లద్దాఖ్‌ సమీపంలో చైనా బాంబర్‌ ప్రయోగాలు!

ABN , First Publish Date - 2021-06-15T09:27:01+05:30 IST

తూర్పు లద్దాఖ్‌కు అతి సమీపంలోని హోతన్‌ వాయుస్థావరంలో డ్రాగన్‌ తన షియాన్‌ హెచ్‌-20 స్టెల్త్‌ బాంబర్‌ విమానాల తుది దశ ప్రయోగాల్ని నిర్వహిస్తోంది. వాస్తవంగా 2025 కల్లా ఈ బాంబర్లను వినియోగంలోకి

లద్దాఖ్‌ సమీపంలో చైనా బాంబర్‌ ప్రయోగాలు!

హోతన్‌ స్థావరంలో షియాన్‌ హెచ్‌-20..

తుది దశ ప్రయోగాల నిర్వహణ


లెహ్‌, జూన్‌ 14: తూర్పు లద్దాఖ్‌కు అతి సమీపంలోని హోతన్‌ వాయుస్థావరంలో డ్రాగన్‌ తన షియాన్‌ హెచ్‌-20 స్టెల్త్‌ బాంబర్‌ విమానాల తుది దశ ప్రయోగాల్ని నిర్వహిస్తోంది. వాస్తవంగా 2025 కల్లా ఈ బాంబర్లను వినియోగంలోకి తీసుకురావాలని చైనా భావించినప్పటికీ.. భారత్‌తో పాటు పలు దేశాలతో నెలకొన్న వివాదాల దృష్ట్యా వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న మొదలైన బాంబర్‌ విమానాల తుది దశ ప్రయోగాలు 22 వరకూ జరగనున్నాయి. ఆ రోజుకు చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) ఏర్పడి వందేళ్లు పూర్తి కానుండటం గమనార్హం. రఫేల్‌ యుద్ధవిమానాలతో భారత్‌ సమకూర్చుకున్న బలానికి ఈ విమానాలతో అడ్డుకట్ట వేయాలనేది చైనా వ్యూహం కావొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శత్రుదేశాల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగల సామర్థ్యాన్ని స్టెల్త్‌గా పేర్కొంటారు.


దీంతో పాటు సుదీర్ఘ సమయం పాటు ప్రయాణించడం, భారీగా పేలోడ్‌లను తీసుకెళ్లగలగడం వంటి సామర్థ్యాలన్నీ హెచ్‌-20లో ఉన్నాయి. ఈ బాంబర్లకు ‘బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ (బీవీఆర్‌)’ కనీసం 3వేల కిలోమీటర్లు ఉండొచ్చని నిపుణుల అంచనా. అమెరికా మాత్రం 5281 కిలోమీటర్ల వరకూ బీవీఆర్‌ పరిధి, 10 టన్నుల పేలోడ్‌ సామర్థ్యం వీటికి ఉండొచ్చని అంచనా వే స్తోంది. బీవీఆర్‌ సామర్థ్యం ఉన్న విమానాలు, తమ పరిధిలో ఉన్న ఏ లక్ష్యాన్నైనా.. సుదూర ప్రాంతాల నుంచే ఛేదించవచ్చు. అమెరికా అంచనాయే నిజమైతే.. లద్దాఖ్‌, బలోచిస్థాన్‌, అప్ఘానిస్థాన్‌ కూడా చైనా బాంబర్ల పరిధిలో ఉంటాయి. ఇక.. రఫేల్‌లో ఉన్న పలు ప్రత్యేక ఫీచర్లకు ఈ విమానాలు దొరకవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లో భారత్‌ రఫేల్‌ విమానాలను మోహరించగా.. లద్దాఖ్‌కు అతి సమీపంలోనే హెచ్‌-20లను చైనా మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2010లో ఫ్రాన్స్‌తో 126 రఫేల్‌ల గురించి భారత్‌ చర్చలు మొదలుపెట్టిన సమయంలోనే చైనా కూడా హెచ్‌-20 బాంబర్ల తయారీపై దృష్టి పెట్టింది. కేవలం 11 ఏళ్లలోనే తమ లక్ష్యాన్ని చైనా చేరుకోవడం గమనార్హం.

Updated Date - 2021-06-15T09:27:01+05:30 IST