హడావుడి ఆర్డర్‌..!

ABN , First Publish Date - 2021-10-12T05:58:09+05:30 IST

హడావుడి ఆర్డర్‌..!

హడావుడి ఆర్డర్‌..!
గత ఏడాది పడిన కొండచరియలు

దుర్గగుడి అభివృద్ధి పనుల నిధులు రూ.70కోట్లకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌

సరిగ్గా ఏడాది తరువాత ఆదేశాలు

నేడు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్‌ వస్తున్నారనే..

పనులు ఏడాదిలో పూర్తవ్వాలని అప్పట్లో సీఎం ఆదేశం 

ఇంతవరకు పునాదులు దాటని వైనం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : దుర్గగుడి అభివృద్ధికి రూ.70కోట్లు ఇస్తామని గత ఏడాది దసరా ఉత్సవాల్లో సీఎం జగన్‌ ఇచ్చిన హామీకి ఇన్నాళ్లకు.. అంటే సోమవారం బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. దేవదాయ శాఖ ద్వారా ట్రెజరీ నియంత్రణ, సడలింపులతో అదనపు నిధుల నుంచి ఈ బడ్జెట్‌ను సమకూర్చాలని పేర్కొంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం మూలానక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు హడావుడిగా బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. 

ఏడాది దాటాక..

గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ వచ్చిన రోజే ఇంద్రకీలాద్రి పైనుంచి భారీ కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ కొండరాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అమ్మవారి ఆలయంలో ప్రసాదం పోటు, అన్నదాన భవనం, కేశఖండనశాల తదితర అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదిలో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దుర్గగుడి అభివృద్ధి పనులకు నిధుల క్లియరెన్స్‌ కాలేదు. తాజాగా మంగళవారం సీఎం రానున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ రూ.70 కోట్లు కూడా దేవదాయ శాఖ అదనపు నిధుల నుంచి విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, దేవదాయ శాఖలో అంత పెద్దమొత్తంలో నిధులు లేవని సమాచారం. ఈ నేపథ్యంలో దుర్గగుడి అభివృద్ధి పనులకు నిధులు విడుదల ఇప్పట్లో అయ్యే పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మహామండపం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం పోటు నిర్మాణ పనులకు పునాదులు తీసి పనులు మొదలయ్యాయనిపించారు. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదు. ఇక కృష్ణానది తీరాన కేశఖండనశాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణకు సంబంధించి జలవనరుల శాఖ నుంచి, కనకదుర్గానగర్‌లో గోశాల వెనుక ఖాళీ స్థలంలో అన్నదాన భవనం నిర్మాణానికి పురావస్తుశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది.

Updated Date - 2021-10-12T05:58:09+05:30 IST