ప్చ్‌..!

ABN , First Publish Date - 2021-04-18T06:31:33+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నా ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేవి కనిపించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం నామామత్రంగా ప్రజలకు సూచనలు చేయడం తప్ప నియంత్రణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదు. గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గాలి ద్వారా కరోనా సోకుతుందని వైద్య ఆరోగ్య శాఖనే హెచ్చరిస్తున్నా అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు శూన్యం.

ప్చ్‌..!

జాగ్రత్తలు కరువు

కేసులు విజృంభిస్తున్నా  ఇదేమి నిర్లక్ష్యం?

నామమాత్రపు చర్యలతో సరి

పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం

ర్యాపిడ్‌ టెస్టుల్లోనే ఎక్కువ పాజిటివ్‌లు

పేరుకే కొవిడ్‌ ప్రత్యేక వార్డులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సిద్దిపేట, ఏప్రిల్‌ 17 : కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నా ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేవి కనిపించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం నామామత్రంగా ప్రజలకు సూచనలు చేయడం తప్ప నియంత్రణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదు. గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గాలి ద్వారా కరోనా సోకుతుందని వైద్య ఆరోగ్య శాఖనే హెచ్చరిస్తున్నా అందుకనుగుణంగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. 


కేసుల స్వైర విహారం

ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. పాజిటివ్‌ కేసులు జోరుగా నమోదవుతున్నాయి. గతేడాది జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కేసులు విజృంభించి ఆ తర్వాత మందగించాయి. మళ్లీ తాజాగా నెలరోజుల నుంచి కేసుల పెరుగుదల విపరీతంగా కనిపిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 11న 765 యాక్టివ్‌ కేసులు నమోదు శనివారం నాటికి 1700 కేసులకు పెరిగాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఐదారు రోజులుగా 300 కేసులకు పైగానే నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. శనివారం 427 కేసులు నమోదకు కావడం తీవ్రతకు అద్దం పడుతున్నది. గతేడాది మార్చి 29న మెదక్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు ప్రారంభం కాగా తొలిసారిగా శనివారం అత్యధికంగా నమోదయ్యాయి. ఒక్కరోజే 398 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. 


ర్యాపిడ్‌లోనే కేసులు ఎక్కువ

ఐదు నిమిషాల్లో కొవిడ్‌ ఫలితం తేలే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులలోనే (ర్యాట్‌)  రోజు వందల సంఖ్యలో కేసులు నమోదువతున్నాయి. అయితే ర్యాట్‌ ఫలితం 60 శాతం వరకే కరెక్టుగా ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ గాయత్రిదేవి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా రోజు వచ్చే ఈ ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్‌కు పంపిస్తున్నారు. అలాగే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాల్లో ప్రజల నుంచి తీసుకునే స్వాబ్‌ను హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ తదితర ఆస్పత్రులలోని ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ఈ ల్యాబ్‌లకు స్వాబ్‌ పంపించిన 24 గంటలకు ఫలితం వస్తుంది. ఆర్టీపీసీఆర్‌లో వచ్చే ఫలితం పక్కాగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ర్యాట్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం వచ్చిన వారు అనుమానముంటే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకుంటున్నారు. అయితే ర్యాట్‌లో రోజువారీ వచ్చిన పాజిటివ్‌ రిపోర్టు సంఖ్యను వైద్య ఆరోగ్య శాఖ గుడ్డిగా తగ్గించేస్తున్నది. ఇలా తగ్గించిన సంఖ్యను ఆర్టీపీసీఆర్‌ పాజిటివ్‌ రిపోర్టుకు కలిపి వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్‌ బులెటిన్‌ విడుదల చేస్తున్నది. 


మాస్క్‌ లేకుంటే రిస్కే

మాస్కు ధరించకుంటే పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మంచి మాటతో చెబితే వినడం లేదని ఏకంగా చట్టపరమైన జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఆశించిన మార్పు కానరావడం లేదు. సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలోనే 899 మందికి రూ.వెయ్యి చొప్పున ఫైన్‌ విధించారు. ఒక్కొక్కరికి రూ.వెయ్యి లెక్కన ఇప్పటికే పోలీస్‌ శాఖ ఖజానాలో రూ.8.99 లక్షల ఆదాయం చేరింది. పోలీస్‌ శాఖ నమోదు చేసిన జరిమానాల్లో 90 శాతానికిపైగా యువకులే ఉన్నట్లు తెలుస్తున్నది. కేవలం యువకుల్లోనే నిర్లక్ష్యం ఉందని అంటున్నారు. మాస్కులు లేకుండా బైక్‌లపై వెళ్లేవారికి బైక్‌ నంబర్‌ ఆధారంగా ఫైన్‌ పడినట్లుగా సమాచారం. రోడ్లపై కాలినడకన మాస్కులు లేకుంటే తిరిగేవారికి కూడా జరిమానా విధిస్తున్నారు. ఒకవేళ డబ్బు లేకుంటే కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నారు.  సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డితో పాటు అన్ని పట్టణాల్లో ఒకటి, రెండ్రోజులు అధికార యంత్రాంగం మాస్క్‌ లేని వారికి ఫైన్‌ విధిస్తూ హడావిడి చేసింది. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. రెండు రోజులుగా జిల్లాలో ఎక్కడా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించడం లేదు. సెకండ్‌ వేవ్‌ క్రమంగా తీవ్రమవుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రజలు చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో కేసులు తక్కువగా ఉన్నా కట్టడి ప్రాంతాలు ఏర్పాటు చేయడం, లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు భయపడ్డారు. ఈ సారి కేసులు పెరుగుతున్నా ప్రజలు తేలికగానే తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ప్రత్యేక వార్డుల్లో పేషెంట్లేరి ?

సంగారెడ్డి జిల్లాలో కొవిడ్‌ పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులు పేరుకే ఉన్నాయి. కరోనా పేషెంట్లు ఎక్కువగా హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శనివారం నాటికి 1,700 యాక్టివ్‌ కేసులున్నా ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారి సంఖ్య 50 మాత్రమే ఉండడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డులో 180 పడకలు ఉండగా 50 మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారు. ఇక పటాన్‌చెరు, జహీరాబాద్‌, జోగిపేట, నారాయణఖేడ్‌ ఏరియా ఆస్పత్రుల్లో 70 చొప్పున పడకలతో ప్రత్యేక వార్డులు ఉన్నా పేషెంట్లు ఎవరూ లేరు. అలాగే ఎంఎన్‌ఆర్‌, మహేశ్వర, పాటి ఘనాపూర్‌ నారాయణ మెడికల్‌ కాలేజీల్లో 100 చొప్పున పడకలతో ప్రత్యేక వార్డులున్నా ఇన్‌ పేషంట్లు లేరు. ఈ వార్డులన్నీ ఆక్సిజన్‌ సౌకర్యంతో ఉన్నాయి. వీటికి తోడు జిల్లా కేంద్రమైన సంగారెడ్డ్డితో పాటు ఇతర ప్రాంతాల్లో 20 పడకల కన్నా ఎక్కువగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స చేయొచ్చని ప్రభుత్వ అనుమతించింది.


చట్ట ప్రకారం చర్యలు తప్పవు

కరోనా విస్తరిస్తున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షలు తప్పవు. ఈ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లను 188 ఐపీసీ చట్టం ప్రకారం కాంటాక్ట్‌ ఈ-పెట్టి కేసు నమోదు చేసి రూ.వెయ్యి జరిమానా విధించడం జరుగుతున్నది. ఈ నియంత్రణ చర్యలకు ప్రజలంతా సహకరించాలి. బహిరంగ ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద భౌతికదూరం పాటించాలి. 

- జోయల్‌ డేవిస్‌, సీపీ, సిద్దిపేట


కాళ్లకల్‌లో కరోనా ఆంక్షలు

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), ఏప్రిల్‌ 17 : మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా ఆంక్షలు విఽధించారు. నాలుగైదు రోజులుగా కాళ్లకల్‌లో పలువురు కొవిడ్‌ బారిన పడుతున్నారు. శనివారం గ్రామంలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతి ఆదివారం నిర్వహించే వారంతపు సంతను నాలుగు వారాలు మూసివేస్తున్నట్లు గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార దుకాణాలు తెరచి ఉంచాలని నిర్ణయించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి సామ్యూల్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యులు, గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.


Updated Date - 2021-04-18T06:31:33+05:30 IST