పక్కా ప్రణాళికతో సివిల్స్‌ సాధ్యమే

ABN , First Publish Date - 2020-08-05T10:34:07+05:30 IST

‘సివిల్స్‌ని ఎందుకు ఎంచుకున్నామనే దానిపై స్పష్టమైన అవగాహన.... ఆప్షన్‌ ఎంపికలో ..

పక్కా ప్రణాళికతో సివిల్స్‌ సాధ్యమే

‘ఆంధ్రజ్యోతి’తో సివిల్స్‌ 320వ ర్యాంకర్‌ కూనిబిల్లి ధీరజ్‌ 


విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ‘సివిల్స్‌ని ఎందుకు ఎంచుకున్నామనే దానిపై స్పష్టమైన అవగాహన.... ఆప్షన్‌ ఎంపికలో నేర్పరితనం, లక్ష్యం సాధించేందుకు అవసరమైన పక్కా ప్రణాళిక రచించుకుని అమలు చేయగలిగితే విజయం తథ్యం’ అని సివిల్స్‌లో 320వ ర్యాంకు సాధించిన కూనిబిల్లి ధీరజ్‌ అన్నారు. తాజాగా వెల్లడైన సివిల్స్‌ ఫైనల్‌ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించిన ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. సివిల్స్‌ కోసం సన్నద్ధమైన తీరు, విధానం, ఆశావహులు ఎలా  ప్రిపేర్‌ కావాలి వంటి పలు అంశాల గురించి వివరించారు. ఆయా విషయాలు ఆయన మాటల్లోనే...


ప్రజలకు ప్రత్యక్ష సేవ చేయడానికే సివిల్స్‌పై ఆసక్తి 

నేను మద్రాస్‌ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశాను. నాన్నగారి సూచన మేరకు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివితే బాగా సెటిల్‌ కావొచ్చు. వచ్చే ఆదాయంతో ప్రజలకు పరోక్షంగా సేవ చేయవచ్చు. కానీ ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడంతోపాటు ప్రజల సంక్షేమం, సమాజాభివృద్ధికి మన ఆలోచనలను జోడించాలంటే సివిల్స్‌ సర్వీస్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఉన్నత చదువు అవకాశాలు, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్‌ సాధనపై దృష్టి సారించాను.


కోచింగ్‌ సెంటర్ల కంటే ఇంట్లో సాధనే మెరుగు

ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి నగరాల్లో కోచింగ్‌ సెంటర్‌లకు వెళ్లి ప్రిపేర్‌ కావడం కంటే ఇంట్లో ఉంటూ ప్రిపేర్‌ కావడం మేలు. కావాల్సిన సదుపాయాలన్నీ తల్లిదండ్రులు సమకూర్చుతారు. వేరే ఆలోచనలు దరిచేరవు కాబట్టి చదివింది ఒంటబడుతుంది. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే ఆగిపోయినప్పటికీ, రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించాను. నా ర్యాంక్‌కు ఐఏఎస్‌ రావడం ఖాయమనుకుంటున్నా!


సివిల్స్‌ ఎంపికపై స్పష్టత ఉండాలి

ఎవరైనా సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధం కావాలనుకుంటే... ఎందుకు ఎంపిక చేసుకుంట న్నామనేదానిపై స్పష్టమైన సమాధానం ఉండాలి. ఎవరో చెప్పారనో, ఎవరో సాధించారనో సివిల్స్‌ని లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదు. లక్ష్యం మనస్సులోకి చేరగానే ఆప్షన్‌ ఎంపిక అత్యంత కీలకం. మనకు బాగా ఇష్టమైన, చవివే కొద్దీ ఇంకా చదవాలనిపించే సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి. సిలబస్‌తోపాటు వివిధ సబ్జెక్టుల నిపుణులు, సివిల్స్‌ విజేతల సలహాలు, సూచనలు, ఇతర సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి దానిని ఫాలో అయితే అత్యుత్తమ ఫలితం తథ్యం. 


పక్కా ప్రణాళికతో సాధన కొనసాగించాలి

సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకని ఆప్షనల్‌ ఎంపికపై స్పష్టత వచ్చిన తర్వాత ప్రిపరేషన్‌కి పక్కాగా ప్రణాళిక రూపొందించుకోవాలి. జనరల్‌ స్టడీస్‌ కోసం స్టాండర్డ్‌ పుస్తకాలను ఫాలో అవ్వాలి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం మంత్లీ మ్యాగ్‌జైన్‌లను ఉపయోగించుకోవాలి. పరీక్షలకు ఉన్న వ్యవ ధిని బట్టి నాలుగు నెలలు, నెలవారీ, వారం, రోజువారీ ప్రణాళికలు తయారుచేసుకుని వాటిని తు.చ. తప్పకుండా అమలుచేయాలి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు సన్నద్ధమైనపుడు వీలైనన్ని టెక్ట్స్‌ సిరీస్‌లు పూర్తి చేయాలి. దీనివల్ల పరీక్షలను అటెంప్ట్‌ చేయడం, టైమింగ్‌, సిలబస్‌ నుంచి వచ్చే ప్రశ్నలపై పట్టు దొరుకుతుంది.


ఇంగ్లిష్‌పై కనీస పట్టు ఉంటే చాలు

చాలామంది గ్రామీణ వాతావరణం, తెలుగు మీడియం బ్యాంక్‌ గ్రౌండ్‌ అయితే సివిల్స్‌కి ఎంపిక కాలేమనే భావనలో ఉంటారు. కానీ ఇంగ్లిష్‌పై కనీస పట్టు ఉండి ఇంటర్నెట్‌లో వివిధ అంశాలను శోధించగలిగే సామర్థ్యం ఉంటే సివిల్స్‌ కొట్టడం సాధ్యమే. 


రోజుకి ఏడెనిమిది గంటలు...

సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకోగానే అప్పటికే హైదరాబాద్‌లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చేశాను. లక్ష్య సాధన కోసం ప్రణాళికలు తయారు చేసుకుని రోజుకి ఏడెనిమిది గంటలు నిబద్ధతతో చదివేవాడిని. నాన్న పోలీస్‌ అధికారి కావడంతో ఉద్యోగంలో బిజీగా ఉంటే.. అమ్మే నాకు కావాల్సిన సదుపాయాలు కల్పించేవారు. సివిల్స్‌లో విజయం సాధించాలంటే నిద్రాహారాలు మానేసి గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టాలనే వాదనలో వాస్తవం లేదు.

Updated Date - 2020-08-05T10:34:07+05:30 IST