చక చకా.. టీకా!

ABN , First Publish Date - 2021-10-22T04:18:53+05:30 IST

రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

చక చకా.. టీకా!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది

- జిల్లాలో మరింత వేగవంతమైన వ్యాక్సిన్‌ ప్రక్రియ
- వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా ప్రతీ ఇంటిని జల్లెడ పడుతున్న ఆరోగ్య సిబ్బంది
- ప్రజల్లో వ్యాక్సిన్‌పై తొలగిన అపోహలు
- ఇప్పటి వరకు 6.97 లక్షల మందికి వ్యాక్సినేషన్‌
- మొదటి డోసు 5.36 లక్షల మందికి, రెండో డోసు లక్షల 1.62 మందికి టీకాలు
- జిల్లాలో 29 కేంద్రాలతో పాటు, ప్రత్యేక వ్యాక్సినేషన్‌ సెంటర్ల ఏర్పాటు
- కరోనా ప్రభావాన్ని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలంటున్న వైద్యనిపుణులు


కామారెడ్డి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ ప్రారంభంలో ప్రజలు విపరీతంగా భయపడ్డారు. ఎక్కడ తమకు అంటుకుంటుందోనన్న అనుమానంతో ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేదు. ప్రభుత్వం సైతం ఎక్కడికక్కడ క్వారంటైన్‌ విధించి ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ సమయంలో వైరస్‌ కొంత తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను సడలించారు. కరోనా పూర్తిగా పోలేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రజలు లెక్క చేయకపోవడంతో పాటు ప్రభుత్వ సూచనలను విస్మరించారు. దీంతో వైరస్‌ తీవ్ర రూపం దాల్చి సెకండ్‌వేవ్‌ ముప్పు వచ్చింది. అయితే వ్యాక్సిన్‌ అప్పటికే అందుబాటులోకి వచ్చిన అనేక అనుమానాల నేపథ్యంలో వేసుకునేందుకు ప్రజలు పెద్దగా ముందుకురాలేదు. ఈ క్రమంలో సెకండ్‌వేవ్‌ విజృంభించి వృద్ధులతో పాటు యువకులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తేనే మేలు అనుకున్న ప్రజలు క్రమక్రమంగా ముందుకు వచ్చారు. ఇలా జిల్లా వ్యాప్తంగా టీకా పంపిణీ వేగవంతమైంది. జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని సీహెచ్‌సీ,పీహెచ్‌సీలలో టీకాలను ఉచితంగా ఇస్తున్నారు. తొలుత 60 ఏళ్ల వయస్సు ఉన్నవారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి ఆ తర్వాత 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేశారు. అయినా కొంత మందిలో భయం నెలకొనడంతో ప్రభుత్వం ఇంటివద్దకే టీకా కార్యక్రమం చేపట్టడంతో నిత్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బందిప్రతీ ఇంటిని జల్లెడ పడుతూ టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6 లక్షల 52 వేల 648 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రతీ ఇంటిని జల్లెడ పడుతున్న ఆరోగ్య సిబ్బంది
గతంలో జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు 28 ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి కేటాయించిన తేదీల్లో టీకాలు వేశారు. అయినా కొంతమందిలో నెలకొన్న భయం వల్ల ఇంట్లోనే ఉంటే వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండడంతో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీ ఒక్కరికి టీకాలు వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ప్రతీ నిత్యం వ్యాక్సినేషన్‌పై వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సూచనలు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో ప్రతీ ఇంటిని ఆశ, ఏఎన్‌ఎంలు జల్లెడ పడుతూ ప్రతీ ఒక్కరికి టీకాలు వేస్తున్నారు. వీరికి తోడుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ వార్డుల్లో, ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపడుతూ వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి తమ వంతు సహకారం అందిస్తూ వంద శాతం టీకా కార్యక్రమం పూర్తయ్యేలా చూస్తున్నారు. అయితే  ఇప్పటి వరకు మొదటి, రెండో డోసు టీకా తీసుకున్నవారందరు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఽఖ అధికారులు పేర్కొంటున్నారు.
6 లక్షల 97 వేల 059 మందికి  వ్యాక్సినేషన్‌
జిల్లాలో మొత్తం 6 లక్షల 97 వేల 059 మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ చేశారు. ఇందులో మొదటి డోసు  5లక్షల 36 వేల 891 మంది తీసుకోగా, రెండవ డోసును 1లక్ష 62 వేల 168 మంది తీసుకున్నారు. పురుషులు 3,26,615, మహిళలు 3,70,324 మంది వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. 18-44 వయస్సు వారు 3,41,560 మంది, 45-60 వయస్సు వారు 2,24,317 మంది, 60 సంవత్సరాల పైబడిన వారు 1,31,182 మంది మొదటి, రెండో టీకా తీసుకున్నవారు ఉన్నారు. జిల్లాలో మొత్తం మందికి మొదటి, రెండో డోసు అందరు తీసుకునే వరకు ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన వస్తుందని మొదట్లో టీకాపై అపోహలతో ముందుకురాని వారు ప్రస్తుతం వచ్చి వ్యాక్సినేషన్‌ చేయించుకుంటున్నారని తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మేలు
కరోనా నియంత్రణకు టీకా ప్రక్రియ కొనసాగుతున్నా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు గతంలో మాదిరిగానే కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అంటున్నారు. శుభకార్యాలు, మాస్కులు ధరించాలని పేర్కొంటున్నారు. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మందితో చేసుకుంటేనే మేలని పేర్కొంటున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ టీకాలు వేయించుకుంటే మహమ్మారి నుంచి రక్షణ పొందే వీలు ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - 2021-10-22T04:18:53+05:30 IST