బుల్లెట్‌ కూత కొత్త బాట!

ABN , First Publish Date - 2021-06-05T07:22:25+05:30 IST

ముంబై-హైదరాబాద్‌ మధ్య నిర్మించతలపెట్టిన హై స్పీడ్‌ రైలు కారిడార్‌ (బుల్లెట్‌ రైలు) ప్రాజెక్టు ‘కొత్త బాట’ పట్టింది. దూరం తగ్గించి. తద్వారా ప్రాజెక్టు అయ్యే వ్యయాన్ని తగ్గించేందుకు ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు

బుల్లెట్‌ కూత కొత్త బాట!

ముంబై-హైదరాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ అలైన్‌మెంట్‌ మార్పు

జహీరాబాద్‌కు బదులు తాండూరు- వికారాబాద్‌ మీదుగా లైన్‌ 

70 కి.మీ దాకా తగ్గనున్న దూరం.. 

రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టు

శరవేగంగా ఏరియల్‌ సర్వే పనులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) 

ముంబై-హైదరాబాద్‌ మధ్య నిర్మించతలపెట్టిన హై స్పీడ్‌ రైలు కారిడార్‌ (బుల్లెట్‌ రైలు) ప్రాజెక్టు ‘కొత్త బాట’ పట్టింది. దూరం తగ్గించి. తద్వారా ప్రాజెక్టు అయ్యే వ్యయాన్ని తగ్గించేందుకు ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేస్తున్నారు. సుమారు రూ. లక్ష కోట్ల వ్యయంతో పబ్లిక్‌- ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ ప్రాజెక్టు కింద ముంబై-పుణె-జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ దాకా 780 కిలోమీటర్ల మేర ఈ ప్రత్యేక రైల్వే లైన్‌ వేయాలని నిర్ణయించారు. అయితే జహీరాబాద్‌ మీదుగా కాకుండా ముంబై-పుణె- గుల్బర్గా-తాండూరు-వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు లైన్‌ నిర్మించేలా అలైన్‌మెంట్‌ మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. కొత్త అలైన్‌మెంట్‌తో 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. జహీరాబాద్‌ మీదుగానైతే కొండలు, గుట్టలు మీదుగా నిర్మాణం చేయాల్సి రావడంతో వ్యయం పెరుగుతుందని, ఆ మార్గంలో భూముల రేట్లూ ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


జహీరాబాద్‌ మీదుగా కాకుండా తాండూరు-వికారాబాద్‌ మీదుగా నిర్మిస్తే ఈ అవరోధాలు ఉండవని చెబుతున్నారు. ఈ మేరకు రూటు మార్పుతో దూరభారం తగ్గడం.. చదును ప్రదేశం గుండా నిర్మాణం సాగడం.. భూసేకరణకు తక్కువ మొత్తం ఖర్చయ్యే అవకాశం ఉండటంతో ప్రాజెక్టుపై వేలకోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు. కాగా ఈ హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు సంబంధించి నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి.  తాజాగా నిర్వహిస్తున్న ఏరియల్‌ సర్వే తాండూరు, వికారాబాద్‌ మీదుగానే సాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సర్వే, నిర్మాణం కోసం సాగుతున్న గూగుల్‌ మ్యాపింగ్‌ చివరి దశకు చేరుకుంది. గూగుల్‌ మ్యాపింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి 10 కి.మీ దూరానికి ఒక పిల్లర్‌ నిర్మిస్తున్నారు. ఈ పిల్లర్ల ఆధారంగా మరోసారి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు.


ముంబై- హైదరాబాద్‌ హై స్పీడ్‌ రైలు కారిడార్‌ నిర్మాణ పనులకు సంబంధించి సర్వేతో పాటు తుది అలైన్‌మెంట్‌ డిజైన్‌ కోసం గత ఏడాది చివర్లో టెండర్లు ఆహ్వానించారు. ఈ సర్వే టెండర్లను పుణెకు చెందిన మోనార్క్‌ కంపెనీ రూ.13.26 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ కంపెనీ చేస్తున్న ఏరియల్‌ సర్వే తుదిదశకు చేరుకుంది. వాస్తవానికి హైస్పీడ్‌ కారిడార్‌ను గంటకు 350 కిలోమీటర్ల వేగం సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మిస్తున్నారు. అయితే ఆపరేషన్‌ స్పీడ్‌ గంటకు 350 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ముంబై-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలుమార్గం పూర్తయితే మూడున్నర గంటల్లోపే ముంబై చేరుకోవచ్చు. 

 

ఏరియల్‌ సర్వే ఇలా..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏరియల్‌ లేజర్‌ సర్వేయింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీన్ని లీడర్‌ (లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌) సర్వే అని కూడా పిలుస్తారు. వైమానిక లీడర్‌, ఇమేజరీ సెన్సార్లతో సర్వే చేస్తారు. ఒక విమానానికి సెన్సార్లు అమర్చి సర్వే చేసే ప్రాంతంలోని భూభాగానికి సంబంధించిన డేటాను రూపొందిస్తారు. లీడర్‌ టెక్నాలజీ ద్వారా చుట్టు పక్కల నిర్మాణాలు, చెట్లు ఇతర వివరాలను చిత్రీకరిస్తారు. దీని ఆధారంగా భూసేకరణ సులవవుతుంది. ఇందుకోసం హైపవర్‌ 100 మెగా పిక్సల్‌ కెమెరాలనువాడతారు.

Updated Date - 2021-06-05T07:22:25+05:30 IST