మారుతున్న సమీకరణాలు

ABN , First Publish Date - 2021-05-15T05:43:51+05:30 IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గంపై అధికార పార్టీ దృష్టి సారించింది.

మారుతున్న సమీకరణాలు

మంత్రి గంగులను కలుస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు

ఈటల వర్గంపై ఆపరేషన్‌ ఆకర్ష్‌

హుజూరాబాద్‌, మే 14: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గంపై అధికార పార్టీ దృష్టి సారించింది. ఈటలకు అనుకూలంగా ఉన్న వారిని మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపించుకొని మాట్లాడుతున్నారు. ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి బర్తరఫ్‌ అయినప్పటి నుంచి ఇంటెలిజన్స్‌ వర్గాలు ఈటల వర్గీయులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు ఫోన్లలో ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ద్వితీయ శ్రేణి నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. 2004 నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.  ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈటల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మొదట్లో ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా జమ్మికుంటకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు పొనగంటి మల్లయ్య, బండ శ్రీనివాస్‌లు పార్టీ వెంట ఉంటామని ప్రకటించారు. ఆ తరువాత ఈటల రాజేందర్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో హైద్రాబాద్‌లో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కార్యకర్తలు ఎటు వైపు ఉండాలో తెలియక అయోమయంలో ఉన్నారు. 


కౌన్సిలర్లతో మంత్రి గంగుల భేటీ


హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీ కౌన్సిలర్లను మంత్రి గంగుల పిలుపించుకొని మట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉండాలని, కౌన్సిలర్లకు సూచించారు. రెండు రోజుల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను కూడా పిలుపించుకొని మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ఈటల వర్గంలో చీలికలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల వర్గంపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలైనట్లు సమాచారం. ప్రతిరోజు మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ నియోజకవర్గ కార్యకర్తలతో ఫోన్లలో మాట్లాడుతున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉంటే లాభం చేకూరుతుందని మాట్లాడుతున్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-05-15T05:43:51+05:30 IST