Abn logo
May 23 2020 @ 03:02AM

పోలీస్‌పై సీబీఐ

విశాఖ నగర పోలీసులపై విచారణకు హైకోర్టు ఆదేశం

డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టు సమయంలో

వ్యవహరించిన తీరుపై అసంతృప్తి

ఆయన శరీరంపై గాయాలు ఉన్నట్టు

ఉన్నత న్యాయస్థానానికి జడ్జి నివేదిక

పోలీసుల నుంచి అందిన రిపోర్టులో

గాయాల ప్రస్తావన లేకపోవడంతో

కేసు విచారణ సీబీఐకి అప్పగింంచాలంటూ ఆదేశం


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో విశాఖ నగర పోలీసులు స్పందించిన తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు...విశాఖ పోలీసులపైనా కేసు నమోదుచేసి విచారణ జరపాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. 


ఇటీవల కాలంలో నగర పోలీసుల వైఖరి వివాదాస్పదమవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ మధ్య విశాఖపట్నం వచ్చినప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వారిని అడ్డు తొలగించి, ఆయన్ను ముందుకు పంపాల్సిన పోలీసులు చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీచేసి, నగరంలోకి రానీయకుండా వెనక్కి పంపించేశారు.


ఈ విషయంలో విశాఖ పోలీసుల తీరును అప్పట్లో హైకోర్టు తప్పుబట్టింది. ఓ మాజీ ముఖ్యమంత్రికి ఆ సందర్భంలో ఆ సెక్షన్‌ కింద నోటీసు ఇవ్వవచ్చునా? అని ప్రశ్నించింది. దానికి అధికారులు సమాధానం చెప్పుకోలేక తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది. డీజీపీ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. 


ఇప్పుడు డాక్టర్‌ సుధాకర్‌ కేసులోను అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ నెల 16వ తేదీన జాతీయ రహదారిపై అక్కయ్యపాలెం వద్ద డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ ఉగ్రవాదిని పట్టుకునేటప్పుడు ఎలా వ్యవహరిస్తారో...అలా మెడపై లాఠీ పెట్టి, రెండు చేతులు వెనక్కి విరిచి తాళ్లతో కట్టేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌ నుంచి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం మద్యం సేవించి వున్నట్టు ధ్రువీకరించిన వైద్యులు...ఆయన పరిస్థితి బాగోలేదంటూ మానసిక వైద్యశాలకు తరలించారు. ఇలాంటి సందర్భాల్లో మేజిస్ర్టేట్‌ ముందు హాజరుపరిచి అనుమతి తీసుకుంటారు. కానీ అధికారులు అలా చేయలేదు.


కొద్ది గంటల్లోనే ఆయన మానసిక స్థితి బాగాలేదని పేర్కొంటూ ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఓ వైద్యుని పట్ల వ్యవహరించాల్సిన రీతిలో పోలీసులు వ్యవహరించలేదని రాష్ట్రం మొత్తం కోడై కూసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టులో కేసు వేశారు. డాక్టర్‌ సుధాకర్‌కు అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలని కోరారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు...ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ సుధాకర్‌ వాంగ్మూలం తీసుకోవాలని జిల్లా సెషన్స్‌ జడ్జిని ఆదేశించింది.


ఈ మేరకు అక్కడకు వెళ్లిన జడ్జికి డాక్టర్‌ సుధాకర్‌ తన శరీరంపై గాయాలు చూపించారు. పోలీసులు తనను ఏ విధంగా కొట్టిందీ వివరించారు. డాక్టర్‌ సుధాకర్‌ ఒంటిపై గాయాలు వున్నాయని  అదనపు జిల్లా న్యాయమూర్తి తన నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వం తరపున పోలీసులు కూడా జరిగిన ఘటనపై నివేదికను కోర్టుకు అందజేశారు. అందులో డాక్టర్‌ సుధాకర్‌ శరీరంపై గాయాల గురించి లేకపోవడంతో...సమాచారం దాస్తున్నారంటూ గ్రహించిన హైకోర్టు దీనిని సీబీఐ విచారణ చేయాలని ఆదేశించింది. 


విశాఖ పోలీసుల తీరు ఆక్షేపణీయంగానే ఉంది. ఇక్కడ పోలీస్‌ కమిషనర్‌ను పక్కన పెట్టి...తామే కమిషనర్‌ అన్నట్టుగా అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్న కొంతమంది అధికారుల వల్ల చాలా చిక్కులు వచ్చి పడుతున్నాయి. అవి జిల్లా స్థాయిలోనే ఆగిపోవడం వల్ల ఇప్పటివరకు ఏమీ కాలేదు. అవి కూడా పైకి వెళితే...ఉన్న ఆ కొద్ది పరువు కూడా పోతుంది. ఓ అధికారి రైతుబజార్‌కు చెందిన ఓ అసిస్టెంట్‌ను లాఠీతో కొట్టి, ఓ రాత్రి అంతా స్టేషన్‌లో ఉంచారు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో ఆయన కుటుంబంతో సహా రుషికొండ పార్కులో షికారుకు వెళ్లారు.


దీనిని ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఎందుకు తీశావని ప్రశ్నిస్తే...ప్రజలను బీచ్‌కు రావద్దని చెప్పి, మీరు ఎలా వచ్చారు? అంటూ ఆ యువకుడు ప్రశ్నించాడు. ఎదురు ప్రశ్నించడం...సహించలేని అధికారి వెంటనే సదరు యువకుడిపై  కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఏదేమైనా ప్రజలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై విశాఖపట్నం పోలీసులకు ఇప్పుడు శిక్షణ అవసరమని అర్థమవుతోంది. 

Advertisement
Advertisement
Advertisement