స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు మూడంచెల విధానం

ABN , First Publish Date - 2021-06-13T06:53:03+05:30 IST

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం నూతన పారిశుధ్య విధానం పేరుతో ఓ కార్యాచరణకు రంగం సిద్ధంచేసింది.

స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు మూడంచెల విధానం

కొత్త పారిశుధ్య విధానం అమలుకు రంగం సిద్ధం

మండపేట, జూన్‌ 12 : స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం నూతన పారిశుధ్య విధానం పేరుతో ఓ కార్యాచరణకు రంగం సిద్ధంచేసింది. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌డబ్ల్యుఎం) రూల్స్‌ 2016 క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా అన్ని పురపాలకసంఘాల్లో మూడు రకాల చెత్తను ప్రజల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దీన్ని వచ్చే నెల జూలై 8న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంచించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఇంటింటా మూడు చెత్త  డబ్బాల విధానంతోపాటు గార్బేజ్‌ ట్రాన్సఫర్‌ స్టేషన్లను నిర్మిస్తారు. అన్ని పురపాలక సంఘాల్లో తాజాగా చెత్తపై భారీగా పన్ను వేసిన  ప్రభుత్వం ఆయా పురపాలక సంఘాల్లో నూతన పారిశుధ్య విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. మున్సిపాల్టీల్లో వచ్చే నెల 8 నుంచిప్రారంభించనున్న క్లాప్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే చెత్త నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. తడి, పొడి చెత్తతోపాటు హానికర చెత్తను కూడా పురపాలక సంఘాలు సేకరించే విధానంపై కరపత్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక నుంచి ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను, హానికర చెత్తను విడివిడిగా వివిధ రంగు డబ్బాల్లో వేరు చేసి పురపాలక సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. ఈమేరకు సచివాలయ ఉద్యోగులు, వార్డు వలంటీర్ల ద్వారా తమ వార్డుల్లో ఇంటింటా ప్రజలకు ఆవగాహన కల్పించనున్నారు.

తడి చెత్త రకాలు : మిగిలిన అన్నం కూరలు, మాంసం చేపలు కూరగాయల తుక్కు, కొబ్బరి బొండాలు, వెంట్రుకలు, పనికిరాని చీపుర్లు, కాచిన టీ , కాపీ పొడులు

కుళ్లిపోని స్వభావం కలవి : చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌, సంచులు పాలిఽథిన్‌, కవర్లు, ప్లాస్టిక్‌ గాజు సీసాలు, పనికిరాని గుడ్డముక్కలు, చెప్పులు, బ్యాగులు, తీగలు, మంచినీటి సీసాలు, చాక్‌లెట్‌, పాన్‌పరాగ్‌వ్యాపర్లు, సబ్బు కవర్లు, బ్యాటరీలు

కాలుష్యం కలిగించేవి : డైపర్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, మరుగుదొడ్లు శుభ్రం చేయగా మిగిలిన వ్యర్థాలు, దోమల నివారణకు వాడగామిగిలినవి, పెయింట్‌, గ్రీజ్‌ డబ్బాలు, ఆటోమొబైల్‌ పరికరాలు,   లిథియం, సీసం కలిగిన బ్యాటరీలు, పురుగుల మందులు, పాదరసం,కాలం తీరిన మందులు, ఈ వేస్టు, టెలివిజన్‌, సెల్‌ఫోన్‌ వ్యర్థాలు.

ఇదిలా ఉండగా మండపేట మున్సిపాల్టీలోని వివిధ వార్డుల్లో పది రోజుల నుంచి ప్రజలకు మూడు రకాల చెత్తలను వేరు చేసే విధానం అమలుపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ముత్యాల సత్తిరాజు నేతృత్వంలో క్లాప్‌ప్రోగ్రాం జరుగుతోంది. ఆయా సచివాలయాల పరిధిలో అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ అవగాహన కార్యక్రమం జరుగుతుండగా, అందులో డస్ట్‌ బిన్‌ల నిర్వహణపై మహిళలకు చైతన్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందించిన మూడు డస్ట్‌బిన్‌లను ఇంటింటా పంపిణీచేయడంతోపాటు ప్రజలకు కరపత్రాలను పంచుతున్నారు.



Updated Date - 2021-06-13T06:53:03+05:30 IST