నలుగురి కోసం 180 సీట్ల విమానాన్ని అద్దెకు తీసుకున్న వ్యాపారవేత్త!

ABN , First Publish Date - 2020-05-28T21:48:34+05:30 IST

తన కుటుంబ సభ్యులు నలుగురిని భోపాల్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఓ వ్యాపారవేత్త ఏకంగా 180 సీట్ల ప్రైవేట్

నలుగురి కోసం 180 సీట్ల విమానాన్ని అద్దెకు తీసుకున్న వ్యాపారవేత్త!

భోపాల్: తన కుటుంబ సభ్యులు నలుగురిని భోపాల్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ఓ వ్యాపారవేత్త ఏకంగా 180 సీట్ల ప్రైవేట్ విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. కోవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో విమానాశ్రయంలో రద్దీ నుంచి తప్పించుకునేందుకు ఆయనీ నిర్ణయం తీసుకున్నాడు. మద్యం వ్యాపారి అయిన ఆయన తన కుమార్తె, ఆమె ఇద్దరు పిల్లలు, పనిమనిషిని ఢిల్లీకి తీసుకొచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వీరందరూ గత రెండు నెలలుగా భోపాల్‌లో చిక్కుకుపోయారు. దీంతో వారిని తిరిగి రప్పించేందుకు వ్యాపారవేత్త ఏకంగా ప్రైవేటు విమానాన్నే అద్దెకు తీసుకున్నాడు.


సోమవారం ఢిల్లీ నుంచి సిబ్బందితో మాత్రమే భోపాల్ వచ్చిన విమానం కేవలం నలుగురితో తిరిగి బయలుదేరింది. ‘‘ఓ కుటుంబంలో నలుగురు వ్యక్తుల కోసం ఎ320 180 సీట్ల ప్రైవేటు విమానం వచ్చింది. బహుశా కరోనా వైరస్ భయం వల్ల కావొచ్చు. దీనిని ఎవరో అద్దెకు తీసుకున్నారు’’ అని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, అంతకుమించిన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. కాగా, ఎయిర్‌బస్ 320 అద్దె దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. భోపాల్ నుంచి నలుగురిని ఢిల్లీకి రప్పించేందుకు రూ. 20 లక్షలు ఖర్చుచేసిన ఆ వ్యాపారి ఎవరై ఉంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2020-05-28T21:48:34+05:30 IST