Advertisement
Advertisement
Abn logo
Advertisement

వచ్చామా..! పోయామా..!!

ఒంగోలు తహసీల్దారు కార్యాలయ తీరు 

అందుబాటులో ఉండని ఆర్‌ఐ, వీఆర్వోలు

- సంతకాల కోసం రోజుల తరబడి ఎదురు చూపులు

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 6 : పౌర సేవలు అందించడంలో ఒంగోలు తహసీల్దారు కార్యాలయ ఉద్యోగులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. సోమవారం ఆంధ్రజ్యోతి  కార్యాలయాన్ని విజిట్‌ చేయగా అధికారులు వచ్చామా.. పోయామా.. అన్నట్లుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు తహసీల్దారు, ఇతర సిబ్బంది కనిపించినా, ఫైళ్లజోలికెళ్లలేదు. 11.10 గంటలకు తహసీల్దార్‌ బయటకు వెళ్లిపోయి తిరిగి 12.30 గంటలకు ఆఫీసుకు వచ్చారు. ఆర్‌ఐ, వీఆర్వోలు అసలు కార్యాలయానికే రాలేదు. పలువురు దరఖాస్తుదారులు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎదురు చూసినా సంబంధిత ఉద్యోగులు లేక పోవడంతో ఉసూరుమంటూ వెళ్లారు.  వాళ్లు రారు.. సంతకాలు పెట్టరు అంటూ పనుల కోసం వచ్చిన ప్రజలు అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత వారం పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే లేడని, కనీసం సమాధానం కూడా చెప్పేవారు లేరని పలువురు బాధితులు ఆంధ్రజ్యోతి ఎదుట వాపోయారు. కార్యాలయంలో ఆఫ్‌లైన్‌ వ్యవహారాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. పలువురు అధికార పార్టీ నాయకులు, రియల్టర్లు మధ్యాహ్నం 1 గంట తర్వాత కార్యాలయానికి రావడంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కార్యాలయంలో హడావిడి కనిపించింది. వీఆర్వోలు ఇద్దరు సెలవులో ఉండగా మరొకరు ఎప్పుడొస్తారో తెలియదని సిబ్బంది తాపీగా సమాధానమిచ్చారు. 


Advertisement
Advertisement