లోపాలను సవరించి మెరుగైన వైద్య సేవలు

ABN , First Publish Date - 2022-01-21T05:14:57+05:30 IST

చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేలా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు.

లోపాలను సవరించి మెరుగైన వైద్య సేవలు
వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ హరికిరణ్‌
రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 20: చిన్న చిన్న లోపాలు సరి చేసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేలా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌) సమావేశం ప్రభుత్వాసుపత్రిలోని ఎంసీహెచ్‌ బ్లాకులో గురువారం నిర్వహించారు.  సుమారు నాలుగు గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  జిల్లాలో కాకినాడ జీజీహెచ్‌ తర్వాత రెండో అతిపెద్ద ఆసుపత్రిగా ఉన్న రాజమహేద్రవరం ప్రభుత్వాసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ స్థాయికి తీసుకురానుంది. 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థతో ఈనెలాఖరునాటికి అగ్రిమెంట్‌ కాబోతున్నాం అని కలెక్టర్‌ చెప్పారు.  అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు.
థర్డ్‌ వేవ్‌లో జిల్లాలో 2,900 కొవిడ్‌ యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 55 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన 98 శాతం మంది హోం ఐసోలేషన్‌, సీసీసీల్లో పూర్తిగా రికవరీ అవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 60 వేల హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ అవసరమైన వారు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులున్నవారు, 60 ఏళ్లు దాటిన వారు ఆసుపత్రుల్లో చేరవచ్చు. మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లోనే పూర్తిగా రికవరీ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ చెప్పారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వచ్చిన వారికి రోజూ చికెన్‌ పెట్టాలని మెనూలో ఉందన్నారు. అలాగే అవసరాన్ని బట్టి కొవిడ్‌ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.
  జిల్లాలో రెండు ప్రైవేట్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరంలో ల్యాబ్‌లు ఉన్నాయి. ఇక్కడ కొవిడ్‌ పరీక్షలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చేయాలి. అవసరమైతే ల్యాబ్‌ వాళ్లను పిలిచి మాట్లాడుతాం. 104 ద్వారా విస్తృతంగా ప్రచారం చేయిస్తాం. అధికంగా వసూలు చేస్తున్నట్టు 104 కాల్‌సెంటర్‌కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆసుపత్రి లేదా ల్యాబ్‌పై విచారించి చర్యలు తీసుకుంటాం అన్నారు.
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సీటీ స్కాన్‌ పాడైంది. కొత్త సీటీస్కాన్‌ వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో మొత్తం నాలుగు చోట్ల సీటీ స్కాన్‌లు అవసరం ఉంది. వీటిని దాతలు లేదా సీఎస్‌ఆర్‌లో కొనాలనే అంశం ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ దృష్టిలో ఉంది.  మెడికల్‌ ఆఫీసర్స్‌ కొరతను అధిగమించడానికి ఎన్‌హెచ్‌ఎం ద్వారా రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి డీఎస్‌సీ ద్వారా ఫిబ్రవరి 15లోగా పూర్తి చేస్తాం. కొన్ని వైద్యుల పోస్టులు ప్రభుత్వం నుంచి భర్తీ కావాల్సి ఉంది అన్నారు.
 108 అత్యవసర వైద్యసేవల తరలింపు వాహనాల ద్వారానే రోగులను తరలించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే రోగుల తాకిడి, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రికి చెందిన రెండు అంబులెన్స్‌లు మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులందరికీ వైద్యసేవలు అందించడం వల్ల ఆసుపత్రికి నిధులు ట్రస్టు ద్వారా రావడంతోపాటు వైద్యులకు ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. ఆరోగ్యశ్రీలో నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌ ఉండాలన్నారు.  వెంటిలేటర్లు, సర్జికల్‌ మైక్రోస్కోపులు ఎప్పటికప్పుడు రిపేరు చేయించి రోగులకు అందుబాటులో ఉన్న పరికరాలతో గరిష్టంగా వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. 300 ఎంఏ ఎక్స్‌రే మిషన్స్‌ ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థల సహకారం కోరతామని, చిరుద్యోగులకు సంబంధించి ఏడు కేటగిరీలను గుర్తించామని, వీటిలో మూడు కేటగిరీల ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన కేటగిరీ ఉద్యోగుల అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. చిన్న చిన్న అవసరాలకు ప్రభుత్వం వైపు చూడకుండా ఆరోగ్యశ్రీ హెచ్‌డీఎస్‌ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఔషధాల కొరత ఉంటే ఏపీఎంఎస్‌ఐడీసీలో ధ్రువీకరణ పొంది నిర్ధారిత రేట్లకు బయటి మార్కెట్లో మందులు కొనుగోలు చేసి రోగులకు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీ, ఆసుపత్రి ఆవరణలోని అన్న క్యాంటీన్లను పరిశీలించారు. సమావేశంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడారు. జేసీ కీర్తి చేకూరి, కమిషనర్‌ అభిషిక్త్‌కిషోర్‌, సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీసీకే నాయక్‌, ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌ సతీష్‌కుమార్‌, ఆర్‌ఎంవో ఆనంద్‌, ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి డాక్టర్‌ పద్మశ్రీ, వైసీపీ నాయకుడు చందన నాగేశ్వర్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ సీతారామరాజు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కోమల పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:14:57+05:30 IST