కోళ్ల పందెం

ABN , First Publish Date - 2022-01-17T04:55:36+05:30 IST

సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు.. రంగ వల్లులు, పిండి వంటలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందాలు గుర్తుకొస్తాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటకను ఆనుకుని ఉన్న గ్రామాలతో పాటు ఇటిక్యాల, మానవపాడు మండలాల్లోని పలు గ్రామాల్లోనూ కోళ్ల పందేలను నిర్వహిస్తున్నారు.

కోళ్ల పందెం
పర్ధిపురంలో అరెస్టయిన పందెంరాయుళ్లు

నడిగడ్డలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహణ 

టాస్క్‌ఫోర్స్‌ దాడులతో బట్టబయలు 

సాసనూలులో ఓ నాయకుడి కనుసన్నల్లో..

చేతులు మారిన లక్షల రూపాయలు

కమీషన్‌ తీసుకుని ఆడించిన సదరు నాయకుడు

కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో  పందెంరాయుళ్ల రాక

ఒక్కో కోడిపై రూ.50 వేల వరకు బెట్టింగ్‌


 సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు.. రంగ వల్లులు, పిండి వంటలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల  పందాలు గుర్తుకొస్తాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటకను ఆనుకుని ఉన్న గ్రామాలతో పాటు ఇటిక్యాల, మానవపాడు మండలాల్లోని పలు గ్రామాల్లోనూ కోళ్ల పందేలను నిర్వహిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లో గుట్టుగా ఈ తతంగం జరుపుతున్నారు. ఆయా మండలాల్లో పోలీసులు శనివారం నిర్వహించిన దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

- అలంపూర్‌ చౌరస్తా/ఎర్రవల్లి చౌరస్తా/అయిజ


ఆంధ్రప్రదేశ్‌ తరహాలో జోగుళాంబ గద్వాల జిల్లాలోనూ కోడి పందేలను నిర్వహిస్తున్నారు. ఇటిక్యాల, అయిజతో పాటు పలు మండలాల్లో ఏటా సంక్రాంతి పండుగకు ఈ పందేలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటిక్యాల మండలంలోని సాతర్ల, వావిలాల, సాసనూలు, షేక్‌పల్లి, రాజోలి మండలంలోని తుమ్మిళ్ల, గార్లపాడు, రాజోలి, మానవపాడు మండలంలోని బోరవెళ్లి, పల్లెపాడు తదితర గ్రామాల్లోని కొందరు ఆయా గ్రామాల్లో జరిగే జాతర్లు, ఉర్సులు, తీరుణాళ్లల్లో కోళ్ల పందేలు జరుపుతున్నారు. ముఖ్యంగా గట్టు, ఇటిక్యాల, అయిజ, కేటిదొడ్డి, కర్ణాటకను ఆనుకుని ఉన్న పలు మండలాల్లో మధ్య తరగతి కుటుంబాల్లో చాలా మంది పంటలు చేతికొచ్చాక, నవంబరులో ఏపీలోని గుంటూరు, మదనపల్లె తదితర ప్రాంతాలకు వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్తారు. మహిళలు అలా పనులకు వలస వెళ్లాక, ఇళ్ల వద్ద ఉండే కొందరు పురుషులు పేకాట, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. జిల్లాల విభజన అనంతరం అక్కడక్కడా ఈ కోడి పందేలు నిలిచిపోయినా, మారుమూల పల్లెల్లో గుట్టుగా ఇంకా జరుగుతూనే ఉన్నాయనడానికి శనివారం నాటి సాసనూలు, పర్ధిపురం ఘటనలే నిదర్శనం.


ఓ నాయకుడి కనుసన్నల్లోనే

ఇటిక్యాల మండలం సాసనూలు గ్రామంలో శనివారం జరిగిన పోలీసుల దాడుల్లో సుమారు 18 మందిని అరెస్టు చేయగా, 16 కోళ్లు, 17 కత్తులు, రూ.70,000లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక అయిజ మండలం పర్ధిపురం గ్రామంలో జరిగిన దాడుల్లో ఐదు కోళ్లు పట్టుబడగా, మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటిక్యాల మండలంలోని సాసనూలులో పండుగకు నాలుగు రోజుల ముందే కోడి పందేలు మొదలయ్యాయని సమాచారం. గ్రామ శివారులోని ఓ రహస్య ప్రాంతంలో మూడు రోజుల పాటు ఈ పందేలను నిర్వహించినట్లు తెలిసింది. ఈ పందేలలో పాల్గొనడానికి చూట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని గద్వాల జిల్లా అంచున ఉండే గ్రామాల నుంచి, గద్వాల జిల్లాలోని గట్టు, నందిన్నె, అయిజ, గువ్వలదిన్నె, ఇర్కిచేడు, కొండాపూర్‌, పాతపాలెం, కర్నూల్‌ జిల్లాలోని పలుప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పందెంరాయుళ్లు వందలాది కోళ్లతో ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. ఈ పందేలు ఓ మండల నాయకుడి కనుసన్నల్లోనే జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. 


పందెం కోసం ప్రత్యేకంగా కోళ్ల పెంపకం

కోళ్ల పందేల కోసం నడిగడ్డలోని చాలా గ్రామాల్లో పందెం కోళ్లను పెంచడం ఆనవాయితీగా వస్తోంది. వీటి ధర రూ.5,000 నుంచి రూ.20,000 వరకు ఉంటున్నాయి. అయితే ఏపీలో వీటి ధర రూ.లక్షల్లో ఉంటుంది. పందెం కోళ్లను పెంచే ముందు అవి ఏ జాతికి చెందినవో చూస్తారు. పందెంల కోసం కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, మైల, పూల, పింగళి, నల్లబోర, ఎర్రపోడ, ముంగిస, అబ్రాసు, గేరువ  తదితర జాతులను ఎంచుకుంటారు. వీటిని ప్రత్యేక పద్ధతిలో పెంచుతారు. మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేయిస్తారు. ఇక పందెం కట్టే ముందు కుక్కుట శాస్త్రం చూసి మరి బరిలోకి దింపుతారు.


వేలల్లో పందేలు

ఒక్కో కోడిపై రూ.వెయ్యి నుంచి రూ.50 వేల వరకు పందేలు కాశారు. ఇలా రోజూ రూ.లక్షలు చేతులు మారాయని తెలుస్తోంది. ముందు అనుకున్న మాట ప్రకారం గెలుపొందిన వారు నాలుగో వంతు డబ్బు పందెం నిర్వాహకులకు ఇవ్వాలి(ఉదాహరణకు లక్షల రూపాయలు పందెం గెలుపొందితే అందులో నాలుగో వంతు అంటే రూ.25 వేలు నిర్వాహకులకు ఇవ్వాలి). ఇదే గాక పోటీలో పాల్గొనే ప్రతీ కోడి యాజమాని నుంచి కూడా కోడికి ఇంత అంటూ డబ్బులు వసులు చేశారని సమాచారం. నాల్గో వంతు సొమ్ము రూపేణా లక్షల రూపాయలు మూడు రోజుల పాటు నిర్వాహకుల జేబుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ఏటా సంక్రాంతికి కొన్ని రోజులు అటు ఇటు సాసనూలు గ్రామంతో పాటు, షేక్‌పల్లి, పల్లెపాడు, వావిలాల తదితర గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది సాసనూలులో భారీ ఎత్తున జరిగాయని, అందుకు ఆ మండల నాయకుడు చొరవ చూపారని తెలుస్తుంది. ప్రత్యేకంగా కోళ్ల పందేలు ఆడించేందుకు పందెంరాయుళ్లను పిలిపించారని, వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మందికిపైగా పందెంరాయుళ్లు, 250 కోళ్లు వచ్చాయని, పందేలను చూసేందుకు సుమారు 3,000ల మందికిపైగా హాజరయ్యారని సమాచారం. మూడు రోజుల పాటు జరిగిన ఈ పందేల గురించి ఆలస్యంగా తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 40 మందితో దాడులు నిర్వహించగా, సాసనూలు వద్ద సుమారు 180 మంది, పర్ధిపురంలో పది మంది పరారైనట్లు తెలిసింది. 


చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. ఈ విషయమై పలుమార్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సాసనూలు శివారులో కోడిపందెంలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం దాడులు నిర్వహించాం. దాడుల్లో 98 బైక్‌లు, 17 సెల్‌ఫోన్లు, రూ.87,000 నగదుతో స్వాధీనం చేసుకోవడంతో పాటు 20 మందిని అరెస్టు చేశాం. ఇందులో ఓ ముఖ్య నిర్వాహకుడికి చెందిన సెల్‌ ఫోన్‌ కూడా లభించింది. 

- సీఐ శివశంకర్‌గౌడు, శాంతినగర్‌ 





Updated Date - 2022-01-17T04:55:36+05:30 IST