రేషన్‌ మాటున ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-05T11:23:41+05:30 IST

అక్కడా ఇక్కడా అనే భేదం లేకుండా కరోనా మహమ్మారి జిల్లా అంతటా వ్యాపించింది.

రేషన్‌ మాటున ప్రమాదం

 అన్ని ప్రాంతాలకూ కరోనా మహమ్మారి

ఎవరికి పాజిటివో.. నెగటివో..? తెలుసుకోవడం కష్టం\

చౌకదుకాణాల వద్ద గుంపులుగా కార్డుదారులు

బయోమెట్రిక్‌తో సరుకులు ఆలస్యం

డీలర్లు ఆందోళన చేసినా పట్టించుకోని ప్రభుత్వం


నెల్లూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : అక్కడా ఇక్కడా అనే భేదం లేకుండా కరోనా మహమ్మారి జిల్లా అంతటా వ్యాపించింది.  గడిచిన మూడు వారాల నుంచి కరోనా కేసుల తీవ్రత విపరీతంగా ఉంది. దశల వారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ప్రజలు స్వేచ్ఛగా బయటతిరగడం కారణంగా  కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు అంచనా వేశారు.  ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాని చౌక దుకాణాల్లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పేదలంతా నెలకు రెండు సార్లు వచ్చి సరుకులు తీసుకునే ఈ దుకాణాల వద్ద నెలకొన్న పరిస్థితులు పెను ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. మొదటి రెండు, మూడు విడతల రేషన్‌ పంపిణీలో జాగ్రత్తలు వహించిన అధికారులు ఆ తర్వాత నెమ్మదించారు. దుకాణాల వద్ద గుంపులుగా కార్డుదారులు చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది.


బయోమెట్రిక్‌ విధానంలో రేషన్‌ తీసుకోవాల్సి ఉండడం పెద్ద సమస్యగా మారింది. వ్యక్తికి వ్యక్తికి మధ్య కాంటాక్ట్‌ ఉండకూడదని చెబుతున్న ప్రభుత్వమే బయోమెట్రిక్‌ రూపంలో కాంటాక్ట్‌ అయ్యేలా చేయడంపై అటు పేదల నుంచి ఇటు రేషన్‌ డీలర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో బయోమెట్రిక్‌ విధానం నుంచి మినహాయించాలని, శానిటైజర్లు, మాస్కులు అందించాలని ఇటీవల రేషన్‌ డీలర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బయోమెట్రిక్‌ నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పిన ఉన్నతాధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. 


గంటల కొద్దీ నిరీక్షణ

మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్‌ పంపిణీ జరుగుతోంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వ రేషన్‌, రెండో దఫా రాష్ట్ర ప్రభుత్వ రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. మొదటి మూడు విడతల్లో రేషన్‌ పంపిణీలో చాలా జాగ్రత్తలు పాటించారు. ఓ సారి ఇంటికే సరుకులను డోర్‌డెలివరీ చేశారు. అయితే తర్వాత ఏమైందో గానీ రాష్ట్ర ప్రభుత్వం డోర్‌డెలివరీని పక్కనపెట్టి కార్డుదారులే వచ్చి రేషన్‌ తీసుకోవాలని సూచించింది. ఆ తర్వాత కరోనా నివారణ చర్యల్లో భాగంగా మరో విడత కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మాత్రం రేషన్‌ సరుకులను డోర్‌డెలివరీ చేశారు. కానీ ఆ తర్వాత నుంచి సాధారణ ప్రాంతం, కంటైన్మెంట్‌ ప్రాంతం అన్న తేడా లేకుండా అందరూ దుకాణాలకు వెళ్లి రేషన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ సమయాల్లో మాదిరిగానే ఇప్పుడు కూడా బయోమెట్రిక్‌ ద్వారానే రేషన్‌ పంపిణీ జరుగుతోంది. దీంతో చాలా చోట్ల సర్వర్‌ సమస్య ఏర్పడుతోంది. దీని మూలంగా కార్డుదారులు గంటల కొద్దీ సరుకుల కోసం ఎదురుచూస్తున్నారు. మొదట్లో రోజుకు 50 మందికి చొప్పున టోకన్లు పంపిణీ చేశారు.


కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా సరిగా అమలు జరగడం లేదు. ముందుగా రేషన్‌ తీసేసుకుందామన్న ఉద్ధేశంతో ఎక్కువ మంది కార్డు దారులు మొదటి మూడు, నాలుగు రోజుల్లోనే రేషన్‌ దుకాణాలకు వెళుతున్నారు. దీని మూలంగా అక్కడ గుంపులుగా ఏర్పడాల్సి వస్తోంది. ఇక చాలా రేషన్‌ దుకాణాల్లో శానిటైజర్లు కనిపించడం లేదు. మొదట్లో మంచినీళ్లు, చేతులు కడుక్కునేందుకు సబ్బు ఏర్పాటు చేశారు తప్ప తర్వాత పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా రేషన్‌ డీలర్లకు శానిటైజర్లు అందించకపోతుండడం, సకాలంలో కమీషన్లు ఇవ్వకపోతుండడంతో ఖర్చుకు రేషన్‌ డీలర్లు వెనకాడు తున్నారు. 


భయపడుతూనే దుకాణాలకు..

పేదలు భయం భయంగానే రేషన్‌ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురు రేషన్‌ డీలర్లు కరోనా బారిన పడ్డారు.దీంతో  ఆ కుటుంబాలు కూడా భయపడుతూనే సరుకులు పంపిణీ చేస్తున్నాయి. బయోమెట్రిక్‌ లేకుండా సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేపడితే త్వరత్వరగా జరిగిపోతుందని డీలర్లు చెబుతున్నారు. దీని వల్ల ఒకరికొకరికి కాంటాక్ట్‌ ఉండదని, ఎక్కువ సేపు సరుకుల కోసం నిల్చోనవ సరం లేదని అంటున్నారు. మరోవైపు ప్రజలు కూడా కరోనా సమయంలో ప్రమాదం లేకుండా సరుకులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రేషన్‌ పంపిణీలో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-08-05T11:23:41+05:30 IST