నాయి. ఇక్కడి ఆ కార్యాలయంలో సదరు అధికారి చెప్పిందే వేదంగా కొనసాగుతోందంటున్నారు. భూముల రికార్డులు, కంప్యూటర్‌ పరిజ్ఙానం ఎక్కువగా ఉన్న ఈ అధికారి ఏకపక్షంగా చక్రం తిప్పుతూ ఉన్నతాధికారులను సైతం బోల్తా కొట్టిస్తున్నాడంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ అధికారి వ్యవహారంపై ఉన్నతాధికారులకు అలాగే ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 


Updated Date - 2021-03-03T06:40:50+05:30 IST