పన్ను నిజాయితీకి పట్టం

ABN , First Publish Date - 2020-08-14T07:16:08+05:30 IST

ఆదాయ పన్ను వేధింపులకు, పన్ను చెల్లింపుదారులందరినీ మోసగాళ్లుగా చూసే పద్ధతికి అడ్డుకట్ట వేసే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆదాయ పన్ను చెల్లింపులు, అప్పీళ్లకు సంబంధించి అధికారులను ముఖాముఖి కలవాల్సిన అవసరం లేని...

పన్ను నిజాయితీకి పట్టం

నిజాయితీపరులైన పన్నుచెల్లింపుదారులు దేశనిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారు. వారి జీవితం సులభతరంగా మారితే వారు పురోగమిస్తారు. అభివృద్ధి చెందుతారు. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెంది, ముందుకు దూసుకుపోతుంది. ఈ కొత్త వేదిక పన్ను వ్యవస్థను సంస్కరించి, సరళతరం చేస్తుంది.

- ప్రధాని మోదీ


  • అధికారులను కలవాల్సిన అవసరం లేని పన్ను వ్యవస్థ
  • పారదర్శక పన్ను వేదికను ప్రారంభించిన ప్రధాని మోదీ
  • పన్నుచెల్లింపుదారుల చార్టర్‌ అందుబాటులోకి
  • నిజాయితీగా పన్ను చెల్లిస్తే నిర్భయంగా ఉండొచ్చు
  • 130 కోట్ల మందిలో పన్ను చెల్లించేది కోటిన్నర మందేనా?
  • నిర్మాణాత్మక సంస్కరణల దశలో కొత్తస్థాయికి చేరాం: ప్రధాని


న్యూఢిల్లీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను వేధింపులకు, పన్ను చెల్లింపుదారులందరినీ మోసగాళ్లుగా చూసే పద్ధతికి అడ్డుకట్ట వేసే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆదాయ పన్ను చెల్లింపులు, అప్పీళ్లకు సంబంధించి అధికారులను ముఖాముఖి కలవాల్సిన అవసరం లేని.. ‘పారదర్శక పన్ను విధానం- నిజాయితీని గౌరవించడం’ అనే సరికొత్త వేదికను ప్రధాని మోదీ గురువారం ఆవిష్కరించారు. తాము ప్రవేశపెట్టిన పన్ను వ్యవస్థ ఎటువంటి ఇబ్బందీ లేకుండా, నిరంతరం లభ్యమవుతుందని.. పన్ను చెల్లింపుదారులు ఏ అధికారినీ ముఖాముఖి కలవాల్సిన అవసరం ఉండదని ప్రధాని వివరించారు.


నిజాయితీగా పన్ను చెల్లించేవారిని ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని, వారి పట్ల హేతుబద్ధంగా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుందని, ఈ కొత్త పన్ను వ్యవస్థతో వారు నిర్భయంగా ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. పారదర్శక పన్ను వేదికను ప్రవేశపెట్టడం ద్వారా నిర్మాణాత్మక సంస్కరణల దశలో కొత్తస్థాయికి చేరుకున్నామని..  21వ శతాబ్దపు పన్ను వ్యవస్థ అవసరాలను తీర్చేందుకే ఈ వేదికను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. ప్రజా ప్రయోజనాలు, ప్రజాహితమే కేంద్రంగా పన్ను వ్యవస్థను తయారుచేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. దేశంలో 130 కోట్లమంది జనాభా ఉంటే రెండున్నర కోట్ల మంది మాత్రమే ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారని.. వారిలోనూ కేవలం కోటిన్నర మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని, ఇది చాలా తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తాము చెల్లించాల్సిన ఆదాయపన్ను చెల్లించి ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు సహాయపడాల్సిందిగా మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఉన్న పన్ను విధానం స్వాతంత్య్ర పూర్వం కాలం నాటిదని, ఎవరూ దాని మౌలిక స్వభావాన్ని మార్చే ప్రయత్నం చేయలేదని చెప్పారు. గత వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతల వల్ల దాన్ని అమలు చేయలేకపోయామన్నారు. తాజా చట్టాల వల్ల పన్ను వ్యవస్థపై న్యాయపరమైన భారం తొలగిపోయిందని, రూ. కోటి వరకు కేసులు హైకోర్టుకు, రూ.2 కోట్ల వరకు కేసులు సుప్రీంకోర్టుకు వెళతాయన్నారు. ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకం వల్ల చాలా కేసులు కోర్టు వెలుపలే పరిష్కారమవుతున్నాయన్నారు. 


మూడు ప్రధానాంశాలు..

ప్రధాని ఆవిష్కరించిన పారదర్శక పన్ను విధానంలోని మూడు ప్రధాన అంశాలు.. అధికారులను కలవాల్సిన అవసరం లేకుండా ఆదాయ పన్ను మదింపు (ఫేస్‌లెస్‌ ఎసె్‌సమెంట్‌),  వారికి విజ్ఞప్తి చేసుకునే వీలు కల్పించడం(ఫే్‌సలెస్‌ అప్పీలు), పన్నుచెల్లింపుదారుల చార్టర్‌. వీటిలో.. పన్ను చెల్లింపుదారులు ఎవరి ముందూ హాజరు కాకుండానే పన్ను చెల్లించడం, పన్ను చెల్లింపుదారుల చార్టర్‌ తక్షణమే అమలవుతాయి. ఎవరి ముందూ హాజరు కాకుండా అప్పీళ్లు చేసుకునే పద్ధతి దీనదయాళ్‌ జయంతి రోజు అయిన సెప్టెంబరు 25 నుంచి ప్రారంభమవుతుందని మోదీ ప్రక టించారు.  కాగా.. ఎన్నాళ్లుగానో దేశమంతా ఎదురుచూస్తున్న పన్ను సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇక, దేశ పన్ను పాలన చరిత్రలో ఇదొక మైలురాయిలాంటి రోజుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభివర్ణించారు. ఇక, ప్రధాని ప్రవేశపెట్టిన పారదర్శక పన్ను వ్యవస్థ చరిత్రాత్మకమైనదని హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. 



అధికారుల అభ్యంతరాలు

ప్రభుత్వం ఆవిష్కరించిన పారదర్శక పన్ను వేదికకు ఆదాయ పన్ను అధికారుల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కొత్త మార్పుల అమలులో సమస్యలు వస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు.. ఆదాయ పన్ను ఉద్యోగుల సమాఖ్య, ఆదాయపన్ను శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం  ప్రతినిధులు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఈ నెలలో సంయుక్తంగా లేఖ రాసినట్టు తెలిసింది. ఈ విధానం వల్ల పన్ను ఆదాయం తగ్గే అవకాశం ఉందని, తద్వారా అధికారులపై ఆదాయపన్ను లక్ష్యాల ఒత్తిడి పెరుగుతుందని లేఖలో పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.



ఆ కేసుల్లో హాజరవ్వాల్సిందే!

ఇకపై పన్ను మదింపునకు సంబంధించిన అన్ని ఆదేశాలూ ‘ద ఫేస్‌లెస్‌ ఎసె్‌సమెంట్‌ స్కీమ్‌, 2019’ కింద ‘నేషనల్‌ ఈ-అసె్‌సమెంట్‌ సెంటర్‌’ ద్వారా జారీ అవుతాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. సెర్చ్‌ అండ్‌ సీజర్‌ (సోదాలు, జప్తు) అవసరమైన కేసుల్లో, అంతర్జాతీయ పన్ను కేసుల్లో మాత్రం ప్రత్యక్ష హాజరు తప్పనిసరి. ఆ కేసులు తప్ప సూక్ష్మపరిశీలన నిమిత్తం స్వీకరించే అన్ని ఆదాయపన్ను కేసులూ ‘ఫేస్‌లెస్‌ అసె్‌సమెంట్‌’ పరిధిలోకే వస్తాయని సీబీడీటీ స్పష్టం చేసింది. కొత్త విధానంలో..  స్ర్కూటినీ అవసరమైన రిటర్నుల ఎంపిక నుంచి వాటి కేటాయింపు, అధికారుల ప్రశ్నలకు పన్ను చెల్లింపుదారుల సమాధానం దాకా అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. కాగా.. 58,319 కేసుల్లో 4600కేసులు హైదరాబాద్‌లోని ప్రాంతీయ ఈ-అసె్‌సమెంట్‌ కేంద్రానికి వచ్చాయి. అలాగే.. ఇక మీదట ఐటీ సర్వేలు (సోదాలు) చేపట్టే అధికారం ఎంపిక చేసిన దర్యాప్తు బృందానికి, టీడీఎస్‌ డైరెక్టరేట్‌కు మాత్రమే ఉంటుందని సీబీడీటీ తెలిపింది. ఇప్పటిదాకా.. జాయింట్‌ కమిషనర్‌ అనుమతితో ఐటీ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత మదింపు అధికారి కూడా సోదాలు నిర్వహించేవారు. సీబీడీటీ తాజా నిర్ణయంతో ఐటీ సోదాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




ప్రభుత్వానికి 14.. ప్రజలకు 6 పన్ను 

చెల్లింపుదారుల చార్టర్‌లో సూత్రాలు


కొత్త పన్ను విధానంలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ట్యాక్స్‌పేయర్స్‌ చార్టర్‌లో ప్రభుత్వం/ఆదాయపన్ను శాఖ పాటించాల్సిన 14 సూత్రాలను.. పన్ను చెల్లింపుదారులను ఉద్దేశించి ఆరు సూత్రాలను పొందుపరచారు. అవేంటంటే..

ఆదాయపన్ను శాఖ పాటించాల్సినవి

ఫ పన్నుచెల్లింపుదారులకు న్యాయమైన, మర్యాదపూర్వకమైన, సహేతుకమైన సహకారం అందించడం.

ఫ నిర్దిష్టమైన కారణాలు ఉంటే తప్ప.. ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుడినీ నిజాయతీపరులుగా పరిగణించడం.

ఫ పన్ను చెల్లింపుదారులకు సరైన, నిష్పాక్షికమైన అప్పీలు, పునఃసమీక్ష విధానాన్ని అందుబాటులోకి తేవడం.

ఫ పూర్తిస్థాయి, కచ్చితమైన సమాచారాన్ని అందించడం.

ఫ ఆదాయపన్ను చెల్లింపులకు సంబంధించిన ఏ అంశంపై అయినా చట్టంలో నిర్దేశించిన సమయంలోపే తగిన నిర్ణయం తీసుకోవడం.

ఫ చట్టప్రకారం కట్టాల్సిన పన్నునే వసూలు చేయడం.

ఫ పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇవ్వడం. వారిచ్చే సమాచారాన్ని గోప్యంగా ఉంచడం.

ఫ అధీకృత ప్రతినిధిని ఎంచుకునే వీలును పన్నుచెల్లింపుదారులకు కల్పించడం. ఫిర్యాదుల దాఖలుకు, వాటి పరిష్కారానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పరచడం.

ఫ నిర్ణీత విరామాల్లో సేవా ప్రమాణాలను తెలిపే నివేదికలను ప్రచురించడం. పన్నుచట్టాల అమలు వ్యయాన్ని తగ్గించడం.

ప్రజలు పాటించాల్సినవి

ఫ పన్నుచెల్లింపుదారులు తమ ఆదాయానికి సంబంధించిన పూర్తిసమాచారాన్ని నిజాయతీగా వెల్లడించాలి. చట్టప్రకారం పన్నులు చెల్లించాలి.

ఫ చట్టప్రకారం తాను చెల్లించాల్సిన ఆదాయపన్ను గురించి పన్ను చెల్లింపుదారులు తెలుసుకుని ఉండాలి. అవసరమైతే ఆదాయపన్ను శాఖ సహాయం తీసుకోవాలి.

ఫ అవసరమైన అన్ని రికార్డులనూ భద్రపరచాలి.

ఫ తన తరఫున పన్ను రిటర్నులు దాఖలు చేసే తన ప్రతినిధి ఏ సమాచారాన్ని ఇస్తున్నాడు, ఏ పత్రాలు సమర్పిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుని ఉండాలి.

ఫ రిటర్నులు గడువులోపు దాఖలు చేయాలి. గడువులోపు ఆదాయపన్ను చెల్లించాలి.

Updated Date - 2020-08-14T07:16:08+05:30 IST