బయ్యారంలో పాముకాటుతో చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-11-26T05:49:12+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి పాము కాటుతో మృతి చెందింది.

బయ్యారంలో పాముకాటుతో చిన్నారి మృతి

గజ్వేల్‌, నవంబరు 25: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారి పాము కాటుతో మృతి చెందింది. ఈ ఘటన గజ్వేల్‌ మండలంలోని బయ్యారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కామల్ల రాజు-సంతోషలకు చెందిన కుమార్తె కామల్ల నిత్య(3) గురువారం ఉదయం 10.30గంటలకు అంన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. కేంద్రంలో మొత్తం 18 మంది చిన్నారులుండగా, అందరితో నిత్య కూర్చుంది. ఈ క్రమంలో కాలికి నొప్పిగా ఉందని తెలపడంతో అంగన్‌వాడీ హెల్పర్‌ గాయానికి పసుపుతో ప్రథమ చికిత్స చేసి, నిద్ర వస్తుందనడంతో పడుకోబెట్టింది. 12.30 గంటలకు మధ్యాహ్నభోజనం కోసం నిత్యను అంగన్వాడీ హెల్పర్‌ నిద్ర లేపగా తర్వాత తింటాననడంతో మిగతా పిల్లలకు తినిపించింది. అనంతరం ఒంటిగంట అయినా పాప నిద్ర లేవకపోవడంతో అంగన్‌వాడీ టీచర్‌ పాప తల్లి సంతోషకు ఫోన్‌ చేసింది. వెంటనే కేంద్రానికి వచ్చిన తల్లి నిత్యను తీసుకుని వెళ్లి, తన కుటుంబసభ్యులతో కలసి గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే నిత్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. నిత్య కాలికి గాయం ఉండడంతో పాముకాటు వేసినట్లుగా వైద్యులు గుర్తించారు. కాగా చిన్నారి నిత్య మృతితో బయ్యారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-11-26T05:49:12+05:30 IST