దసరా ఉత్సవాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-10-17T05:15:01+05:30 IST

బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి దసరా ఉత్స వాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

దసరా ఉత్సవాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణ
రవీందర్‌ను పరామర్శిస్తున్న పొన్నం ప్రభాకర్‌

బోయినపల్లి, అక్టోబరు 16: బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి దసరా ఉత్స వాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  ఎస్సై అభిలాష్‌ వివరాల ప్రకారం.. జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూస రవీందర్‌ తోపాటు అతడి అనుచరులు, టీఆర్‌ఎస్‌ నాయకులు అనుముల భాస్కర్‌, వైస్‌ ఎంపీపీ కొనకటి నాగయ్య అనుచరులు గ్రామంలో దసరా ఉత్సవాలకు హాజర య్యారు. కొద్ది సేపటికి ఇరు పార్టీల నాయకులు ఒకరి నొకరు దూషించుకొని దాడులు చేసుకున్నారు.  దీంతో స్థానికంగా ఉన్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేశారు.  దీంతో ఇరు వర్గాలు ఘటన స్థలం నుంచి వెళ్లిపోయాయి. గాయపడిన కూస రవీందర్‌ను కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం కూస రవీందర్‌ను ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, నాయకులు మేడిపల్లి సత్యం, కాంగ్రెస్‌ కార్యకర్తలు పరామర్శించారు. 

 ఇరు వర్గాలపై కేసు 

నీలోజుపల్లి దసరా ఉత్సవాల్లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూస రవీందర్‌ ఫిర్యాదుతో అనుముల భాస్కర్‌, బూర బాలకిషన్‌. కొనకటి నాగయ్య,  ఎర్రం నాగరాజు, గూడ మధుకర్‌, కదిరె రవీందర్‌, అనుముల శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  మరో వర్గానికి చెందిన పెంటాల రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కూస రవీందర్‌, అనుముల మహేందర్‌, కదిరె శ్రీకాంత్‌, కూస అంజయ్య, అవుల నాగరాజుపై కేసు నమోదు చేశారు. కాగా గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. డీఎస్పీ చంద్రకాంత్‌, రూరల్‌ సీఐ బన్సీలాల్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-10-17T05:15:01+05:30 IST