సిటీ బస్సులు స్టార్ట్‌

ABN , First Publish Date - 2020-09-26T09:36:25+05:30 IST

బస్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కోఠి, సికింద్రాబాద్‌, అఫ్జల్‌గంజ్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన

సిటీ బస్సులు స్టార్ట్‌

తొలి రోజున రోడ్డెక్కిన 731 బస్సులు 

బస్సుల్లో శానిటైజేషన్‌... 

డ్రైవర్‌, కండక్టర్‌లకు వ్యక్తిగతంగా శానిటైజర్‌ బాటిళ్లు

మాస్క్‌ ఉంటేనే బస్సుల్లోకి అనుమతి


ఆరు నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పరిమిత సంఖ్యలో పరుగులు పెట్టాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్‌డౌన్‌తో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం సిటీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో కొవిడ్‌ - 19 నిబంధనలను పాటిస్తూ 25 శాతం బస్సులను శుక్రవారం ప్రారంభించారు. కండక్టర్‌, డ్రైవర్‌లకు వ్యక్తిగతగా ఒక్కొక్కటి చొప్పున శానిటైజర్‌ బాటిల్స్‌ ఇచ్చారు. కండక్టర్‌ ప్రయాణికుల చేతులపై శానిటైజర్‌ స్ర్పే కొడుతున్నారు. మాస్కు ఉంటేనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి) : బస్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కోఠి, సికింద్రాబాద్‌, అఫ్జల్‌గంజ్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన బస్టాప్‌లలో బస్సులను శానిటైజ్‌ చేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మొదటి  రోజు వివిధ డిపోల నుంచి 731 బస్సులు నగరంలో రాకపోకలు సాగించాయి. కరోనాకు ముందు రోజూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 3,200 సిటీ బస్సులు వివిధ రూట్లలో తిరిగేవి.  దశల వారీగా ఆయా  రూట్లలో  బస్సులను పెంచుతూ నడపాలని అధికారులు నిర్ణయించారు.


39 రూట్లలో 731 బస్సులు...

కేవలం రద్దీ మార్గాలు, ప్రయాణికుల అవసరాలను తీర్చే మార్గాల్లోనే మొదటి రోజు బస్సులను నడిపారు. పటాన్‌చెరువు - హయత్‌నగర్‌ మార్గంలో 40 బస్సులు, జేబీఎస్‌ - ఇబ్రహీంపట్నం మార్గంలో 40, ఈసీఐఎల్‌ - అఫ్జల్‌గంజ్‌ 30, పటాన్‌చెరువు-సికింద్రాబాద్‌ 30, ఉప్పల్‌ - కొండాపూర్‌ 25, కోఠి - గండిమైసమ్మ 40, దిల్‌సుఖ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ 40, ఉప్పల్‌ - మెహిదీపట్నం 40, సికింద్రాబాద్‌ - అఫ్జల్‌గంజ్‌ మార్గాల్లో 20 చొప్పున ఇతర రూట్లలో 15, 10, 6 బస్సుల చొప్పున నడిపామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కొన్ని రద్దీ రూట్లలో ప్రతి 4 నిమిషాలకో బస్సు ఉండగా, మరికొన్ని రూట్లలో 5,8,10 నిమిషాల వ్యవఽధికో బస్సు నిర్దేశిత ప్రాంతాల నుంచి బయలుదేరుతుంది.


నేటి నుంచి పనిచేసే బస్‌ పాస్‌ కౌంటర్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల సౌకర్యార్థం శనివారం నుంచి నగరంలో 15 బస్‌ పాస్‌ కౌంటర్లను తెరవనున్నామని ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కౌంటర్ల నుంచి నెలవారి పాస్‌లు, రోజువారి పాస్‌లను పొందవచ్చని వివరించారు. రేతిఫైల్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, సీబీఎస్‌ టెర్మినల్‌, పటాన్‌చెరు, ఇబ్రహీంపట్నం, కేపీహెచ్‌బీ, షాపూర్‌నగర్‌, మేడ్చల్‌, శంషాబాద్‌, అఫ్జల్‌గంజ్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ కౌంటర్లు నేటి నుంచి పనిచేస్తాయన్నారు.

Updated Date - 2020-09-26T09:36:25+05:30 IST