పందెం కోడి కత్తి దూసింది

ABN , First Publish Date - 2022-01-17T05:27:26+05:30 IST

ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలతో పాటు అన్నిచోట్ల కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహించారు.

పందెం కోడి కత్తి దూసింది
కొవ్వూరు మండలంలోని బరిలో కోడి పందెం

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలతో పాటు అన్నిచోట్ల కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. భోగి రోజు నుంచి కనుమ వరకు వరుసగా మూడు రోజుల పాటు కోడి పందేలు, పేకాట, గుండాట ఇతర జూదం నిరాటంకంగా సాగిం ది. పలుచోట్ల రాత్రి, పగలు తేడా లేకుండా ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో సైతం పందేలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల మూడు రోజులు కూడా జోరుగా పందేలు నిర్వహించారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా. కొవ్వూరు మండలంలో కోడి పందేలు జోరుగా సాగాయి. భోగి రోజు మధ్యాహ్నం నుంచి మూడు రోజులపాటు పశివేదల, పంగిడి, దొమ్మేరు, నందమూరు, ఆరికిరేవుల, కుమారదేవం గ్రామాలలో పందేలు జరిగాయి. రాత్రి వేళ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పందేలు కొనసాగాయి. కొవ్వూరు మండలంలో గుండాటపై శని, ఆదివారాలు ఆంక్షలు విధించడంతో అఽధికార పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేశారు. బుట్టాయగూ డెం మండలంలో కోడిపందేలు జోరుగా సాగాయి. దుద్దుకూరుతోపాటు ఇతర చోట్ల కూడా ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో పందేలు సాగాయి. గుండాట, పేకాట ముమ్మరంగా జరిగాయి. టి.నరసాపురం, బంధంచర్ల, వీరభద్రవరం, తిరుమలదేవీపేట, అప్పలరాజుగూడెం, బండివారిగూడెం, మర్రిగూడెం గ్రా మాల్లో నిర్వహించిన కోడిపందేల్లో మూడు రోజుల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, వేదాంతపురం, బయ్యన్న గూడెం, దిప్పకాయలపాడు, రాజవరం, గవరవరం, తదితర గ్రామాల్లో మూడు రోజుల పాటు పందేలు యథేచ్ఛగా సాగాయి. దేవరపల్లి మండలంలో బందపురం, త్యాజంపూడి, దుమంతునిగూడెం, కృష్ణం పాలెం గ్రామాల్లో కోడిపందేలు, గుండాట జోరుగా సాగాయి. కుక్కునూరు మండలంలో కివ్వాక, చీరవల్లి, వేలేరు, దాచారం ప్రాంతాల్లో బరులను ఏర్పా టు చేశారు. కోడిపందాలతో పాటు లోన బయట, మూడు ముక్కలు, పేకాట వంటి జూద క్రీడలు కూడా భారీ ఎత్తున జరిగాయి. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం, కామయ్యపాలెం, పి.రాజవరం, జీలుగుమిల్లి, రాచన్న గూడెం, ములగలంపల్లిలో కోడి పందేల బరుల వద్ద గుండా మూడు ముక్క లాట నిర్వహించారు. రాచన్నగూడెంలో కోడి పందేల బరి వద్ద తెలంగాణ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. తాటియాకులగూడెంలో జాతీయ రహదారిపై రాత్రి వేళ కోడి పందేల బరి వద్ద విద్యుత్‌ దీపాల వెలుగులో కోడి పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కామయ్యపాలెం, తాటియాకులగూడెం, రాచన్నగూడెం కోడి పందేల బరుల్లో లక్షల రూపాయల నగదు చేతులు మారినట్లు సమాచారం. పోలవరం మం డలంలో కోడిపందేలు, గుండాట, పేకాట, కోసాట ఆదివారం రాత్రి వరకూ కొనసాగాయి. శనివారం నిలిపివేసిన గుండాట ఆదివారం తిరిగి నిర్వహిం చారు. గూటాల శివారులో టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన కోడి పందేలను అధికార పార్టీ నేత పట్టుతో నిలిపివేశారు. నల్లజర్ల మండలంలో కోడి పందేలు గుండాట, పేకాట ఆదివారం వరకు జోరుగా సాగాయి.


జనం జేబులు గుల్ల..


కోడి పందేలు సరదాగా చూసేందుకు వెళ్లినవారి జేబులు సైతం గుల్ల అయ్యాయి. పందేల నిర్వాహకులు బరుల వద్ద సిగరెట్‌, వాటర్‌బాటిల్స్‌ వంటి చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేయడానికి భారీ మొత్తం వసూలు చేశారు. వ్యాపారులు అధిక ధరలతో జనంపై భారం వేశారు. బరుల సమీపంలో ఎక్కడ దుకాణాలు లేకపోవడం, మరోపక్క కోడిపందేల హడావుడిలో ఎంత ధరకైనా కొనుగోలు చేశారు. కోడిపందేల బరుల వద్దకు వెళ్లిన వారి జేబులు పలు మార్గాల్లో ఖాళీ చేసి ఇళ్లకు పంపారు. గుండాట, కోతాట, పేకాట పందేల నిర్వాహకులకు కాసుల పంట పండిం చగా పలువురికి దండిగా మామూళ్లు దక్కడం బహిరంగ రహస్యం..!


గుండాట.. గుండాగినట్టే..


ఖరీదైన, ప్రమాదకరమైన జూదాలలో గుండాట ఒకటి. క్షణాల్లో అనేక మంది జేబు ఖాళీ కావడంతో గుండాగినంత పనైంది. అనేక మంది లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. నిర్వాహకుల గల్లా నింపే గుండాట లో బాధితులు అనేక మంది. కోడిపందేల బరుల వద్ద ప్రతీ చోటా గుండాటనిర్వహించారు. కోడిపందేలకు వచ్చిన వారంతా పందేలతోపాటు గుండాటను కూడా ఆడడంతో నష్టపోయామని చెబుతున్నారు. వీటితోపాటు కోడి పందేల వద్ద లోన బయట, పేకాట స్ధావరాలు కూడా పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇక అక్కడే రహస్యంగా మద్యం విక్రయాలు కూడా సాగడంతో మద్యం తాగి మత్తుతో పందెం కాసి డబ్బు పోగొట్టుకున్నారు.


రూ.లక్షల్లో పందేలు..!


కోడి పందేల్లో ఒక్కో పందెం రూ.2వేల నుంచి రూ.2లక్షలు పైగానే జరిగాయి. బరిలో దిగిన పుంజుల యజమానులతోపాటు బయట నుంచి వేలాది రూపాయల సాగింది. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో కోడి పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా.


కోజా చాలా ఖరీదే.!


కోడి పందేల్లో పోరాడి నేలవాలిన కోడే కోజా.. పందేల కోసం ప్రత్యేకం సిద్ధం చేసిన పుంజు మాసం వంటకం ముక్కనుమ ప్రత్యేక వంటకం. ఈ ఏడాది ఎక్కడా కోజా దొరకలేదు. కనీసం రూ.3వేలు వెచ్చించినా కోజా దొరకని పరిస్థితి. బరుల వద్ద చాలా మంది క్యూకట్టారు.

Updated Date - 2022-01-17T05:27:26+05:30 IST