సరిహద్దుల్లోకి రండి.. ఉచితంగా తరలిస్తాం!

ABN , First Publish Date - 2022-02-26T06:34:44+05:30 IST

యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది. బాధితులంతా ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలకు..

సరిహద్దుల్లోకి రండి..  ఉచితంగా తరలిస్తాం!

  • ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారికి కేంద్రం భరోసా..
  • హంగరీ, రొమేనియా, బెలారస్‌ మీదుగా భారత్‌కు తరలింపు 
  • ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన బాధితులకు కేంద్రం భరోసా
  • హంగరీ, రొమేనియా, బెలారస్‌ మీదుగా భారత్‌కు తరలింపు 
  • విమాన ప్రయాణ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన
  • ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో చెక్‌పాయింట్ల వద్ద అధికారుల బృందాలు
  • అక్కడికొచ్చేవారు బస్సులకు త్రివర్ణపతాకం అతికించుకోవాలని.. 
  • పాస్‌పోర్టు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పత్రాలతో రావాలని సూచనలు
  • ఎయిరిండియా ప్రత్యేక విమానాలు బుకారెస్ట్‌కు 2, బుడాపెస్ట్‌కు 1
  • వెనక్కి రప్పించండి.. ఖర్చులు భరిస్తాం: జైశంకర్‌కు కేటీఆర్‌ ట్వీట్‌


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించే చర్యలను కేంద్రం ముమ్మరం చేసింది. బాధితులంతా ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోకి తరలించి, ప్రత్యేక విమానాల ద్వారా ఉచితంగా భారత్‌కు చేరుస్తామని పేర్కొంది. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉంటారని, వీరిలో 4 వేల మంది తిరిగిరాగా.. 16 వేల మంది దాకా అక్కడ ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. గురువారం ఉక్రెయిన్‌ తమ గగనతలాన్ని మూసివేయడంతో ఆ దేశానికి పొరుగున ఉన్న హంగరీ, రొమేనియా, బెలారస్‌ మీదుగా వీలైనంత మందిని భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు   రెండు విమానాలను, హంగరీ రాజధాని  బుడాపే్‌స్టకు ఒక విమానాన్ని ఎయిర్‌ ఇండియా నడపనుంది.


ఈ విమానాలు శనివారం వరకు అక్కడికి చేరుతాయని అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్‌-రొమేనియా సరిహద్దుల్లోకి చేరుకున్న మన ప్రజలను కేంద్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో రోడ్డు మార్గం ద్వారా బుకారెస్ట్‌కు తరలిస్తారు.  హంగరీ సరిహద్దు ఉజ్హోర్డ్‌ సమీపంలోని చోప్‌-జాహోయ్‌ చెక్‌ పాయింట్‌కు, రొమేనియా సరిహద్దు చెర్నివిస్ట్‌ సమీపంలోని పోరుబ్నే-సిరెట్‌ చెక్‌ పాయింట్‌కు చేరుకుంటున్న మనవాళ్ల సహాయార్థం ప్రత్యేక బృందా లున్నట్లు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, పాస్‌పోర్టు, నగదు, ఇతర అత్యవసర వస్తువులు, కొవిడ్‌ టీకా పత్రాన్ని వెంట తెచ్చుకోవాలని విద్యార్థులకు సూచించింది. నగదు రూపంలో అమెరికా డాలర్లకు ప్రాధాన్యమిస్తే ఉత్తమమని పేర్కొంది. ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాలపై జాతీయ పతాకాన్ని అతికించుకొని రావాలని రొమేనియా, హంగరీ సరిహద్దుల్లోని చెక్‌పాయింట్‌లకు చేరుకునేవారికి ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక సూచనలు చేసింది. 


కీవ్‌ నుంచి ఎంత దూరం?   

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి రొమేనియా బోర్డర్‌ చెక్‌పాయింట్‌ మధ్య దూరం దాదాపు 600 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా ఎనిమిదిన్నర గంటల నుంచి 11 గంటల సమయం పడుతుంది. రొమేనియా బోర్డర్‌ నుంచి బుకారెస్ట్‌కు మధ్య దూరం 500 కిలోమీటర్లు. రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు 7 నుంచి 9 గంటల సమయం పడుతుంది. కీవ్‌ నుంచి హంగరీ బోర్డర్‌ చెక్‌పోస్టు మధ్య దూరం 820 కిలోమీటర్లు. రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే 12-13 గంటలు పడుతుంది. ఆ రకంగా కీవ్‌లో చిక్కుకుపోయినవారు హంగరీ, రొమేనియాకు చేరుకోవడమే  కీలకం.


ఆ బేస్‌మెంట్‌లో 400 మంది విద్యార్థులు

అది ఈశాన్య ఉక్రెయిన్‌లోని రష్యా సరిహద్దు ప్రాంతంలోని సూమె నగరం. రష్యా, సూమెను స్వాధీనంలోకి తెచ్చుకుంది. అక్కడ దాదాపు 400 మంది భారతీయ విద్యార్థులు ఓ బేస్‌మెంట్‌ లోపల తలదాచుకున్నారు. బేస్‌మెంట్‌ సురక్షితమో కాదో తమకు తెలియదని, సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బస్సులు, కార్లు ఇతర వాహనాలేవీ అందుబాటులో లేవని వాపోయారు. 


కాపాడాలంటూ హెల్ప్‌ లైన్లకు ఫోన్లు..

ఉక్రెయిన్‌లో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామంటూ తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు. సచివాలయంలో, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లకు ఫోన్లు చేసి గోడు చెప్పుకొంటున్నారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వం స్థానికులను సురక్షిత ప్రాంతాలైన బంకర్లకు తరలిస్తోందని, భారత్‌, ఇతర దేశాల నుంచి వచ్చినవారిని పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ మేరకు రెండు హెల్ప్‌ లైన్లకు 400పైగా ఫోన్‌  కాల్స్‌ వచ్చాయని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.  ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారని అధికారులు వివరించారు. కొందరు ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారని, తమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలంటూ వేడుకుంటున్నారని వివరించారు. ఇంకా కాల్స్‌ వస్తూనే ఉన్నాయని, వారికి తాము ధైర్యం చెబుతున్నామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లినవారు దాదాపు 3 వేల మంది ఉంటారని అంచనా. వీరిలో కొందరు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న దశలోనే స్వస్థలాలకు తిరిగొచ్చేశారు. మిగతావారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


కేంద్రంతో కేటీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌ సంభాషణ

బాధితుల నుంచి ఫోన్లు వెల్లువెత్తుతుండటంతో మంత్రి కేటీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ రంగంలోకి దిగి కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులను వెనక్కి రప్పించే ప్రయత్నాల్లో భారత రాయబార కార్యాలయంతో కలిపి పనిచేస్తున్నామని సీఎస్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారిని తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయండి. అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌కు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కాగా శుక్రవారం సీఎస్‌ సోమేశ్‌.. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్‌, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌తో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని విద్యార్థులు, రాష్ట్రవాసుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి విమానాలు వచ్చే పరిస్థితి లేదని, బంకర్లలో చోటు లభించడం లేదంటూ కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైనరాష్ట్ర అధికారులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. కాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల గురించి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం కేంద్రమంత్రి జైశంకర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. 










‘భరోసా’ కోసం సుప్రీంలో పిటిషన్‌ 

ఉక్రెయిన్‌లో భారతీయుల పరిస్థితి ఏమిటి? వారికి తిండి, నీళ్లు దొరుకుతున్నాయా? పస్తులతో నెట్టుకొస్తున్నవారెందరు? ఇదే ఆలోచించారేమో విశాల్‌ తివార్‌ అనే ఓ న్యాయవాది! సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. ఉక్రెయిన్‌లోని భారతీయులకు ఆహారం, అవసరమైన వైద్య సదుపాయాలు, ఆవాసాలు అందుబాటులో ఉంచేందుకుగాను కేంద్రం భరోసా కల్పించాలని.. ఆ దిశగా మోదీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే విషయం తెలిసినా భారతీయులనుస్వదేశానికి తరలించే విషయంలో కేంద్రం విఫలమైందని పిటిషనర్‌ ఆరోపించారు. కాగా ఉక్రెయిన్‌ నుంచి వైద్య విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను వెనక్కి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. 


మా వర్సిటీలోనే తెలుగువాళ్లు 600 మంది

‘‘నా పేరు రజియా. మాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. ఉక్రెయిన్‌ జపోరిజజియా నగరంలోని విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. నాతోపాటు భారత విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో తెలుగు విద్యార్థులే 600 మంది. మాకు 300 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతోంది. బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాం. మమల్ని తీసుకెళ్లేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెప్పారు. ఇక్కడి అధికారులు పాస్‌పోర్టు, సర్టిఫికెట్లు, సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించారు’’          


ఆంధ్రజ్యోతితో ఫోన్లో రజియా?

తాగేందుకు నీళ్లూ లేవు 

‘‘మాది సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు  మండలం చిట్కుల్‌ గ్రామం. మా అబ్బాయి రాజ్‌కుమార్‌ ఉక్రెయిన్‌లోని ఒదెస్సా నగరంలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. చివరి క్షణంలో విమానాలు రద్దవడంతో చిక్కుకుపోయాడు. తాను ఉన్నచోటుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే బాంబులు పడుతున్నాయని.. మంచినీళ్లు కూడా దొరకడం లేదని చెప్పాడు. ప్రాణ భయంతో బతుకుతున్నామని విలపించాడు. కేంద్రం వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులను సురక్షితంగా రప్పించాలి’’

 మీసాల నర్సింహులు 


మీకు మేమున్నాం.. ధైర్యంగా ఉండండి: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘యుద్ధ ప్రాంతాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి.  మీరు అక్కడి నుంచి క్షేమంగా బయటపడే వరకు అండగా ఉంటాం. ఏ సాయం కావాలన్నా చేస్తాం.  కేంద్రంతో మాట్లాడి త్వరితగతిన ఇండియాకు తీసుకొచ్చేందుకు కృష్టి చేస్తున్నాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఉక్రెయిన్‌ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులతో జూమ్‌ ద్వారా మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా..  రష్యా సరిహద్దుకు 42 కిలోమీటర్ల దూరంలోని కార్క్యూ ప్రదేశంలో ఉన్న జొన్నాల రవితేజ మాట్లాడుతూ.. ‘మెట్రో స్టేషన్ల కింద బంకర్లలో తలదాచుకొన్నాం. ఈ ప్రదేశంలో భారతీయులు సుమారు ఆరు వేల మంది ఉన్నారు. కీవ్‌ సహా చాలా విమానాశ్రయాలు రష్యా సైన్యం స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. మేం ఎలా బయట పడాలో తెలియడం లేదు’ అని చెప్పాడు. అదే ప్రదేశంలో ఉన్న ఈశ్వర్‌ మాట్లాడుతూ తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి వరకూ నాలుగైదుసార్లు బాంబులు పడ్డాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఉన్న తమలం అభిజ్ఞ మాట్లాడుతూ తామంతా బంకర్లలో వేల మంది ఉండేసరికి ఆహారం కూడా దొరకడం లేదన్నారు.అందరికీ చంద్రబాబు ధైర్యం చెప్పారు. 

Updated Date - 2022-02-26T06:34:44+05:30 IST