కొలిక్కిరాని డంపింగ్‌ యార్డు సమస్య

ABN , First Publish Date - 2021-10-22T06:34:12+05:30 IST

మండల కేంద్రంలో డంపింగ్‌ యార్డు సమస్య కొలిక్కి రావడం లేదు. ఎంతో కాలంగా పంచాయతీకి చిక్కుముడిలా మారిన స్థల వివాద పరిష్కారానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు.

కొలిక్కిరాని డంపింగ్‌ యార్డు సమస్య
ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులతో మాట్లాడుతున్న డీపీవో

ప్రజా ప్రతినిధులతో డీపీవో చర్చలు విఫలం

రావికమతంలో చెత్త సమస్య యథాతథం


రావికమతం, అక్టోబరు 21: మండల కేంద్రంలో డంపింగ్‌ యార్డు సమస్య కొలిక్కి రావడం లేదు. ఎంతో కాలంగా పంచాయతీకి చిక్కుముడిలా మారిన స్థల వివాద పరిష్కారానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావడం లేదు. తాజాగా జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు డీపీవో వి.కృష్ణకుమారి గుడివాడ పంచాయతీ పరిధిలోని డంపింగ్‌ యార్డుకు కేటాయించిన  స్థలంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. 

రావికమతంలో డంపింగ్‌ యార్డు లేకపోవడంతో చెత్త సేకరణకు పారిశుధ్య కార్మికులు నిరాకరిస్తున్నారని ఈవోపీఆర్డీ రమణయ్య, పంచాయతీ కార్యదర్శి పాతాళ సత్యారావు డీపీవోకు వివరించారు. దీనిపై ఆమె స్పందిస్తూ గొంప మెట్టపై కేటాయించిన ప్రభుత్వ స్థలంపై అభ్యంతరమేమిటని సర్పంచ్‌లను అడిగారు. వర్షాకాలంలో కొండపై నుంచి వచ్చే నీరు డంపింగ్‌ యార్డులో కలిస్తే చెరువులు కలుషితమవుతాయని, గ్రామాల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సర్పంచ్‌లు వెంకటలక్ష్మి, గోవింద, మాజీ సర్పంచ్‌ రాజు తెలిపారు. యార్డు నీరు కిందకు రాకుండా గోడ నిర్మిస్తామని డీపీవో భరోసా ఇచ్చినా వారు అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు జరుపుదామని డీపీవో వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కనకారావు, సర్వేయర్‌ హరీశ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:34:12+05:30 IST