గుర్తింపు లేని విదేశీ యూనివర్శిటీలపై డీజీపీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-09-26T10:59:06+05:30 IST

యూజీసీ గుర్తింపు లేని విదేశీ యూనివర్శిటీలు డబ్బులు తీసుకొని గౌరవ డాక్టరేట్లు ఇస్తూ విద్యావ్యవస్థను,

గుర్తింపు లేని విదేశీ యూనివర్శిటీలపై డీజీపీకి ఫిర్యాదు

కరీంనగర్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యూజీసీ గుర్తింపు లేని విదేశీ యూనివర్శిటీలు డబ్బులు తీసుకొని గౌరవ డాక్టరేట్లు ఇస్తూ విద్యావ్యవస్థను, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని, గౌరవ డాక్టరేట్‌ పొందినవారు తమ పేరు ముందు డాక్టర్‌ అన్న పదం వాడితే క్రిమినల్‌ కేసులు పెడతామని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌. శ్రీనివాస్‌, ప్రకాశ్‌హొల్లాలు హెచ్చరించారు. శుక్రవారం ఫిలింభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్‌ పీస్‌ యూనివర్సిటీ, మరో మూడు విదేశీ సంస్థలు ప్రతి ఏడాది గౌరవ డాక్టరేట్ల అమ్మకాలతో కోట్లు సంపాదిస్తున్నాయని అన్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు, కానిస్టేబుళ్లు గౌరవ డాక్టరేట్లు పొం దామని సమాజాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. దీనిపై  డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 


కరీంనగర్‌కు చెందిన కస్తూరి శ్రీనివాస్‌ వరప్రసాద్‌ అనే ఇంజనీరింగ్‌ నిరుద్యోగి ఒక స్నేహితుని ద్వారా ఏజెంట్‌ను సంప్రదించి రూ. 20 వేలు చెల్లించి డాక్టరేట్‌ పొందానని, యూనివర్సిటీల మోసాలు బయటపెట్టేందుకు లోక్‌సత్తాను ఆశ్రయించానని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అన్యాయాల్ని అరికట్టేందుకు ముందుకు వచ్చిన ఆ యువకుడిని లోక్‌సత్తా అభినందించింది. ఈ సమావేశంలో లోక్‌సత్తా జిల్లా బాధ్యులు ఆర్‌ చంద్రప్రభాకర్‌, సయ్యద్‌ ముజఫర్‌, అరుణ్‌, నాగమోహన్‌, కొండాల్‌రావు, చందర్‌, మునీర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T10:59:06+05:30 IST