ఐఎంఏ వైద్యులకు కలెక్టర్‌ నోటీసులు

ABN , First Publish Date - 2020-08-10T09:46:11+05:30 IST

ఐఎంఏ వైద్యులకు కలెక్టర్‌ నోటీసులు

ఐఎంఏ వైద్యులకు కలెక్టర్‌ నోటీసులు

కొవిడ్‌ విధుల్లో చేరండి

ఐఎంఏ వైద్యులకు కలెక్టర్‌ నోటీసులు 


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 9:  కొవిడ్‌ ఆసుపత్రుల్లో పని చేయాలని 188 మంది ఐఎంఏ వైద్యులకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదివారం నోటిసులు జారీ చేశారు. కర్నూలు జీజీహెచ్‌ను స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన తరువాత మొదట్లో కేసులు తక్కువగా వచ్చేవి. ఇటీవల పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరగడంతో ఐఎంఏ వైద్యుల (ప్రైవేట్‌ ప్రాక్టీషనర్లు) సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ నిర్ణయించారు. కర్నూలు జీజీహెచ్‌లో ఇప్పటికే 25 శాతం మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో పనిభారం తగ్గించేందుకు ఐఎంఏ స్పెషలిస్టుల సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ నిర్ణయించారు.


స్పెషలిస్టులు అందరూ కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌కు 48 గంటల్లోగా రిపోర్టు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నెలలో 14 రోజులు విధులు నిర్వహిస్తే మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటారని కలెక్టర్‌ ఉత్తర్వులు పేర్కొన్నారు. నెలకు రూ.1.50 లక్షల వేతనం ఉంటుందని కేఎంసీ ప్రిన్సిపల్‌ డా.పి.చంద్రశేఖర్‌ తెలిపారు. నోటీసులు అందుకున్న వారిలో కర్నూలు నగరంలో 132 మంది, నంద్యాలలో 42 మంది, ఆదోనిలో  14 మంది వైద్య నిపుణులు ఉన్నారు. వీరందరూ 55 ఏళ్ల లోపు వయసు వారు.

 

వ్యతిరేకిస్తున్న వైద్యులు 

కర్నూలు నగరంలో 8 ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్‌ చికిత్సకు అనుమతులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సొంత ఆసుపత్రులను వదలి ఎలా విధుల్లో చేరాలని ఐఎంఏ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నా తాము కూడా కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నామని వారు అంటున్నారు.


కర్నూలు జీజీహెచ్‌లో కేవలం కొవిడ్‌ కేసులను చూస్తున్నందున, నాన్‌ కొవిడ్‌ బాధితులకు బయట వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించాలని ఐఎంఏ వైద్యులను కోరారు. సొంత ఆసుపత్రులు ఉండి, కొవిడ్‌ చికిత్స చేస్తున్న వైద్యులకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2020-08-10T09:46:11+05:30 IST