Advertisement
Advertisement
Abn logo
Advertisement

మన్యంలో పర్యాటక కేంద్రాల మూసివేత


అరకులోయ, డిసెంబరు 3: జవాద్‌ తుఫాన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అరకు లోయలో పర్యాటక కేంద్రాలైన ట్రైబుల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ను మూసివేశారు. సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌, అల్లూరి సీతారామరాజు పబ్లిక్‌ స్కూళ్లను మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. అలాగే వరి కోతల పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు. తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని  వాతావరణ శాఖ హెచ్చరికలతో చేతికందిన పంట నీటిపాలవుతుందే మోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

అనంతగిరి: జవాద్‌ తుఫాన్‌ నేపథ్యంలో శుక్రవారం మన్యంలోకి పర్యాటకుల వాహనాలను అనుమతించలేదు. తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలతో చిలకలగెడ్డ ఫారెస్ట్‌ చెక్‌పోస్టు వద్ద మన్యంలోకి ప్రవేశించే వాహనదారులను వీఆర్‌వో శంకరరావు, మహిళా పోలీసు ఆపి వెనక్కి పంపించారు. అయినప్పటికీ కొంతమంది హెచ్చరికలు లెక్కచేయకుండా పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. అయితే బొర్రాగుహలుతోపాటు కటిక, తాడిగుడ జలపాతాల వద్ద సైతం సందర్శకులను అనుమతించలేదు. మూడురోజుల పాటు మన్యంలోకి పర్యాటకులు రావద్దని తహసీల్దార్‌ ప్రసాద్‌ సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. 

పాడేరురూరల్‌/జి.మాడుగుల: జవాద్‌ తుఫాన్‌ ప్రభావంతో పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండ, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాలను మూడు రోజులు మూసివేస్తున్నామని ఇకో టూరిజం నిర్వాహకులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పర్యాటకుల సందర్శనను శుక్రవారం నుంచి నిలుపు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తించి తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు రావద్దని నిర్వాహకులు కోరారు.

 

Advertisement
Advertisement