Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదుకోండయ్యా.. !

ఇందుకూరుపేట : తమను ఆదుకోవాలంటూ కేంద్ర బృందం అధికారులను కోరుతున్న రాజుకాలనీ గ్రామవాసులు

వరద బాధితులు, రైతుల వేడుకోలు

ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

క్షేత్రస్థాయిలో నష్టాలు తెలుసుకున్న అధికారులు

జిల్లాలో నష్టం.. రూ.1190.15 కోట్లు

కేంద్ర బృందాలకు నివేదించిన కలెక్టర్‌


నెల్లూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ‘సర్వస్వం కోల్పోయాం. కట్టుబట్టలే మిగిలాయి. ఆదుకోండయ్యా..’ అంటూ వరద బాధితులు, రైతులు కేంద్ర అధికారుల ఎదుట తమ కష్టాన్ని చెప్పుకున్నారు.  వరద నష్టాలను అంచనా వేసేందుకు రెండు కేంద్ర బృందాలు ఆదివారం జిల్లాకు విచ్చేశాయి. మొదటి బృందం తిరుపతి నుంచి నెల్లూరుకు చేరుకోగా, జేసీ ఎంఎన్‌ హరేందిరప్రసాద్‌  స్వాగతం పలికారు. రెండో బృందం కడప నుంచి సోమశిలకు రాగా, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు స్వాగతం పలికారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్‌ సెక్రటరీ అనీల్‌కుమార్‌సింగ్‌, కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌సింగ్‌ ఆర్థికశాఖ డైరెక్టర్‌ అభయ్‌కుమార్‌లు మొదటి బృందంలో సభ్యులుగా ఉన్నారు. రెండో బృందంలో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఎన్‌డీఎంఏ అడ్వైజర్‌ కునాల్‌ సత్యార్థి, కేంద్ర వ్యవసాయ, రైతు, సంక్షేమశాఖ డీజేడీ డైరెక్టర్‌ కే మనోహరన్‌, కేంద్ర విద్యుత్‌శాఖ డైరెక్టర్‌ శివన్‌ శర్మ, కేంద్ర జలవనరులశాఖ ఎస్‌ఈ శ్రీనివాసు బైరీలు సభ్యులుగా ఉన్నారు. ఒక కేంద్ర బృందం జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో పర్యటించగా రెండో బృందం పశ్చిమ ప్రాంతాల్లో పర్యటించింది. వర్షం కురుస్తుండడంతో అధికారుల పర్యటనకు ఇబ్బందిగా మారింది. 


మొదటి బృందంలోని అధికారులు ముందుగా ఇందుకూరుపేట మండలం జేజే పేటలో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ఎంత నష్టం జరిగింది? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత  గంగప ట్నంలో తెగిపోయిన రోడ్లు, కూలిపోయిన ఇళ్లు, తెగిన చె రువు కట్టలను పరిశీలించారు. ముదివర్తిపాలెం - రాజుపా లెం మధ్య రోడ్డు మార్గం తెగిపోవడంతో అధికారులంతా చెప్పులు లేకుండానే బురదలో నడుస్తూ అక్కడి పరిస్థితిని చూశారు. ఇసుక మేటలతో నిండిన పొలాలను సందర్శించి పంట నష్టాన్ని తెలుసుకున్నారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారి కష్టాలను ఆలకించారు. జేసీ ఎంఎన్‌ హరేందిరప్రసాద్‌ వారి వెంట నడుస్తూ వరద ప్రభావాన్ని తెలియజేశారు. తర్వాత అక్కడి నుంచి నెల్లూరుకు చేరుకొని భగత్‌సింగ్‌ కాలనీ సమీపంలో కోతకు గురైన జాతీయ రహదారిని పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని కమిషనర్‌ కే దినేష్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ గోవర్థన్‌లు కేంద్ర అధికారులకు వివరించారు. 


రెండో బృందం సోమశిల జలాశయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితి పరిశీలించింది. ఆ పరిసర గ్రామాల్లో ఇసుక మేట వేసిన పొలాలను చూసి చలించిపోయింది. సంగం వద్ద బీరాపేరును పరిశీలించింది. బుచ్చి మండలం పెనుబల్లి వద్ద తెగిపోయిన ప్రధాన రోడ్డును పరిశీలించిన అనంతరం దెబ్బతిన్న హైస్కూల్‌, పశువైద్యశాలను సందర్శించింది. తర్వాత జొన్నవాడ వద్ద తెగిన పెన్నా పొర్లుకట్టలను పరిశీలించి స్థానికులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులు తెలుసుకున్నారు. అనంతరం దేవరపాలెం వద్ద దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును పరిశీలించారు. పొర్లుకట్టలను పటిష్టం చేయడంతో పాటు లేని చోట కొత్తగా పొర్లుకట్టలు నిర్మించాలని స్థానికులు  విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఈ బృందానికి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు. 


నష్టం.. రూ.1190.15 కోట్లు

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రెం డు కేంద్ర బృందాలూ నెల్లూరులోని ఓ ప్రైవేటు హోటల్‌కు చేరుకున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అక్కడ ఏర్పాటు చేసిన వరద నష్టాల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించాయి. అనంతరం కలెక్టర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివిధ శాఖలకు సంభవించిన నష్టాలను వివరించారు. రూ.1190.15 కోట్లు జిల్లాలో నష్టం జరిగినట్లు తెలిపారు. అత్యధికంగా ఇరిగేషన్‌ శాఖకు రూ.756.93 కోట్లు నష్టం జరగ్గా, పంచాయతీరాజ్‌ విభాగానికి రూ.335.73 కోట్లు, ఆర్‌అండ్‌బీకు రూ.40.79 కోట్లు, మున్సిపల్‌ శాఖకు రూ.11.14 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.12.68 కోట్లు, మత్స్య శాఖకు రూ.15.23 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ.5.67 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.8.52 కోట్లు, విద్యాశాఖకు రూ.2.54 కోట్లు నష్టం వాటిల్లినట్లు కలెక్టర్‌ కేంద్ర అధికారులకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. 


కడప తర్వాత ఇక్కడే ఎక్కువ నష్టం

పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ అనంతరం కేంద్ర బృందానికి నేతృత్వం వహించిన కునాల్‌ సత్యార్థి మాట్లాడుతూ రాష్ట్రంలో కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలోనే అత్యధిక నష్టం జరిగినట్లుగా గుర్తించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారమే సహాయం చేస్తుందని, అందుకు అనుగుణంగా మార్గదర్శకాల్లో తెలిపిన పదకొండు అంశాల గురించి వివరంగా నివేదిక తయారు చేసి అందజేయాలని కలెక్టర్‌కు సూచించారు. నష్టం అంచనాల నివేదికను జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో శాఖల వారీగా తయారు చేయాలని కోరారు. తమ స్థాయిలో సాధ్యమైనంత ఎక్కువ సాయం అందేలా కృషి చేస్తామని  ఆయన ప్రకటించారు. 

 

ఉదారంగా సాయం చేయండి : టీడీపీ  

 వరదలతో ఎంతోమంది జీవనాధారం కోల్పోయి కట్టుబ ట్టలతో  మిగిలారని, పాడి, పంట, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరందరిని ఆదుకోవాలని జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర అధికారులను టీడీపీ నేతలు కోరారు. ఈ మేరకు నెల్లూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.   కేంద్ర బృందాన్ని కలిసిన వారిలో ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్ధుల్‌ అజీజ్‌, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జెన్ని రమణయ్య, బొమ్మి సురేంద్ర, చెమకుల కృష్ణ చైతన్య, సాబీర్‌ ఖాన్‌ తదితరులు ఉన్నారు. 


సర్వం కోల్పోయినా పట్టించుకోరా ?

అధికారులను నిలదీసిన వరద బాదితులు 

 నెల్లూరు (వెంకటేశ్వరపురం) నవంబరు 28 : వరద నష్టం అంచనాల కోసం జిల్లాకు వచ్చిన కేంద్ర  బృందం కోసం  నగరంలోని భగత్‌సింగ్‌కాలనీ ప్రజలు ఆదివారం మధ్యాహ్నం పరుగులు తీశారు. అయితే అప్పటికే బృందం సభ్యులు పరిశీలించి  వెళ్లిపోయారు. అక్కడే ఉన్న జేసీ హరింరేదిర ప్రసాద్‌, కమిషనర్‌ దినేష్‌కుమార్‌ను వరద బాధితులు నిలదీశారు. సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. వలంటీర్‌లు  రూ.2వేలు నగదు అందించార న్నారు.  అవి అందరికీ అందలేదన్నారు. లక్షలు నష్టపోతే  రూ.2వేలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. దీంతో జేసీ, కమిషనర్‌లు మాట్లాడుతూ త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామన్నారు.  అధికారులను నిలదీసిన వారిలో వార్డు వలంటీర్‌ ఉండటం విశేషం. 

ఇందుకూరుపేట : జగదేవిపేటలో దెబ్బతిన్న అరటితోటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం


నగరంలోని ఓ హోటల్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న కేంద్ర అధికారులు


వరదసాయంపై జిల్లా అధికారులను నిలదీస్తున్న నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీ వాసులు


Advertisement
Advertisement