‘చలో తుంగభద్ర’ను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-11-23T06:02:01+05:30 IST

తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్నానాలను అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఇతర అనుబంధ సంస్థలు ఇచ్చిన ‘చలో తుంగభద్ర’ను పోలీసులు అడ్డుకున్నారు.

‘చలో తుంగభద్ర’ను అడ్డుకున్న పోలీసులు
నదిలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

  1. నదీస్నానానికి దిగిన  బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నేతల అరెస్టు


కర్నూలు(కల్చరల్‌), నవంబరు 22: తుంగభద్ర పుష్కరాల్లో నదీ స్నానాలను అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలులో బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఇతర అనుబంధ సంస్థలు ఇచ్చిన ‘చలో తుంగభద్ర’ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం సంకల్‌బాగ్‌లోని వీఐపీ పుష్కర ఘాట్‌కు తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామునే నాయకులను వారి స్వగృహాల్లో గృహనిరంధం చేశారు. బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌, బీజేపీ మహిళా మోర్చా నాయకులు సంకల్‌ బాగ్‌కు సాధారణ భక్తుల్లా చేరుకొని నదిలోకి దిగి స్నానాలు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే నదిలోకి దిగి బయటకు తీసుకువచ్చారు. బీజేపీ నాయకులు కగ్గుల హరీష్‌బాబు, పీజేఆర్‌ గణేశ్‌, డాక్టర్‌ నాగేంద్ర, ప్రవీణ్‌ యాదవ్‌, బీసీ వీరప్ప, మాళిగి భాను ప్రకాశ్‌, ప్రాణేశ్‌, భూపాలాచారి, రామకృష్ణ, లక్ష్మణ్‌, బజరంగ్‌ దళ్‌ నాయకులు నీలి నరసింహ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు విశ్వంభర్‌, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు శిల్పా శ్రీజ్యోతి, శిరీష, ధనలక్ష్మి, ఉమామహేశ్వరిను అరెస్టు చేసి 2వ, 4వ పట్టణ పోలీసు స్టేషన్లకు తరలించారు. అంతకు ముందు బీజేసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.క్రిష్టన్న, బజరంగ్‌దళ్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ టి.ప్రతాపరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మాజీ అధ్యక్షుడు జీఎస్‌ నాగరాజు, నాయకులు రంగన్న, చింతలపల్లి రామకృష్ణ, యోగాదనంద్‌ను గృహనిర్బంధం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు అరెస్టు చేసిన నాయకులను పోలీసులు విడుదల చేశారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు క్రిష్టన్న మాట్లాడుతూ నదీ పుష్కరాలంటేనే నదుల్లో స్నానాలు చేయడమేనని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హిందూ సంప్రదాయాలను తుంగలో తొక్కి, కొవిడ్‌ సాకుగా చూపి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మండి పడ్డారు. ప్రభుత్వం తుంగభద్ర పుష్కరాలపై రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పుష్కరాల నిర్వహణపై ఆసక్తి లేనప్పుడు ఆర్భాటంగా ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. 


సంగమేశ్వరంలో బైరెడ్డి శబరి అరెస్టు

ఆత్మకూరు: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, బీజేపీ నాయకురాలు శబరిని ఆదివారం సాయంత్రం సంగమేశ్వరంలో పోలీసులు అరెస్టు చేశారు. నదిలో స్నానం చేసి కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఆమెను కొత్తపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాత్రి ఆమెను విడుదల చేశారు.

Updated Date - 2020-11-23T06:02:01+05:30 IST