‘రాజమల’ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తాం : పినరయి విజయన్

ABN , First Publish Date - 2020-08-14T00:28:59+05:30 IST

కేరళలోని రాజమలలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలను

‘రాజమల’ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తాం : పినరయి విజయన్

ఇడుక్కి : కేరళలోని రాజమలలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. దుర్ఘటన జరిగిన పెట్టుముడిలో విజయన్ పర్యటించి, బాధితులను పరామర్శించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 


పెట్టుముడిలో ఈ విషాద సంఘటన జరిగినట్లు సమాచారం అందిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో చిక్కుకున్నవారి కోసం ఇంకా గాలిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాల్లో కొద్ది మంది మాత్రమే సజీవంగా ఉన్నారన్నారు. జీవించి ఉన్న కుటుంబాల్లో పిల్లలు ఉన్నారని, వారి చదువుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే మళ్లీ ఇళ్లను నిర్మించడం కష్టమని చెప్పారు. వేరే చోట కొత్త ఇళ్లు ఇస్తామని తెలిపారు. గతంలో కొండచరియలు విరిగిపడినపుడు కూడా ప్రభుత్వం పునరావాసం కల్పించిందని చెప్పారు. ఇప్పుడు తన ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని తెలిపారు.  టీ ఎస్టేట్ కంపెనీ కూడా బాధితులకు సహాయపడటానికి ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 


ఈ నెల 6న రాత్రి 10.45 గంటలకు ఇడుక్కి జిల్లాలోని మున్నార్ గ్రామ పంచాయతీకి చెందిన రాజమల వార్డులో ఈ దుర్ఘటన జరిగింది. కనన్ దేవన్ హిల్స్ ప్లాంటేషన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసేవారు నివసించే ఇళ్ళపై కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్ళు, మట్టి క్రింద 83 మంది టీ ఎస్టేట్ వర్కర్లు చిక్కుకుపోయారు. వీరిలో 12 మందిని కాపాడగలిగారు. 52 మంది మృతదేహాలు దొరికాయి. 


Updated Date - 2020-08-14T00:28:59+05:30 IST