అర్ధరాత్రి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుని.. నివ్వెరపోయిన యువతి..!

ABN , First Publish Date - 2021-06-23T17:02:04+05:30 IST

సాధారణంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడో, ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినప్పుడో బ్యాంక్‌లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందన్నది చెక్ చేస్తూ ఉంటారు. నెల వారీ ఖర్చులు చూసుకుంటూ ఇంకా ఎంత మిగిలి ఉందన్నది కూడా తెలుసుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్‌ను వినియోగదారులు చూసుకుంటూ ఉంటారు.

అర్ధరాత్రి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకుని.. నివ్వెరపోయిన యువతి..!

సాధారణంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడో, ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినప్పుడో బ్యాంక్‌లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందన్నది చెక్ చేస్తూ ఉంటారు. నెల వారీ ఖర్చులు చూసుకుంటూ ఇంకా ఎంత మిగిలి ఉందన్నది కూడా తెలుసుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్‌ను వినియోగదారులు చూసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అంటే అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందన్నది తెలుసుకోవడానికి బ్యాంకుకో, ఏటీఎంకో వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇది టెక్నాలజీ యుగం కదా. కాబట్టి అన్నీ ఆన్‌లైన్‌లోనే తెలిసిపోతున్నాయి. అలా ఆన్‌లైన్‌లోనే తన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందన్నది చెక్ చేసుకున్న ఓ యువతికి మైండ్ బ్లాంక్ అయినంత పనయింది. ఆమె ఖాతాలో దాదాపు ఆరు వేల రూపాయలు మాత్రమే ఉండాల్సింది పోయి.. వందల కోట్ల రూపాయలు కనిపించాయి. అంది కూడా ఆమె బ్యాంకుకు అప్పుగా ఉన్నట్టుగా చూపించడంతో ఆమెకు కోలుకోలేని షాక్ తగిలినట్టయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..



అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మ్యాడీ మెక్ గివెర్న్ అనే యువతికి ఛేజ్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆమె ఖాతాలో కేవలం 76.28 డాలర్లు (5672 రూపాయలు) మాత్రమే ఉన్నాయి. ఏమి అవసరం వచ్చిందో ఏమో కానీ.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండు గంటల సమయంలో తన బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందన్నది చెక్ చేసుకుంది. ‘అంత రాత్రి సమయంలో ఎవరూ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోరు. కానీ నాకు నిద్రపట్టలేదు. నా ఆర్థిక అవసరాలను లెక్కలు తీస్తున్న సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా. కనిపించిన బ్యాలెన్స్ చూసి షాకయ్యాను. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా -49,999,999,697.98 డాలర్లు(50 బిలియన్ డాలర్లు= సుమారుగా 371 కోట్ల రూపాయలు) అప్పుగా ఉన్నట్టుగా స్క్రీన్‌లో కనిపించింది. 


నా మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఆ తర్వాత తేరుకుని బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేశాను. అసలు అంత అప్పు నేను ఎప్పుడు చేశాను.? నా జీవితంలో అంత మొత్తం డబ్బును నేను చూడగలనా..? అని కస్టమర్ కేర్ వాళ్లపై కోప్పడ్డాను. వాళ్లు నా వివరాలు చెక్ చేసిన తర్వాత అసలు విషయం తాపీగా చెప్పారు. టెక్నికల్ సమస్యల కారణంగా అలా చూపించిందనీ.. ఇప్పుడే బ్యాంక్ సిబ్బంది దాన్ని సరిచేశారని కస్టమర్ కేర్ సిబ్బంది చెప్పారు. అప్పటికి గానీ నేను ఊపిరి పీల్చుకోలేదు’ అంటూ తాను ఎదుర్కొన్న అనుభవం గురించి మ్యాడీ టిక్‌టాక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో కాస్తా అమెరికాలో తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-06-23T17:02:04+05:30 IST