Supreme Courtలో కేంద్రానికి ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2021-05-07T20:02:37+05:30 IST

కర్ణాటకకు రోజువారీ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని హైకోర్టు ఇచ్చిన

Supreme Courtలో కేంద్రానికి ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ : కర్ణాటకకు రోజువారీ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు అత్యంత జాగ్రత్తగా ఈ ఆదేశాలను ఇచ్చిందని, కర్ణాటక ప్రజలను దిక్కులేని స్థితిలోకి నెట్టలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం ఏదీ తమకు కనిపించడం లేదని వివరించింది. 


కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మరీ ముఖ్యంగా బెంగళూరులో అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం కర్ణాటకలో 49,058 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 328 మంది ప్రాణాలు కోల్పోయారు. 


ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు మే 5న ఇచ్చిన ఆదేశాల్లో రాష్ట్రానికి రోజువారీ ఆక్సిజన్ సరఫరాను 1,200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 


కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం కనిపించడం లేదని తెలిపింది. హైకోర్టు బాగా ఆలోచించి, జాగ్రత్తగా చక్కని ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది. 


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, కర్ణాటకకు రోజువారీ 965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు సహేతుకమైనవి కాదన్నారు. ప్రతి హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే, దేశంలో ఆక్సిజన్ పంపిణీ, నిర్వహణలో అరాచకం ప్రబలుతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమస్యపై మద్రాస్, తెలంగాణా, ఇతర హైకోర్టులు కూడా విచారణ జరుపుతున్నాయన్నారు. ‘‘రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను హైకోర్టులనే పంపిణీ చేయమనండి’’ అన్నారు. పరిమితంగానే ఆక్సిజన్ ఉందని, చర్చించి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. 


జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, హైకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసిందని, అవసరమైనపుడు సరైన సమయంలో జోక్యం చేసుకుంటామని చెప్పారు. 


Updated Date - 2021-05-07T20:02:37+05:30 IST