చిరాగ్‌ పాశ్వాన్‌కు చిన్నాన్న ఝలక్‌

ABN , First Publish Date - 2021-06-15T09:32:37+05:30 IST

లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌కు చిన్నాన్న పశుపతి కుమార్‌ పరాస్‌ ఝలక్‌ ఇచ్చారు. పార్టీలో చిరాగ్‌ను ఒంటరిని చేసేశారు. పరాస్‌ నేతృత్వంలో పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు చిరాగ్‌పై

చిరాగ్‌ పాశ్వాన్‌కు చిన్నాన్న ఝలక్‌

పరాస్‌ నేతృత్వంలో ఎల్‌జేపీ ఎంపీల తిరుగుబావుటా

లోక్‌సభలో తమ నేతగా చిరాగ్‌ను తొలగించాలని స్పీకర్‌కు లేఖ!

తెరవెనుక బిహార్‌  సీఎం నితీశ్‌ పాత్ర


న్యూఢిల్లీ, పట్నా, జూన్‌ 14: లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌కు చిన్నాన్న పశుపతి కుమార్‌ పరాస్‌ ఝలక్‌ ఇచ్చారు. పార్టీలో చిరాగ్‌ను ఒంటరిని చేసేశారు. పరాస్‌ నేతృత్వంలో పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు చిరాగ్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని వారంతా ఆదివారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ అందించారు. సభలో తమ నేతగా చిరాగ్‌ను తొలగించాలని, పరా్‌సను కొత్త నేతగా గుర్తించాలని కోరారు. ఇందుకు స్పీకర్‌ అంగీకరించారు. పార్టీకి ఉన్న మొత్తం ఆరుగురు లోక్‌సభ సభ్యుల్లో చిరాగ్‌ ఒకరు. రాత్రికి రా త్రి జరిగిన ఈ తిరుగుబాటుతో షాక్‌కు గురైన చిరాగ్‌ చర్చలు జరిపేందుకు సోమవారం చిన్నాన్న పరాస్‌ ఇంటికి వెళ్లారు. అయితే, చిరాగ్‌ వచ్చాడని తెలిసి కూ డా ఆయనను ఆహ్వానించేందుకు పరాస్‌ ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో చిరాగ్‌ కారులోనే చాలాసేపు ఎదురుచూసి, వెనక్కి వెళ్లిపోయినట్టు సమాచారం. చిరాగ్‌ తండ్రి దివంగత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు సొంత తమ్ముడే పరాస్‌. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ గతేడాది మరణించడంతో, ఆయన ప్రాతినిధ్యం వహించిన బిహార్‌లోని హాజీపూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పరాస్‌ ఎన్నికయ్యారు. తాజా పరిణామాల వెనుక బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ హస్తం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.


ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ ఎల్‌జేపీ గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేకంగా పనిచేసింది. అయితే, ఇది పరా్‌సకు నచ్చలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, చిరాగ్‌పై పగ తీర్చుకునేందుకే జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ ఇదంతా చేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. త్వరలో జరుగనున్న కేంద్ర కేబినెట్‌ విస్తరణలో పరా్‌సకు మంత్రి పదవి లభించేలా నితీశ్‌కుమార్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం. తాజా పరిణామాలపై పరాస్‌ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘నేను పార్టీని చీల్చలేదు. పార్టీని కాపాడాను. మా పార్టీలో ఉన్న ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు పార్టీని కాపాడాలని కోరుతున్నారు. చిరాగ్‌ నా అన్న కొడుకు, పార్టీ అధ్యక్షుడు కూడా. ఆయనపై నాకేమీ అభ్యంతరాలు లేవు. నేను ఎన్డీయేతోనే ఉన్నాను. నితీశ్‌ మంచి నాయకుడు, వికాస పురుషుడు’ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్‌ తీసుకున్న నిర్ణయాల పట్ల పార్టీలోని 99ు మంది అసంతృప్తికి గురయ్యారని చెప్పారు. కాగా, తాజా కుట్రలో చిరాగ్‌ మరో చిన్నాన్న రామ్‌ చంద్ర పాశ్వాన్‌ కుమారుడు ప్రిన్స్‌ రాజ్‌ పాత్ర కూడా ఉంది. ప్రిన్స్‌ రాజ్‌ను ఎల్‌జేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చిరాగ్‌ నియమించారు. కాగా, కర్మ ఫలం అనుభవించక తప్పదని ఈ పరిణామాలపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఆ ఐదుగురు ఎంపీలు పార్టీ మారతారనే ప్రచారంపై సింగ్‌ను మీడియా ప్రశ్నించగా, ‘వారంతా ఎన్‌డీయేతోనే ఉన్నామని చెప్పారు. పార్టీ మారినా జేడీయూ, లేదా బీజేపీలోకే’ అన్నారు. కాగా, ఎల్‌జేపీ ఏకైక ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ సింగ్‌ జేడీయూలోకి వెళ్లిపోయిన మూడు నెలలకే తాజా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.




కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ : జేడీయూ నేత సింగ్‌

బిహార్‌లో కాంగ్రెస్‌కు ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది పార్టీ మారనున్నట్టు వస్తున్న వార్తలపై జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా, ‘కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-06-15T09:32:37+05:30 IST