నిబంధనల మేరకు పరిహారం

ABN , First Publish Date - 2022-01-22T05:42:55+05:30 IST

ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వాసితులకు పరిహారం ఇస్తామని ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు.

నిబంధనల మేరకు పరిహారం
అధికారులతో వాగ్వాదం చేస్తున్న ప్లాట్ల యజమానులు

 ఆర్డీవో భూపాల్‌రెడ్డి 

అధికారులతో నిర్వాసితుల వాగ్వాదం

భువనగిరి రూరల్‌, జనవరి 21: ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వాసితులకు పరిహారం ఇస్తామని ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి అన్నారు. బస్వాపురం రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతున్న బీఎన్‌తిమ్మాపురం రెవెన్యూ పరిధిలోని భూనిర్వాసితులతో స్థానిక జూనియర్‌ కళాశాల ఆవరణలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌ విలువ గజానికి రూ.400 ఉండగా, దానికి మూడు రెట్లు రూ.1200 చెల్లిస్తామన్నారు. దీంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం గజానికి రూ.15వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆర్డీవో పేర్కొనగా, రెవెన్యూ, ప్రాజెక్టు అధికారులతో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. కాగా, రిజర్వాయర్‌లో 250ఎకరాలకు సంబంధించి 3246మంది ప్లాట్లు ముంపునకు గురవుతున్నాయి. సమావేశంలో తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ కుర్షిద్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్లాటుకు ప్లాట్‌ ఇవ్వాలి : పుట్ట అనిత, హైదరాబాద్‌, కాచిగూడ

బీఎన్‌.తిమ్మాపురం శివారులోని ఓ వెంచర్‌లో 2011లో రూ.1.50లక్షలు చెల్లించి 200గజాల ప్లాట్‌ కొనుగోలు చేశా. ఎల్‌ఆర్‌ఎ్‌సకు సైతం దరఖాస్తు చేసుకున్నా. ప్రస్తుతం ఆ ప్లాట్‌ ధర రూ.30 లక్షలకు పైగా ఉంది. ప్రభుత్వం మాత్రం రూ.2లక్షల పరిహారం ఇస్తానంటోంది. ప్లాటుకు బదులు ప్లాట్‌ ఇవ్వాలి.


మార్కెట్‌ ధర ప్రకారం చెల్లించాలి :  కందగట్ల సరిత, వరంగల్‌ జిల్లా పరకాల 

భవిష్యత్‌లో పిల్లలకు ఉపయోగపడుతుందని 2010లో రూ.1.40లక్షలకు 200 గజాల ప్లాట్‌ కొనుగోలు చేశా. 12 సంవత్సరాల అనంతరం గజానికి రూ.1200 చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదు. అలాగైతే ఆర్థికంగా నష్టపోతాం. ప్రాజెక్టు నిర్మాణానికి మేం వ్యతిరేకం కానప్పటికీ, ప్లాట్‌కు బదులుగా మరో ప్లాట్‌ ఇవ్వాలి.

Updated Date - 2022-01-22T05:42:55+05:30 IST