24, 25 తేదీల్లో పూర్తి లాక్‌డౌన్... సీఎం ప్రకటన

ABN , First Publish Date - 2021-07-21T23:01:30+05:30 IST

ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు..

24, 25 తేదీల్లో పూర్తి లాక్‌డౌన్... సీఎం ప్రకటన

తిరువనంతపురం: ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 3 లక్షల పరీక్షలు లక్ష్యంగా 'మాస్ టెస్టింగ్ క్యాంపైన్'ను నిర్వహించాల్సిందిగా కూడా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది. 2021 జూన్ 12, 13న జారీ చేసిన నిబంధనలే ఈనెల 24, 25 (శని, ఆది) తేదీల్లో వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ మైక్రో కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించాలని,  సాధ్యమైనంత త్వరగా కొత్త కేసులు అదుపు చేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.


కేరళ ప్రభుత్వం ఈనెల 16న రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌ను ఉపసంహరించుకుని, బక్రీద్ సందర్భంగా వస్త్ర, ఆభరణ, పాదరక్షల దుకాణాలను అనుమతిస్తూ మూడు రోజుల పాటు ఆంక్షల సడలింపు నిర్ణయం తీసుకుంది. కేరళ సర్కార్ ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మూడు రోజుల సడలింపుపై వివరణ ఇవ్వాలని ఈనెల 19న కేరళ సర్కార్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ట్రేడర్ల డిమాండ్లకు తలొగ్గి ఆంక్షలను సడలించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. ప్రజల జీవించే హక్కుకు భంగం కలగరాదని, ఆంక్షల సడలింపుల కారణంగా వైరస్ మరింత వ్యాప్తి చెందినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలకు ఆదేశించాల్సి వస్తుందని కూడా కేరళ సర్కార్‌ను కోర్టు హెచ్చరించింది. దీంతో, ప్రస్తుతానికి కోవిడ్ ఆంక్షలను సడలించవద్దని, శుక్రవారంనాడు అదనంగా మూడు లక్షల కోవిడ్ టెస్టులు జరపాలని ముఖ్యమంత్రి విజయన్ ఆదేశాలిచ్చారు. కేరళలో కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగానే కొనసాగుతోంది. ప్రతిరోజు 10,000 నుంచి 15,000 వరకూ కేసులు నమోదవుతున్నాయి.

Updated Date - 2021-07-21T23:01:30+05:30 IST