3 వేల దిగువకు మరణాలు

ABN , First Publish Date - 2021-06-02T09:03:10+05:30 IST

కేసులు తగ్గుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నుంచి బయటపడుతున్న పరిస్థితుల్లో.. మరో సానుకూల పరిణామం..! దేశంలో గత 35 రోజుల్లో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 26 తర్వాత అత్యల్పంగా ఆదివారం వైర్‌సతో 2,795 మంది మృతిచెందారు.

3 వేల దిగువకు మరణాలు

కొత్తగా 1.27 లక్షల కేసులు.. 2,795 మంది మృతి..

వైరస్‌ స్వరూపం మారితేనే పిల్లలకు ముప్పు


 న్యూఢిల్లీ, జూన్‌ 1: కేసులు తగ్గుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి నుంచి బయటపడుతున్న పరిస్థితుల్లో.. మరో సానుకూల పరిణామం..! దేశంలో గత 35 రోజుల్లో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 26 తర్వాత అత్యల్పంగా ఆదివారం వైర్‌సతో 2,795 మంది మృతిచెందారు. మహారాష్ట్ర (500)లో రోజువారీ మృతుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం తమిళనాడు (478), కర్ణాటక (411), కేరళ (174), బెంగాల్‌ (131)లో మాత్రమే అధికంగా నమోదవుతున్నాయి. యూపీలో (151)లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఢిల్లీలో వందలోపునకు వచ్చాయి. కాగా, దేశంలో కొత్తగా 1,27,510 మంది కరోనా నిర్ధారణ అయింది. 54 రోజుల్లో ఇవి అత్యల్పం.  రోజువారీ పాజిటివ్‌ రేటు 6.62కు, వారపు పాజిటివ్‌ రేటు 8.64కు పరిమితమయ్యాయి. 


నెలలో 38 శాతం యాక్టివ్‌లు తగ్గుదల

గత నెల రోజుల్లో దేశంలో యాక్టివ్‌ కేసులు 38 శాతంపైగా తగ్గాయి. యూపీ, ఢిల్లీల్లో 85 శాతం తగ్గాయి. అయితే, ఈ వ్యవధిలో తమిళనాడు, అసోం, ఒడిశా, ఏపీలో మాత్రం వైరస్‌ ఉధృతి నెలకొంది. కాగా, కర్ణాటకలో కేసులు 20 వేల దిగువకు వచ్చాయి. కొత్తగా అక్కడ 16,600 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఢిల్లీలో 623 కేసులు రాగా.. పాజిటివ్‌ రేటు మరింత తగ్గి 0.88కు పరిమితమైంది. గత రెండు నెలల్లో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధానిలో సోమవారం ఆస్పత్రుల్లో చేరికలు 200 లోపునే ఉన్నాయి. ఆస్పత్రుల్లో 182 మంది చేరగా.. 333 మంది డిశ్చార్జి అయ్యారు.


అలాగైతేనే పిల్లలకు ముప్పు

 కరోనా స్వరూపం మారితే పిల్లలపై దాని ప్రభావం పెరగొచ్చని.. 2 నుంచి 3 శాతం మంది ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉందని నీతీ ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అన్నారు. అయితే, ఇప్పవటివరకు జరిగిన మార్పులు పిల్లలపై ప్రభావం చూపేంతగా లేవని పేర్కొన్నారు. ఏదేమైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిపై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ‘‘పిల్లలకు వైరస్‌ సోకినా లక్షణాలు కనిపించవు. లేదా చాలా స్వల్పంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్‌ తీవ్ర రూపం దాల్చదు’’ అని పాల్‌ పేర్కొన్నారు.


బ్లాక్‌ ఫంగస్‌ బారిన కర్ణాటక పిల్లలు

కర్ణాటకలో ఇద్దరు పిల్లలు బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు. బళ్లారి జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక, చిత్రదుర్గ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఫంగస్‌ నిర్ధారణ అయింది.  వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-06-02T09:03:10+05:30 IST