అరాచకాలకు అంతులేదు.. పల్నాడులో పెట్రేగుతున్న వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2020-09-19T15:10:36+05:30 IST

పల్నాడులో వైసీపీ నాయకులు అరాచకాలకు అంతు లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. వైసీపీ పాలనతో బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందన్నారు.

అరాచకాలకు అంతులేదు.. పల్నాడులో పెట్రేగుతున్న వైసీపీ నాయకులు

దౌర్జన్యాలతో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు వైసీపీకి దూరం

దోపిడీ.. దాడులు, ధరలపై ప్రజలను చైతన్యపర్చాలి

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ సమీక్షలో నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పల్నాడులో  వైసీపీ నాయకులు అరాచకాలకు అంతు లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడారు. వైసీపీ పాలనతో బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. దాడులు, దౌర్జన్యాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లీం మైనార్టీలంతా వైసీపీకి దూరమయ్యారన్నారు. ఈ 16 నెలల్లో 16 శాతం ఓటింగ్‌కు వైసీపీ దూరమైందని తెలిపారు. ’ఛలో ఆత్మకూరుతో’ ప్రభుత్వంపై యుద్ధం మొదలు పెట్టామని గుర్తు చేశారు. నాడు తన ఇంటికి కట్టిన పసుపు తాళ్లే... వైసీపీ ప్రభుత్వానికి ఉరి తాళ్లని హెచ్చరించిన సంగతి గుర్తు చేశా రు. గురజాలలో ఎస్సీ యువకుడ్ని హత్య చేశారని తెలిపారు. ఆత్మకూరులో 127 కుటుంబాలను గ్రామ బహిష్కరిం చారని.. మాచర్ల, గురజాల, నరసరా వుపేట నియోజక వర్గాల్లో వైసీపీ దుర్మార్గాలు అన్నీఇన్నీ కావంటూ ధ్వజమెత్తారు. వైసీపీ బాధితుల పునరావాస శిబిరం నడపడం దేశం లో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదన్నారు. డాక్టర్‌ అరవింద్‌బాబుపై 76 తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీకి అవధులు లేకుండా పోయిందన్నారు. 


చెలరేగి పోతున్న వైసీపీ : జీవీ

జిల్లాలో వైసీపీ గూండాలు, రౌడీలు చెలరేగిపోతున్నారని జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. వినుకొండలో ఎన్టీఆర్‌, పరిటాల విగ్రహాలను తొలగించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల అవినీతి జరిగిందని వివరించారు.


ప్రశాంత పల్లెల్లో చిచ్చు : ప్రత్తిపాటి పుల్లారావు

ప్రశాంతంగా ఉండే నాదెండ్ల, కనపర్రు, చిరుమామిళ్ల, తదితర పల్లెల్లో వైసీపీ నాయకులు చిచ్చుపెడుతున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయా గ్రామాల్లో దాడులు పెరిగాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లో నిలిచిన టీడీపీ అఽభ్యర్థుల ఇళ్లలో వైసీపీ నేతలే మద్యం సీసాలు పెట్టి తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారన్నారు.  రాజధానిలో తన పేరుతో గజం స్థలం ఉన్నా నిరూ పించాలని సవాల్‌ చేస్తే ఇంతవరకు ఎటువంటి స్పందన లేదన్నారు. 


కోడెల చేసిన అభివృద్ధి నాశనం : డాక్టర్‌ అరవింద్‌బాబు

మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ హ యాంలో నరసరా వుపేటలో జరిగిన అభివృద్ధిని వైసీపీ నాశనం చేస్తోందని నరస రావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ అరవింద్‌బాబు అధినేత దృష్టికి తీసుకెళ్లారు. కరోనాలోనూ వైసీపీ ఇసుక, మద్యం మాఫియా ఆగడాలకు హద్దు లేకుండా పోయిందన్నారు.


పనికొచ్చే పని చేయలేదు : కొమ్మాలపాటి శ్రీధర్‌

ఇది రంగులు మార్చే ప్రభుత్వమే తప్ప, రూపాయి పనికొచ్చే పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే కొ మ్మాలపాటి శ్రీధర్‌ తెలిపారు. ఏ నేరం చేయని వారిపై 304 కేసులు, రౌడీషీట్లు పెడు తున్నారన్నారు. కులాలు, మ తాల మధ్య చిచ్చు పెడు తున్నారని తెలిపారు. 


చిలకలూరిపేటలోని పీఎంఏవై-ఎన్టీఆర్‌ నగర్‌లో నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు కేటాయించకపోవడం, ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని నిలిపివేయడం, దళితులపై దాడులు, ఉపాధి బిల్లులపై న్యాయపోరాటం తదితర అంశాలను నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 


దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహిస్తుందని టీడీపీ జిల్లా కార్యదర్శి నందిగం ఆశీర్వాదం తెలిపారు. ఇసుక లేక పోవటంతో అచ్చంపేట మండలంలో వేలాది కార్మికులు ఉపాధి లేక అనేక ఇబ్బం దులు పడుతున్నట్టు చంద్రబాబుకు వివరించారు. వీరితో మాచర్ల ఇన్‌చార్జి చలమారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ గుంటుపల్లి నాగేశ్వరరావు, వడ్డెర సంఘ నేత వల్లెపు నాగేశ్వరరావు, నాదెండ్ల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ తదితరులు చంద్రబాబుతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  


గురజాలలో ముగ్గురిని చంపేశారు: యరపతినేని

గురజాల నియోజకవర్గంలో ముగ్గుర్ని చంపేశారని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఎస్టీ యువకుడు రాజానాయక్‌ను, ఎస్సీ యువ కుడు విక్రమ్‌ను, 18 ఏళ్ల వడ్డెర యువకుడ్ని హత్య చేశారన్నారు. ఛలో ఆత్మకూరు పిలుపుతో వైసీపీ బాధితుల్లో మనోథైర్యం వచ్చిందని తెలిపారు. 


మాఫియా అడ్డాగా నరసరావుపేట

శాండ్‌ - ల్యాండ్‌,  మైన్‌-వైన్‌ మా ఫియాకు అడ్డాగా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మార్చారని విమర్శించారు. వీటన్నింటిపైనా ప్రజల్లో చైతన్యం తీసుకువాలన్నారు. అందులో భాగంగా 100 రోజులు ‘పుసుపు చైతన్యం’ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలలో చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ అవినీతిని, అరాచకాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు.. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. టీడీపీ, వైసీపీ పాలనల్లో తేడాపై ప్రజల్లో చర్చకు తీసుకురావాలని సూచించారు. హుద్‌హుద్‌, తితిలీ విపత్తుల సమయాల్లో బాధితులను ఎలా ఆదుకున్నాం...? ఇప్పుడు కరోనా, వరద బాధితులను వైసీపీ ఎలా నిర్లక్ష్యం చేస్తోందో ప్రజలకు వివరించాలని సూచించారు. పెట్రోలు, డీజిల్‌పై రెండుసార్లు పన్నులు, ఆర్టీసీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, మద్యం ధరలు, గ్యాస్‌ ధరలు పెంచుతూ దోచుకుంటున్న ప్రభుత్వ తీరుపై ప్రజలకు వివరించాలన్నారు.   

Updated Date - 2020-09-19T15:10:36+05:30 IST