నేడు హాలియాలో సీఎం కేసీఆర్‌ సభ

ABN , First Publish Date - 2021-04-14T06:27:07+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేప థ్యంలో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ బుధవారం హాలియాలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి.

నేడు హాలియాలో సీఎం కేసీఆర్‌ సభ
బహిరంగ సభావేదిక

లక్ష మంది సమీకరణకు ఏర్పాట్లు

కరోనా నిబంధనల అమలు సాధ్యమేనా?


నల్లగొండ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/హాలియా: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేప థ్యంలో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ బుధవారం హాలియాలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం కానుండగా, ఐదు గంటలకు హెలీకాప్టర్‌ ద్వారా సీఎం నాగార్జునసాగర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకుంటారు. సభ ముగిశాక రోడ్డు మార్గంలోనే హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సభా ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ భారీ కటౌట్లు, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభా వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. కాగా, సీఎం బహిరంగసభను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని లక్ష మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 40వేల మందితో సభ జరిగే అవకాశం ఉంది. సరిగ్గా రెండు నెలల క్రితం ఫిబ్రవరి 10న హాలియా శివారులో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించగా, ఉమ్మడి జిల్లా నుంచి లక్షమంది హాజరయ్యారు. ప్రస్తుత సభను 20ఎకరాల్లో ఏర్పాట్లు చేయగా, ఎకరాకు రెండు వేల మంది సామర్థ్యం వేసుకున్నా 40 వేలమందికి తక్కువ కాకుండా సభ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కరోనా నిబంధనల మేరకు బహిరంగ సభాస్థలిలో ఆరు అడుగుల దూరం ఉండేలా సున్నంతో మార్కింగ్‌, ఒకసారి ఐదు వాహనాలకు మించి కాన్వాయ్‌ రాకుండా చూడటం, ప్రతి ఐదు వాహనాల మధ్య 100 మీటర్ల దూరం, సభకు హాజరయ్యేవారంతా మాస్క్‌ ఽధరించాలనే నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్‌లు వేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ పీజే పాటిల్‌ సభ నిర్వాహకులకు స్పష్టం చేశారు. అయితే ఇది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కాగా, సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మంగళవారం పరిశీలించారు.

Updated Date - 2021-04-14T06:27:07+05:30 IST