వ్యాపారాలు వెలవెల

ABN , First Publish Date - 2020-10-24T11:35:39+05:30 IST

వ్యాపార రంగంపై కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. కొనుగోలుదారులతో తీవ్ర రద్దీగా ఉండాల్సిన దసరా సమయంలో దుకాణాలు వెలవెలబోతున్నాయి.

వ్యాపారాలు వెలవెల

దసరా వేళా సందడి లేని దుకాణాలు 

కొవిడ్‌ ప్రభావం నుంచి ఇంకా  తేరుకోని వైనం

బంగారం, వస్త్ర, హోంనీడ్స్‌పై తీవ్ర ప్రభావం

కొనుగోలుదారుల కోసం ఎదురు చూపులు


ఒంగోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : వ్యాపార రంగంపై కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. కొనుగోలుదారులతో తీవ్ర రద్దీగా ఉండాల్సిన దసరా సమయంలో దుకాణాలు వెలవెలబోతున్నాయి. నగలు, వస్త్ర, ఎలకా్ట్రనిక్‌ ఇతర గృహోపకరణాలు, చెప్పుల వ్యాపారం పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ వంటి పండుగల సమయంలో ప్రజలు వివిధ రకాయల వస్తువులను అధికంగా కొనుగోలు చేస్తుంటారు.  కానీ ఈ ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో కొన్నాళ్లల లాక్‌డౌన్‌, మరికొన్ని రోజులు ఆంక్షలు, కరోనా భయంతో పట్టణ ప్రాంతాల్లోని వ్యాపార రంగం కుదేలైంది. ఈ క్రమంలో దసరా, దీపావళి పండుగలకు తిరిగి వ్యాపారం పుంజుకుంటుందని వ్యాపారులు భావించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటిలాగే పలు రకాల వ్యాపారాలపై రిబేటులు ఇతర డిస్కౌంట్‌లు ప్రకటించారు. కానీ కరోనాతో ప్రజల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులై కొనుగోలు శక్తి తగ్గి ఆ ప్రభావం వ్యాపారాలపై పడింది. 


కనిపించని దసరా సందడి

 జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఒంగోలు, చీరాల, కందుకూరు, అద్దంకి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, దర్శితదితర ప్రాంతాల్లో సాధారణంగా దసరా, దీపావళి సమయంలో నగలు, వస్త్ర, హోమ్‌ నీడ్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, చె ప్పులు ఇతరత్రా దుకాణాలు తీవ్ర రద్దీగా ఉంటాయి. దసరాకు వారంముందు నుంచే ఉండే ఈ సందడి దీపావళి ముగిసే వరకూ సాగుతుంది. కానీ ప్రస్తుతం  ఈ తరహా వ్యాపారాలు ఆశాజనకంగా సాగడం లేదు. జిల్లాలో సుమారు 350 నుంచి 400 వరకు ఒక మోస్తరు నుంచి పెద్దస్థాయి బంగారు నగల దుకాణాలు ఉండగా సాదారణంగా రోజుకు కనీసం రూ. 10 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అలాంటిది ప్రస్తుతం అందులో ఐదో వంతు కూడా సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.  ఒంగోలు నగరంలో ఒక స్థాయిలో వ్యాపారం సాగే దాదాపు 150 వస్త్ర, 350 రెడీమెడ్‌, 50 చెప్పులు, 40 వరకు ఎలకా్ట్రనిక్‌, హోమ్‌నీడ్స్‌ దుకాణాలు ఉంటాయి.


వాటిలో సాధారణంగా దసరా సమయంలో రోజువారీ కనీసం రూ. 20 కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఆలాంటిది ప్రస్తుతం అందులో నాల్గో వంతు కూడా సాగడం లేదు. చీరాలలో దాదాపు వెయ్యి వస్త్ర దుకాణాలు ఉండగా ఈ సమయంలో రోజువారీ రూ. 10 కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం అది సగానికి పడిపోయింది. కందుకూరులోని మూడు ప్రధాన దుకాణాలలో దసరా, దీపావళి సమయంలో ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు రూ. 50 కోట్ల వ్యాపారం జరిగేది. ఆలాంటిది ప్రస్తుతం చాలా రకాల వ్యాపారాలు పదిశాతం కూడా సాగడం లేదు. మార్కాపురంలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది.  దుకాణాలు వెలవెలబోతుండటంతో వ్యాపారులు దిగాలు పడ్డారు. అయితే నిత్యవసరాల కొనుగోళ్లు యథావిధిగా సాగుతుండగా భారీగా పెరిగిన ధరలతో కొనలేక జనం బెంబేలెత్తిపోతున్నారు.  

Updated Date - 2020-10-24T11:35:39+05:30 IST