తీరప్రాంతాల్లో బలమైన గాలులు

ABN , First Publish Date - 2021-12-02T14:25:42+05:30 IST

దక్షిణ అండమాన్‌, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రం లోని దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు

తీరప్రాంతాల్లో బలమైన గాలులు

- చెన్నైలో తేలికపాటి వర్షపు జల్లులు

- వాతావరణ శాఖ వెల్లడి 


అడయార్‌(చెన్నై): దక్షిణ అండమాన్‌, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రం లోని దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే చెన్నై నగరంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపు జల్లులు పడవచ్చని వారు తెలియజేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలకు అల్పపీడనాలు తోడు కావడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి వుంది. ఇది క్రమంగా బలపడి రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాలవైపు వెళ్లనుంది. దీని ప్రభావం కారణంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో గంటలకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇది ఒక్కోసారి 65 కిమీ వరకు వుండొచ్చని, 3వ తేదీన తీర ప్రాంతంలో గంటకు 55 నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 4వ తేదీన పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని వారు హెచ్చరించారు. ఇదిలావుంటే, చెన్నై నగరంలో తేలికపాటి వర్షపు జల్లులు కురుస్తాయని, అంతేకాకుండా, పగటిపూట గరిష్ట ఉష్ణోగ్ర 30 డిగ్రీల సెల్సియస్‌ నుంచి కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదువుతుందని వారు వివరించారు.

Updated Date - 2021-12-02T14:25:42+05:30 IST