Abn logo
Aug 11 2020 @ 04:07AM

ప్రభుత్వాల తీరు అక్రమం

న్యాయం, ధర్మం అడుగుతున్నా పట్టించుకోరా 

237వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు ధ్వజం 


తుళ్లూరు, ఆగస్టు 10: అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు అక్రమమని రాజధాని రైతులు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న దీక్షలు, నిరసనలు సోమవారానికి 237వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు దీక్షా శిబిరంలో న్యాయ దేవత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు, మహిళలు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని అందుకు 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా గతంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ అన్నారన్నారు.


అదేవిధంగా శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నేలా అమరావతి నిర్మాణం జరగాలన్నారన్నారు. అయితే జగన్‌ మాట మార్చగా.. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని కేంద్రం ప్రకటించిందని తెలిపారు. అందుకే అక్రమ ప్రభుత్వాలు అంటున్నామని రైతులు తేల్చి చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం రైతు శిబిరాలకు వచ్చిన వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్‌ వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతుల సమస్యల పరిష్కరించాలన్నారు.     


తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని మహిళలు, రైతులు ప్రశ్నించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో రైతులు, మహిళలు సోమవారం నిరసనలు కొనసాగించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు వ్యతిరేకంగా తొమ్మిది నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవటం లేదన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement