కిక్కు.. తుక్కు తుక్కు..

ABN , First Publish Date - 2020-07-18T09:49:37+05:30 IST

అక్రమ మద్యం తరలిస్తే ఊరుకోబోమని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్‌ టీహెచ్‌డీ రామకృష్ణ హెచ్చరించారు.

కిక్కు.. తుక్కు తుక్కు..

మచిలీపట్నం టౌన్‌, జూలై 17 : అక్రమ మద్యం తరలిస్తే ఊరుకోబోమని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్‌ టీహెచ్‌డీ రామకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ నుంచి తక్కువ ధరకు మద్యం తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో రూ.70 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం వీటిని ధ్వంసం చేశారు. 14,238 మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. 217 లీటర్ల నాటుసారాను మురుగు కాల్వలో పోశారు. డీఐసీ కేవీ మోహనరావు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్‌ టీహెచ్‌డీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఎస్పీ వకుల్‌ జిందాల్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా ఎస్‌ఈబీ డైరెక్టర్‌ టీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ కేవలం పది పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే 14 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం ముదావహమన్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు మాట్లాడుతూ తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అక్రమ మద్యం రవాణాను తిరువూరు, మైలవరం, చింతపల్లి, జిగురుమిల్లి, ఖమ్మం సరిహద్దుల్లో తనిఖీలు చేసి పట్టుకున్నామన్నారు. ఎక్సైజ్‌ చట్టాలను సవరిస్తూ నాన్‌బెయిలబుల్‌ చట్టాలతో ఎనిమిదేళ్ల జైలుశిక్ష అమలు చేయనున్నామన్నారు. నాటుసారా కాస్తున్న యువతీ యువకులకు జిల్లా పోలీసులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మెహబూబ్‌ బాషా, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.


విస్సన్నపేట : విస్సన్నపేట ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2017 నుంచి నేటి వరకు జరిపిన దాడుల్లో పట్టుబడిన 5,487 అక్రమ మద్యం సీసాలు, 2,751 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఎక్సైజ్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డేగ ప్రభాకర్‌, ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాస బాలాజీ, ఈవో శ్రీనివాస్‌, పాల్గొన్నారు

Updated Date - 2020-07-18T09:49:37+05:30 IST