Abn logo
Sep 14 2021 @ 19:11PM

ఈ American కుటుంబం పరిస్థితి పగోడికి కూడా రావొద్దు! పాపం.. ఐదుగురు చిన్నారులు అనాథలయ్యారు!!

కాలిఫోర్నియా: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బిడ్డలను తల్లిదండ్రులకు, తల్లిదండ్రులను బిడ్డలకు దూరం చేసింది. ఇలాగే అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా ఓ కుటుంబం కోవిడ్ కారణంగా చిన్నాభిన్నమైంది. మూడు వారాల పసికందు నుంచి 8 ఏళ్ల బాబు వరకు మొత్తం ఐదుగురిని అనాథలు చేసింది. 14 రోజుల వ్యవధిలోనే తల్లిద్రండులిద్దరూ కరోనా కాటుకు బలి కావడంతో ఐదుగురు చిన్నారులు దిక్కులేని వారు అయ్యారు. ప్రస్తుతం నాన్నమ్మ వారి ఆలనపాలన చూసుకుంటోంది. పేరెంట్స్ కనిపించకపోవడంతో ఎప్పుడు వస్తారని నాన్నమ్మను అడుగుతూనే ఉన్నారు. అసలు పేరెంట్స్ ఇక తిరిగి రారని తెలియని ఆ పసివాళ్లకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ముసలావిడా పడే వేదన మాటల్లో చెప్పలేనిది. చిన్నారుల పరిస్థితి తెలుసుకుని ఇరుగుపొరుగు వారు ఒకటే చెబుతున్న మాట ఒకటే.. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావొద్దు దేవుడా అని. 


ఇవి కూడా చదవండి..

వీడసలు తండ్రేనా.. కొడుకును రూంలో నగ్నంగా బంధించి.. ఆపై ప్రియురాలితో కలిసి..

5 వేల డాలర్లు కట్టుకో.. అమెరికా గ్రీన్‌కార్డు పట్టుకో


వివరాల్లోకి వెళ్తే.. డేనియల్ మాసియాస్(38), డేవి మాసియాస్(37) భార్యాభర్తలు. కాలిఫోర్నియాలో నివాసముండే ఈ దంపతులకు నలుగురు సంతానం కాగా.. డేవి 7 నెలల గర్భిణీ. ఇక కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి డేనియల్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. అందరిలాగే వైరస్ బారిన పడకుండా ఉండేందుకు 18 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయితే, ఇటీవల ఇండోర్ వాటర్ పార్క్‌కు ఈ ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లింది. అదే.. వారి కొంపముంచింది. మొదట గర్భిణీ అయిన డేవికి కరోనా సోకింది. ఆ తర్వాత డేనియల్ వైరస్ బారిన పడ్డాడు. ఇలా దంపతులిద్దరూ ఆగస్టులో కరోనాతో ఆస్పత్రిలో చేరారు. మొదట డేవిని ఆమె నర్సుగా పనిచేసే ఆస్పత్రిలోనే చేర్పించారు. అప్పటికే ఆమె పరిస్థితి చేయిదాటిపోవడంతో వైద్యులు ముందుగానే సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి బిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డను చూసుకోకుండానే ఆగస్టు 26న ఆమె కన్నుమూసింది. 


ఇక డేనియల్ కూడా కరోనా చికిత్స కోసం డేవికి వైద్యం అందించిన ఆస్పత్రిలోనే చేర్పించారు. డేనియల్ ఆస్పత్రిలో ఉండగానే పాప పుట్టిన విషయం నర్సుల ద్వారా తెలిసింది. ఆయనకు నర్సులు మొబైల్‌లో చిన్నారి ఫొటో కూడా చూపించారు. ఈ క్రమంలో డేవి చనిపోయిన రెండు వారాల తర్వాత డేనియల్ కూడా మృతిచెందాడు. సెప్టెంబర్ 9న డేవియల్ చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇలా రెండు వారాల వ్యవధిలోనే దంపతులిద్దరినీ కరోనా పొట్టనబెట్టుకుంది. దీంతో మూడు వారాల చిన్నారి నుంచి 8 ఏళ్ల బాలుడి వరకు మొత్తం ఐదుగురు అనాథలుగా మిగిలారు. 


ఐదుగురిలో 8 ఏళ్ల బాబుతో పాటు ఐదేళ్ల పాపకు మాత్రమే వారి తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలుసు. మిగిలిన ముగ్గురు పేరెంట్స్ వస్తారనే అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఐదుగురిని డేనియల్ తల్లి మాసియాస్ చూసుకుంటోంది. మూడేళ్ల తన మనవరాలు తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారనే అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని వాపోయింది మాసియాస్. ప్రస్తుతం ఆ చిన్నారులు పరిస్థితి చూసి అందరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. తమకు తోచిన సాయం చేస్తామని మాసియాస్‌కు భరోసా ఇస్తున్నారు.         


తాజా వార్తలుమరిన్ని...