ఓటేసిన జనాన్ని ఎడాపెడా బాదేశారు

ABN , First Publish Date - 2021-06-10T06:12:29+05:30 IST

జనానికి రోజువారీ అవసరమయ్యే వస్తువుల ధరలు 30 శాతం నుంచీ వంద శాతం పెరిగిపోయాయి.

ఓటేసిన జనాన్ని ఎడాపెడా బాదేశారు

చుక్కలు తాకుతున్న ధరలు

దిగజారుతున్న బతుకులు

 ప్రజలు ఆశాజీవులు. తమ బతుకుల్లో వెలుగు నింపేందుకు ఎవరో వస్తారనే ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. కొత్త నాయకుల మీదా, కొత్త ప్రభుత్వాల మీద కొండంత నమ్మకం పెంచుకుంటారు. ఒక్క ఛాన్సిద్దాం అనుకుంటారు. ప్రజలు మంచివాళ్లు, క్షమా గుణంగలవాళ్లు. ఆశలన్నీ కుప్పకూలిపోతున్నా తమ ఖర్మ అని తమనే నిందించుకుంటారు. అయితే ఎక్కడో లోపల్లోపల మాత్రం అసంతృప్తి అగ్గి రగులుతూనే ఉంటుంది. ఎన్నికలప్పుడే అది భగ్గున రేగుతుంది. రెండేళ్ళుగా పెరుగుతున్న ధరలతో సతమతం అవుతున్నా నోరుమెదపని, రోడ్డెక్కని, పిడికిలి బిగించని ప్రజల తీరే ఇందుకు నిదర్శనం.


తిరుపతి-ఆంధ్రజ్యోతి:    రెండుమూడేళ్ళుగా పెరగడమే తప్ప ధరలు తగ్గడం అన్నదే లేదు.  కూరగాయల నుంచీ సరుకుల వరకూ... వంట గ్యాస్‌ నుంచీ డీజిల్‌, పెట్రోలు వరకూ... విత్తనాలు, ఎరువుల నుంచీ కూలీ ఖర్చుల వరకూ... ఇసుక నుంచీ సిమెంటు వరకూ... ఆటో నుంచీ బస్సు ఛార్జీల వరకూ...  వస్తు, సేవల ధరలన్నీ  మండిపోతున్నాయి. జనానికి రోజువారీ అవసరమయ్యే వస్తువుల ధరలు 30 శాతం నుంచీ వంద శాతం పెరిగిపోయాయి. అసలే కరోనా సృష్టించిన కల్లోలంతో వ్యాపారాలు, ఉపాధి అవకాశాలూ మందగించి ఆదాయాలు పడిపోయిన కాలంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. 


కడుపు కట్టుకోవాల్సి వస్తోంది


నిత్యావసర వస్తువుల ధరలు 2018తో పోలిస్తే 30 నుంచీ 50 శాతం దాకా పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా వాడే సరుకులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. దీంతో ఈ వర్గాలకు చెందిన కుటుంబాలు సరుకుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగటున నెలవారీ కొనుగోలు చేసే సరుకుల పరిమాణాన్ని కొందరు తగ్గించుకుంటూండగా, మరికొందరు కొన్ని రకాల సరుకులను తాత్కాలింకగా జాబితా నుంచీ తొలగించేస్తున్నారు. కడుపుకు తినే తిండి విషయంలో కూడా పొదుపు అనివార్యమవుతోంది. 

సరుకు పేరు 2018 ఏప్రిల్‌లో ధర 2021 జూన్‌లో ధర

------------------------------------------------------------------------------------------ 

జిలకర మసూర బియ్యం (25 కిలోలు) 850 1200

కంది పప్పు (కిలో)       80  120

ఉద్దిపప్పు (కిలో)      70  120

పెసర పప్పు (కిలో) 70  115

సెనగ నూనె (లీటరు)         125  180

పామాయిల్‌ (లీటరు)  60  140

సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ (లీటరు)  80  170

చింతపండు  (కిలో)          80  120

చక్కెర (కిలో)          28   38

గోధుమ పిండి (కిలో)  22   30

మైదా పిండి (కిలో)          20   30

బ్యాంబినో సేమియా (కిలో)  45   60

ఉప్మా రవ్వ (కిలో)           32   42

ఎండుమిరప (కిలో)  95  160

తెల్లగడ్డలు (కిలో)           60  130

ఎండు కొబ్బరి (కిలో)   100  160


వంట గ్యాస్‌ భగభగ!


 సామాన్య జనం పాలిట వంట గ్యాస్‌  మోయలేని భారంగా మారుతోంది. రెండు దశాబ్దాలకు పైబడి వంట చెరకు నుంచీ వంట గ్యాస్‌ వినియోగానికి జనం అలవాటు పడిపోయారు.  వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర గత రెండేళ్ళలో రూ. 103.50 పెరిగింది. అదే సమయంలో కేంద్రం ఇచ్చే సబ్సిడీలో రూ. 218.52 కోత పడింది. ఈ రెండు పరిణామాలతో గత రెండేళ్ళలో మొత్తంగా వినియోగదారుడిపై రూ. 322.02 భారం పెరిగింది.


ఏడాది గ్యాస్‌ ధర సబ్సిడీ కస్టమర్‌ భరించింది

 2019 ఏప్రిల్‌ రూ. 740.00 రూ. 238.26 రూ. 501.74

 2021 జూన్‌ రూ. 843.50 రూ.  19.74 రూ.          823.76


పెట్రోలు మండుతూనే ఉంది


పెట్రోలు, డీజిల్‌ వంటి వాహన ఇంధనాల ధరలు రెండేళ్ళలో భారీగా పెరిగాయి. జిల్లాలో కనీసం ద్విచక్ర వాహనం లేని కుటుంబమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. పలు కుటుంబాలలో ఒకటికి మించి కూడా వుంటున్నాయి. ఇక తిరుపతి, చిత్తూరు నగరాలు మొదలుకుని మున్సిపల్‌ పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల దాకా ఇవాళ ఆటోరిక్షాల వినియోగం పెరిగిపోయింది. దానికనుగుణంగా పెట్రోలు, డీజిల్‌ వినియోగం కూడా పెరిగిపోతోంది. ఏరోజుకారోజు ధరల్లో హెచ్చతగ్గులుంటున్నాయి. పేద, మధ్యతరగతి జనంపై విపరీతమైన భారం పడుతోంది. తిరుపతి, చిత్తూరు వంటి నగరాల్లో షేర్‌ ఆటోల, సాధారణ ఆటోల కనీస ఛార్జీలు  రెట్టింపయ్యాయి.


ఇంధనం 2019 2021 పెరుగుదల

---------------------------------------------------------------------------------- 

పెట్రోలు(లీటరు) రూ. 79.82 రూ. 100.40 రూ. 20.58

డీజిల్‌ (లీటరు) రూ. 76.23 రూ.  95.60          రూ. 19.37

షేర్‌ ఆటో కనీస ఛార్జి రూ. 10.00 రూ.  20.00          రూ. 10.00

సాధారణ ఆటో ఛార్జీలు రూ. 50.00 రూ. 80-100          రూ. 30-50


బరువైన సేద్యం


విత్తనాలు, కూలీల ధరలు పెరిగిపోవడంతో జిల్లాలో రైతాంగానికి సేద్యం భారంగా 

మారుతోంది. ముఖ్యంగా గత రెండేళ్ళలో ధరల్లో పెరుగుదల ఆందోళన కలిగించే తీరులో వుంటోంది. జిల్లాలో రైతులు ప్రధానంగా పండించేది వరి, వేరుసెనగ, టమోటా పంటలే. వీటిలో మెజారిటీ  రైతులు వినియోగించే విత్తన రకాల ధరలు పరిశీలిస్తే ప్రతిదీ కనీసం 20 శాతానికి మించి ధరలు పెరిగాయి. 


విత్తనాలు 2019 2021   తేడా

--------------------------------------------------------------------------- ----

వరి ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 (20 కిలోలు) రూ.  800 రూ. 1000   రూ.  200

టమోటా సాహో (20 వేల మొక్కలు) రూ. 5000 రూ. 6000   రూ. 1000

వేరుశెనగ కె-6 (60 కిలోలు) రూ. 3000 రూ. 4000   రూ. 1000

ట్రాక్టర్‌ (ఎకరా దున్నేందుకు) రూ. 4000 రూ. 4800   రూ.  800


ఇల్లు కట్టలేం స్వామీ!


భవన నిర్మాణ వ్యయం జనాన్ని బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్ళ నుంచీ నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సిమెంట్‌ ధరలు నామమాత్రంగా పెరగగా మిగిలిన సామగ్రి అనూహ్య రీతిలో ఖరీదుగా మారాయి. ఉదాహరణకు సిమెంట్‌ బస్తా ధర ఈ రెండేళ్ళలో కేవలం రూ. 30 మాత్రమే పెరగగా కారుచౌకగా లభించాల్సిన ఇసుక ధరలు భరించలేనంతా పెరిగాయి. స్టీలు,  నిర్మాణ సామగ్రికి చెందిన ప్రతి వస్తువు ధరా పెరిగిందనే చెప్పాలి. మొత్తంమీద చూస్తే నిర్మాణ వ్యయం 50 శాతం దాకా పెరిగింది.


సామగ్రి 2019 2021 పెరుగుదల

-----------------------------------------------------------------------------------------------

సిమెంట్‌ (బస్తా) రూ. 380 రూ. 410 రూ. 30

స్టీలు (టన్ను) రూ. 53 వేలు రూ. 63 వేలు రూ. 10 వేలు

ఇసుక (ట్రాక్టర్‌) రూ. 3 వేలు రూ.    6 వేలు         రూ. 3 వేలు

బాండు రాళ్ళు (ట్రాక్టర్‌)రూ. 4 వేలు రూ. 5500 రూ. 1500

ఇటుక (ట్రాక్టర్‌) రూ. 6500 రూ. 9500 రూ. 3 వేలు

గ్రావెల్‌ (ట్రాక్టర్‌) రూ. 1000 రూ. 1500 రూ. 500

మొరం మట్టి రూ.  300   రూ.  600 రూ. 300

సన్న కంకర (ట్రాక్టర్‌) రూ. 2700 రూ. 3600 రూ. 900

లావు కంకర (ట్రాక్టర్‌) రూ. 2500 రూ. 3500 రూ. 1000 

కలప (ఘనపుటడుగు) రూ.  600 రూ. 1000 రూ.  400 

Updated Date - 2021-06-10T06:12:29+05:30 IST