ముగ్గురికీ క్లాస్‌

ABN , First Publish Date - 2020-11-13T06:15:03+05:30 IST

విశాఖపట్నంలో విజయసాయిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యేల ఎదురుదాడి పంచాయితీ సీఎం జగన్‌ వద్దకు చేరింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసి, విశాఖ నుంచే అన్నీ నడపాలని యత్నిస్తున్న సమయంలో అక్కడే పార్టీలో విభేదాలు తలెత్తడాన్ని జగన్‌ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది.

ముగ్గురికీ క్లాస్‌

డీడీఆర్‌సీలో రచ్చపై సీఎం సీరియస్‌

విజయసాయిరెడ్డి, కరణం ధర్మశ్రీ, అమర్‌కు పిలుపు

ఆ రోజు ఏం జరిగిందనే వివరాలు...ముందు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు నుంచి సేకరణ

ఇంటెలిజెన్స్‌ నుంచి కూడా నివేదిక

సమీక్షలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అసహనం

ఏదైనా ఉంటే కలిసి మాట్లాడాలని ధర్మశ్రీకి సూచన

ఇకపై నోరు జారవద్దని అందరికీ హెచ్చరిక

ఎమ్మెల్యేలకు సహకరించాలని అధికారులకు సందేశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో విజయసాయిరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యేల ఎదురుదాడి పంచాయితీ సీఎం జగన్‌ వద్దకు చేరింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసి, విశాఖ నుంచే అన్నీ నడపాలని యత్నిస్తున్న సమయంలో అక్కడే పార్టీలో విభేదాలు తలెత్తడాన్ని జగన్‌ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశంలో అధికారుల ముందు ఒకరినొకరు నిందించుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలిసింది. అసలు ఆ రోజు ఏమి జరిగిందంటూ బుధవారం రాత్రే...జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబుతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్న జగన్‌...ఆ తరువాత జిల్లాలో పరిస్థితిపై ఇంటెలిజెన్స్‌ ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, నగరంలో అడుగు పెట్టగానే ఎండాడలోని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌లో గల ఆయన నివాసానికి జిల్లా ఉన్నతాధికారులు అంతా కట్టగట్టుకొని వెళుతున్నారని, అక్కడే అనేక అంశాలపై ఆయన వారికి మార్గదర్శనం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ నివేదించినట్టు తెలిసింది. ఆయన చెప్పిన పనులు తప్ప జిల్లా అధికారులు ఇంకేమీ చేయడం లేదని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యం, గౌరవం దక్కడం లేదని, వారి మాటలను ఎవరూ లెక్క చేయడం లేదని, దీనిపై ఆయా వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, దీనికి పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో మరింత మంది ఎదురు తిరిగే అవకాశం వుందని సూచించినట్టు సమాచారం. 


అందరికీ తలంటు

ఈ వివాదంపై చర్చించేందుకు ముగ్గురు నేతల (విజయసాయిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌)నూ సీఎం జగన్‌ గురువారం ఉదయం అమరావతికి పిలిపించుకుని సమావేశమయ్యారు. డీడీఆర్‌సీలో ‘ప్రతి భూ ఆక్రమణ వెనుక రాజకీయ నేతలు వున్నారని పదేపదే అనాల్సిన అగత్యం ఏమి వచ్చింది’ అంటూ విజయసాయిరెడ్డిపై జగన్‌ అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అసలు సమీక్ష అంతా భూముల చుట్టూనే తిరగడం ఏమిటి?...జిల్లాలో ఇంకే సమస్యలు లేవా? అని ప్రశ్నించినట్టు సమాచారం. ఏదైనా సమస్య వుంటే తనను సంప్రతించాలని, అందరి ముందు పార్టీ బాధ్యుడిపై ఎదురుదాడి చేయడం సమర్థనీయం కాదని కరణం ధర్మశ్రీని హెచ్చరించినట్టు భోగట్టా. సమస్యలు ఏమైనా వుంటే కలిసి చెప్ప కుండా...ఒకరికి మరొకరు తోడు అన్నట్టు ఆరోపణలు చేస్తే ప్రయోజనం ఏమిటని గుడివాడ అమర్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇకపై ఎవరైనా సరే పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని, జాగ్రత్తగా ఉండాలని ముగ్గురినీ హెచ్చరించినట్టు సన్నిహిత వర్గాల సమాచారం.


అధికారులకు సందేశం

విశాఖలో విజయసాయిరెడ్డి మాట తప్ప ఇంకెవరి మాట అధికారులు వినడం లేదని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ అపప్రథ తొలగిపోయేలా చూడాలని సీఎం జగన్‌...తన పేషీకి సూచనలు చేసినట్టు తెలిసింది. ఇకపై జిల్లా అధికారులు అందరికీ అందుబాటులో వుండాలని, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మాటలకు గౌరవం ఇచ్చి, వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-11-13T06:15:03+05:30 IST