Central Vistaను ఆపేయడమే పిటిషనర్ లక్ష్యం : కేంద్రం

ABN , First Publish Date - 2021-05-11T21:00:51+05:30 IST

నూతన పార్లమెంటు భవనంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు

Central Vistaను ఆపేయడమే పిటిషనర్ లక్ష్యం : కేంద్రం

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏదో ఒక విధంగా ఆపేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టును అడ్డుకోవడానికి మొదటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ రాజధాని నగరంలో ఢిల్లీ మెట్రోతో సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అయినప్పటికీ పిటిషనర్లు కేవలం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను మాత్రమే ఆపాలని కోరుతున్నారని, దీనినిబట్టి వారి ఉద్దేశాలు బయటపడుతున్నాయని తెలిపింది. వేర్వేరు సంస్థలు కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని, కానీ పిటిషనర్లు కేవలం ఒకే ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, తాము ప్రజల పట్ల స్ఫూర్తితో వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారని పేర్కొంది. 


ఈ అఫిడవిట్ ఇంకా రికార్డుకు చేరకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. ట్రాన్స్‌లేటర్ అన్య మల్హోత్రా, హిస్టోరియన్, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ సొహయిల్ హష్మీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అత్యవసర కార్యకలాపం కాదని, దీనిని కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపేయాలని కోరారు. 


కేంద్ర ప్రభుత్వం మే 10న దాఖలు చేసిన అఫిడవిట్‌లో సెంట్రల్ విస్టా నిర్మాణ పనులకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలోనే కార్మికులు నివసిస్తున్నారని తెలిపింది. ఏప్రిల్ 19న కర్ఫ్యూ విధించడానికి ముందే వీరిని నియమించుకున్నట్లు తెలిపింది. అదే ప్రదేశంలో కోవిడ్ నుంచి తప్పించుకునేందుకు తగిన ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇక్కడ 250 మంది కార్మికులు ఉంటున్నారని, వీరంతా నిర్మాణ పనులు చేయడానికి అంగీకరించారని తెలిపింది. 


సెంట్రల్ విస్టా ప్రాజెక్టు క్రింద నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తారు. అంతేకాకుండా రాజ్‌పథ్ మార్గాన్ని ఆధునికీకరిస్తారు. ప్రభుత్వ పరిపాలనా భవనాలను కూడా నిర్మిస్తారు. 2021 జనవరి నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. టాటా ప్రాజెక్ట్స్‌  దీనిని నిర్మిస్తోంది. 2022 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.


Updated Date - 2021-05-11T21:00:51+05:30 IST