తీరం..పరాధీనం

ABN , First Publish Date - 2021-08-31T06:33:21+05:30 IST

చీరాల నియోజకవర్గంలో కొందరు సముద్రతీరాన్నీ వదలడం లేదు. తీరం వెంట ఉన్న బంగాళాఖాతానికి చెందిన చెట్లతో కూడిన ప్రాంతం, అసైన్డ్‌, ఫారెస్ట్‌ భూములను ఆక్రమించేస్తున్నారు.

తీరం..పరాధీనం
తీరం వెంట ఓ రిసార్ట్స్‌ నిర్వాహకులు చెట్లు కొట్టివేయడంతో కనిపిస్తున్న సముద్రం

దర్జాగా ప్రభుత్వ, అసైన్డ్‌భూముల కబ్జా

పోటీపడుతున్న ఆక్రమణదారులు

చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం

కనుమరుగవుతున్న రక్షణ చెట్లు

బంగాళాఖాతం ప్రాంతం ఎంతవరకు.. 

కలెక్టర్‌ స్వయంగా దృష్టిసారిస్తేనే సమస్యకు

పరిష్కారం అంటున్న ప్రజలు

వారు పెద్దవారు.. కానీ బుద్ధే చిన్నదైంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్నా.. చేసేవి మాత్రం చిల్లరచేష్టలు. స్థానిక పరిస్థితులను ఆసరా చేసుకుని ఏకంగా ప్రభుత్వ, అసైన్డ్‌భూములను ఆక్రమించేస్తున్నారు. ఇన్‌స్టెంట్‌ ప్రహరీలు నిర్మిస్తున్నారు. కొందరు శ్మశాన స్థలాలనూ వదలటం లేదు. ఇక సముద్రతీరానికి రక్షణగా ఉండే చెట్లను ఇష్టారీతిన నరికేస్తున్నారు. అవి కొందరు తమ విహారకేంద్రాలకు వచ్చేవారికి సముద్రం వ్యూ కనిపించేందుకు చేపడుతున్న చర్యలని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉంది. వీరిలో పాలక, ప్రతిపక్షాలకు చెందినవారు ఉన్నారు. అందులో అధికారపార్టీకి చెందినవారు కాస్తంత ఎక్కువగా దూసుకుపోతున్నారు. వారిలో ఆ పార్టీలోని ఇరువర్గాలకు చెందినవారూ కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. ఒకరికొకరు ముందుగా అవతలి వారిపై చర్యలు తీసుకుంటే కదా మాపై చర్యలు తీసుకునేది అన్న ధీమాతో యథేచ్ఛగా పనులు చేసుకుపోతున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా ధైర్యంగా దందాలకు దిగుతున్నారు. ఇదీ చీరాల నియోజకవర్గంలో కబ్జాదారుల సంగతి. చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.. 

చీరాల, ఆగస్టు 30 : చీరాల నియోజకవర్గంలో కొందరు సముద్రతీరాన్నీ వదలడం లేదు. తీరం వెంట ఉన్న బంగాళాఖాతానికి చెందిన చెట్లతో కూడిన ప్రాంతం, అసైన్డ్‌, ఫారెస్ట్‌ భూములను ఆక్రమించేస్తున్నారు. సముద్రానికి రక్షణగా ఉండాల్సిన చెట్లను కూడా ఎవరి అనుమతి లేకుండా విచ్చలవిడిగా నరికేస్తున్నారు. అందుకు తీరం వెంట రిసార్ట్స్‌ నిర్వాహకుల్లో పలువురు పోటీపడుతున్నారు. ఇటీవల 216 జాతీయరహదారి పక్కన ఓ వ్యక్తి అసైన్డ్‌భూమిని ఆక్రమించి ఇన్‌స్టెంట్‌ ప్రహరీ నిర్మించారు.


తీరం అంతా ఆక్రమణలే

వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం రోడ్డు వెంబడి ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను కొందరు ఆక్రమించుకున్నారు. మరికొందరు కొత్తవారు ఆ పనిలో ఉన్నారు. పలుచోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఈ మొత్తం పరిధిలో 100 ఎకరాల వరకు భూమి ఆక్రమణలకు గురైందని అనధికారిక అంచనా. ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంతో కొత్తవారు కూడా ఆ వైపు వెళుతున్నారు.


కనుమరుగవుతున్న రక్షణ చెట్లు

తీరం వెంట రక్షణ కవచంగా ఉండే భారీ చెట్లను కూడా కొందరు నరికేస్తున్నారు. తమ రిసార్ట్స్‌కు వచ్చేవారికి సముద్రం వ్యూ కనిపించే విధంగా ఉండేందుకు ఈ చర్యలకు ఒడిగడుతున్నారు. దీనిని నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుంటున్నారు. అందుకు ఎవరికి తోచిన కారణాలను వారు అన్వయించుకొంటున్నారు. పైగా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు.


బేఆఫ్‌ బెంగాల్‌, ఫారెస్ట్‌, అసైన్డ్‌, పట్టా...

వాడరేవును నుంచి పొట్టిసుబ్బయ్యపాలెం వరకు రోడ్డుకు ఒకవైపు సముద్రం, మరోవైపు నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉంటాయి. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ రోడ్డుపై ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అలాగే సేదతీరుతుంటారు. సముద్రతీరానికి రోడ్డుకు మధ్య ఉన్న ప్రదేశం బేఆఫ్‌ బెంగాల్‌గా అధికారికంగా ఉంటుంది. ఇదిలాఉంటే రోడ్డుకు రెండోవైపు పలు రిసార్ట్స్‌ నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉంటాయి. వీటిలో ఫారెస్ట్‌, అసైన్డ్‌, పట్టా, సీలింగ్‌ దేనికి సంబంధించిన భూములు ఏవనేది అధికారులకు మాత్రమే తెలుసు. అయితే ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది మధ్య నెలకొన్న సమన్వయలోపం స్వార్థప్రయోజనాలు నేపఽథ్యంలో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అంటున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది మా భూమి కాదంటూ దాటవేస్తున్నారు.


ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు 

విలువైన ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా తగినచర్యలు తీసుకుని, ఆక్రమణలను కట్టడి చేయాలని, ముందస్తు ఆక్రమణలకు క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నేరుగా దృష్టిసారిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. కాగా సముద్రం ఒడ్డున కొంతమేరకు మత్స్యకారులు ఆక్రమణలో ఉన్నదని చీరాల మండల తహసీల్దార్‌ మహ్మద్‌ హుస్సేన్‌ తెలిపారు. మిగతా ప్రాంతంలో ఉన్న ఆక్రమణలు తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.






Updated Date - 2021-08-31T06:33:21+05:30 IST