నకిలీ చలానాలతో మోసం

ABN , First Publish Date - 2021-09-04T06:10:19+05:30 IST

రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాల్లో చోటుచేసుకున్న నకిలీ చలానాల వ్యవహారం జిల్లానూ తాకింది.

నకిలీ చలానాలతో మోసం
డాక్యుమెంట్‌ రైటర్‌ పవన్‌కుమార్‌ గది

ఒంగోలులో  వెలుగుచూసిన కుంభకోణం

డాక్యుమెంట్‌ రైటర్‌ చేతివాటం

ప్రభుత్వ ఖజానాకు రూ.27లక్షల మేర గండి

పోలీసులకు ఫిర్యాదు చేసిన అఽధికారులు

ఒంగోలు(క్రైం) సెప్టెంబరు 3: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయాల్లో చోటుచేసుకున్న నకిలీ చలానాల వ్యవహారం జిల్లానూ తాకింది. సుమారు రూ.27లక్షల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి డాక్యుమెంటు రైటర్‌ చేతివాటం ప్రదర్శించినట్లు బయటపడింది. తొలుత కడప జిల్లాలో వెలుగు చూసిన నకిలీ చలానాల వ్యవహారం తర్వాత అన్ని జిల్లాలకూ పాకింది. నకిలీ చలానాలపై అనుమానంతో జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక తనిఖీలలో ఒంగోలులో కూడా మోసం జరిగినట్లు తేలింది.  ఇంకా ఎస్‌ఎన్‌పాడు, కనిగిరి ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  


ఏడాది పాటు పరిశీలించగా...

 గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రిజిస్ట్రేషన్‌ జరిగిన సుమారు 10వేల దస్తావేజులను పరిశీలిస్తే ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ ద్యారా జరిగిన దస్తావేజులకు చెల్లించిన చలానాలు నకిలీవని తేలింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చలానాల మోసాలకు పాల్పడినవారు గతంలో ప్రైవేటుగా రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పనిచేసిన వారే కావడం గమనార్హం. అదేక్రమంలో ఒంగోలులోనూ గతంలో స్థానిక రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసి మానుకొని ప్రస్తుతం డాక్యుమెంట్‌ రైటర్‌గా కొనసాగుతున్న వ్యక్తే చలానాల మోసానికి పాల్పడ్డాడు. 


ఒక్కరే.. రూ.26.74లక్షల మోసం

ఒక డాక్యుమెంటు రైటర్‌ ఏడాదిలో 71 దస్తావేజులకు సంబంధించి చెల్లించిన నకిలీ చలానాలతో రూ.26,74,850 ప్రభుత్వ ఆదాయనికి గండికొట్టినట్లు తనిఖీ చేసిన అధికారులు తేల్చారు. మోసానికి పాల్పడిన డాక్యుమెంట్‌ రైటర్‌ కాజా పవన్‌కుమార్‌పై స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ విజయలక్ష్మి ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుభాషిణి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అవకతవకలకు పాల్పడిన నగదు మొత్తం పవన్‌కుమార్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి చెల్లించాడు. దర్యాప్తు అంతా రిజిస్ట్రేషన్‌ అధికారులే చేయడం గమనార్హం. అయితే వారంరోజులుగా పవన్‌కుమార్‌ కనిపించడం లేదు. అతను రిజిస్ర్టేషన్‌ శాఖను మోసం చేసి తిరిగి నగదు చెల్లిస్తే సరిపోతుందా.. అందుకు కార్యాలయంలో ఉన్న ఎవరు సహకరించారు. ఇంకా ఎవరి పాత్ర ఉందనేది విచారణలో తేలాల్సి ఉంది. కాగా ఈ చలానాల కుంభకోణంలో ఎవరైనా అధికారుల హస్తం ఉందా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.  


Updated Date - 2021-09-04T06:10:19+05:30 IST