‘దివి’లో నిండుకున్న కరోనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-04-11T06:45:58+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో దివి ప్రాంతంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా వ్యాక్సిన్‌ నిండుకుంది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.

‘దివి’లో నిండుకున్న కరోనా వ్యాక్సిన్‌

  నాలుగు రోజులుగా అందుబాటులో లేక తిరిగి వెళ్తున్న ప్రజలు 

అవనిగడ్డ టౌన్‌, ఏప్రిల్‌ 10: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో దివి ప్రాంతంలోని పలు ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా వ్యాక్సిన్‌ నిండుకుంది. దీంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా..నాలుగు రోజులుగా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ఆసుపత్రికి వచ్చి నిరాశగా వెనుతిరుగుతున్నారు. ప్రభుత్వాలు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉంచలేక పోవడమేమిటని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు అవనిగడ్డ తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవనంలో, అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి భవనంలో, నాగాయలంక పీహెచ్‌సీ వద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం క్రితమే అవనిగడ్డ తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవనంలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని తీసివేశారు. ఆసుపత్రికి దూరంగా ఉండటంతోనే ఈ కేంద్రాన్ని తీసివేసినట్లుగా ప్రకటించినప్పటికీ వాస్తవంగా వ్యాక్సిన్ల కొరతే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 

నిండుకున్నది వాస్తవమే!

ప్రస్తుతం టీకాలు నిండుకున్న మాట వాస్తవమే. ఒకటి, రెండ్రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది. 

- జయప్రద, నాగాయలంక పీహెచ్‌సీ వైద్యాధికారిణి


 ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులోకి..

శుక్రవారం నుంచి వ్యాక్సిన్లు అయిపోయాయి. ఒకటి, రెండ్రోజుల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేలా ఉన్నతాధికారులకు నివేదించాం. 

- డాక్టర్‌ శ్రీనివాస్‌, అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి పీపీ యూనిట్‌ ఇన్‌చార్జ్‌ 


 

Updated Date - 2021-04-11T06:45:58+05:30 IST